రెండున్నరేళ్లలో అమరావతి పూర్తి!
posted on Jun 15, 2024 2:21PM
అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయి. ప్రపంచ స్థాయి రాజధాని కావాలన్న ఆంధ్రుల కల అతి త్వరలో సాకారం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రెండున్నరేళ్లలో పూర్తి కానుంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు. చంద్రబాబు హయాంలో అమరావతి దాదాపు పూర్తి కావచ్చిన తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ కొలువుదీరిన క్షణం నుంచీ అమరావతి నిర్వీర్యమే లక్ష్యంగా పాలన సాగింది. కరకట్టపై ఉన్న ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంస పాలన అమరావతిని స్మశానం అనడం వరకూ సాగింది.
అభివృద్ధి పనులను పడకేసేలా చేసి రాష్ట్రాన్ని రాజథాని లేని రాష్ట్రంగా మార్చారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంతంగా జరిపిన పోరాటం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మాత్రమే ముగిసింది. చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఇక అమరావతిని ఆగదన్న విశ్వాసం తమకు ఉందని రైతులు ఆనందంతో చెబుతున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి సాకారం తథ్యమన్న నమ్మకం, విశ్వాసం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర మంత్రిగా నియమితులైన తరువాత అమరావతి రైతులలో ముచ్చటించిన మంత్రి నారాయణ రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు.
ఏపీ ఎన్నికలలో జగన్ పరాజయం పాలైన మరుక్షణం నుంచీ అమరావతి వెలుగులు జిమ్మడం ఆరంభమైంది. చంద్రబాబునాయుడు ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే అమరావతిలో అభివృద్ధి మెలకలు ఆరంభమయ్యాయి. జగన్ నిర్వాకంతో అడవిని తలపించేలా మారిపోయి ముళ్ల కంపలతో నిండిపోయిన అమరాతిలో చెత్తను తొలగించే కార్యక్రమం ఆరంభమైంది. రహదారులకుఇరువైపులా వెలుగులు విరజిమ్మేలా వీధిదీపాలు దేదీప్యమానంగా వెలిగాయి. ఇక చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి, ఆ మరుసటి రోజునే సెక్రటేరియెట్ కు వచ్చి కూర్చున్నారు. దాంతో సెక్రటేరియెట్ లో ఐదేళ్ల కిందటి కళ తిరిగి వచ్చింది. ఇక మిగిలినదంతా లాంఛనమే.
నిర్మాణ పనులు జోరందుకోనున్నాయి. జగన్ నిర్వాకం కారణంగా పడుబడిన నిర్మాణాల మరమ్మతులపై ఇప్పటికే మంత్రి నారాయణ దృష్టి పెట్టారు. ఈ విషయాన్నే ఆయన అమరావతి రైతులతో మాట్లాడుతూ చెప్పారు. అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రానికి పట్టిన జగన్ గ్రహణం వీడిపోయింది. ఇక పనులు పరుగులు పెట్టడమే తరువాయి. అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్లలో పూర్తి చేస్తుందని నారాయణ చెప్పారు. దీంతో భూములిచ్చిన తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న భరోసా అమరావతి రైతులలో వ్యక్తం అవుతోంది.