ఆంద్ర, తెలంగాణా వివాదాలకు డిల్లీలోనే పరిష్కారం
posted on Dec 2, 2014 5:41AM
తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావలసిన జలాలను కేటాయించవలసిందిగా కృష్ణా ట్రిబ్యునల్ ను ఆదేశించమని కోరుతూ తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో నిన్న ఒక కోర్టులో పిటిషను వేసింది. ఆంద్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, నాలుగు వారాలలో దీనిపై స్పందించాల్సిందిగా ఆదేశించి ఈ కేసును ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణా ప్రభుత్వంపై పిర్యాదు చేస్తూ కేంద్రానికి ఒక లేఖ వ్రాసింది. కృష్ణాబోర్డు మరియు అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందకుండా, కనీసం వాటికి తెలియజేయకుండా తెలంగాణా ప్రభుత్వం కృష్ణా నదిపై జూరాల-పాకాల మరియు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్దం అవుతోందని, ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు గల అవకాశాలను అధ్యయనం చేయడానికి తెలంగాణా ప్రభుత్వం తన బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించిందని పేర్కొంటూ, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న తెలంగాణా ప్రభుత్వాన్ని దారిలో పెట్టేందుకు కేంద్రమే చొరవ తీసుకోవాలని కోరుతూ లేఖ వ్రాసింది.
నీళ్ళు, విద్యుత్, ఉమ్మడి పరీక్షలు వంటి వివిధ అంశాలలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిత్యం జరుగుతున్న యుద్దాలను పరిష్కరించలేక చేతులెత్తేసిన గవర్నర్ నరసింహన్ కూడా నిన్న డిల్లీ వెళ్ళారు. అక్కడ సంబంధిత కేంద్ర మంత్రులను, ఉన్నతాధికారులను కలిసి వారికి ఈ వివాదాల గురించి వివరించనున్నారు.
ఈ సమస్యలన్నిటినీ చర్చల ద్వారా రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకోగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఇరు ప్రభుత్వాలు పంతాలకు, పట్టింపులకీ పోతుండటంతో ఇప్పుడు మళ్ళీ డిల్లీలో పంచాయితీ అనివార్యమయింది. ఈ సమస్యలన్నిటినీ కారణం గత ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన చేయడమే. ఇటువంటి సమస్యలు వస్తాయని దానికి తెలియదని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే స్వయంగా ఆ పార్టీకే చెందిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వీటన్నిటి గురించి యూపీఏ ప్రభుత్వాన్ని, దాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని పదేపదే హెచ్చరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తే కలిగే తన రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించుకొంది గానీ ఆయన హెచ్చరికలను పట్టించుకోలేదు.
అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల మధ్య ఈ నీళ్ళ పంపకాలపై వివాదాలు వస్తాయని చేసిన వాదనలను తెరాస అధినేత కేసీఆర్ కూడా చాలా తేలికగా కొట్టి పడేశారు. చైనా, పాకిస్తాన్ దేశాలతోనే భారత్ నదీ జలాలు పంచుకోగలుగుతున్నప్పుడు, ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలు పంచుకోలేవా? అని చాల తెలివిగా ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో నీళ్ళ పంపకాలపై కేసు వేసింది.
అందువలన ఈ సమస్యలన్నీ ఇక రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పరిష్కారం కావని అర్ధమవుతున్నాయి. కనుక ఇక సుప్రీంకోర్టు మరియు కేంద్రప్రభుత్వమే అంతిమ నిర్ణయాలు తీసుకొని వాటిని యధాతధంగా, ఖచ్చితంగా అమలుచేయవలసిందిగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడమే ఏకైక పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. అయితే అప్పుడు కూడా ఒకవేళ తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఏవయినా నిర్ణయాలు తీసుకొంటే దానిపై కూడా మళ్ళీ పార్లమెంటులో రభస జరిగే అవకాశం ఉంది. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి నిత్యం కత్తులు దూసుకోవడం కంటే అదే కొంత నయం కనుక డిల్లీలోనే ఈ వ్యవహరాలన్నిటిపై అంతిమ నిర్ణయాలు తీసుకోవడం మేలని చెప్పవచ్చును.