యథా సీఎం.. తథా మినిస్టర్.. గాలిలో మేడలు కడుతున్న అంబటి

అవధానాలలో అప్రస్తుత ప్రసంగి అని ఒకరుంటారు. అవధానం రంజుగా సాగుతుండగా.. అప్రస్తుత ప్రశ్నలు వేస్తూ అవధాని దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా అంబటి రాంబాబు అలాంటి అప్రస్తుత ప్రసంగాలు చేయడంలో దిట్ట. తన వ్యాఖ్యలు, విమర్శలతో లేనిపోని వాదనలకు తావిచ్చే యత్నం చేస్తారు. తద్వారా అసలు విషయం పక్కకు పోతుందన్నది ఆయన ఉద్దేశం. విజయవాడలో జరిగిన వైసీపీ సమావేశంలో కూడా ఆయన అలాంటి ప్రస్తావనే తీసుకు వచ్చారు.  

ఇష్టారీతిన దబాయించడం.. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లనడంలో ముఖ్యమంత్రి జగన్ అడుగుజాడల్లో నడుస్తున్న మంత్రులలో అంబటి రాంబాబు ముందువరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. మంత్రిగా తన శాఖపై ఏ మాత్రం అవగాహన లేని అంబటి పోలవరంపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. పోలవరంపై ప్రశ్నించిన జర్నలిస్టును మీడియా సమావేశం నుంచి బయటకు పంపిన ఘనత అంబటిది. అటువంటి అంబటి తాజాగా రానున్న ఎన్నికలలో ఏపీలో 175కు 175 స్థానాలలోనూ వైసీపీ విజయం ఖాయమన్నధీమా వ్యక్తం చేశారు. దీనిని పరిశీలకులు అంబటి పగటి కలల ప్రసంగంగా అభివర్ణిస్తున్నారు. ఆయన ఇదేదో కార్యకర్తలలో ఉత్సాహం నింపడానికో, క్యాడర్ ను కార్యోన్ముఖులను చేయడానికో అయితే అర్ధం చేసుకోవచ్చు.

కానీ ఆయనీ మాటలు మాట్లాడిన వేదిక.. ఆ వేదికపై ప్రస్తావించిన అంశాలూ చూస్తుంటే.. ఆయన భ్రమలలో ఉన్నారనీ, గాలిలో కట్టిన ఇంద్రభవనాల్లో నివసిస్తున్నారనీ అనిపించక మానదు. వైసీపీ ప్లీనరీ సన్నాహకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాలలో భాగంగా విజయవాడలో జరిగిన సమావేశంలో అంబటి మాటలు కోటలు దాటేశాయి.

గడప గడపకూ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారని చెప్పారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలన్నిటినీ అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారని అంబటి అన్నారు. కానీ ఆయనీ మాటలు చెప్పిన రోజే అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్యలో బాగా కోతపెట్టినట్లు జగన్ శ్రీకాకుళంలో ప్రకటించారు. కరోనా కల్లోలం నుంచి రాష్ట్రం బయటపడిందంటే అది జగన్ చలవేనని కూడా సలవిచ్చారు.  

గడప గడపకూలో జనం నిరసన సెగలు, సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర తుస్సు మన్న సంగతిని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారు. తెలుగుదేశం మహానాడుకు వచ్చిన స్పందన గురించిన ప్రస్తావనే లేదు. జనం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ సమస్యలపై నిలదీస్తున్న విషయాన్ని పట్టించుకోనే లేదు. ముఖ్యమంత్రి అన్నారు కనుక తాను కూడా మొత్తం 175 స్థానాలలో విజయం సాధిస్తామని ఓ ప్రకటన చేసేశారు అంబటి.