పవన్ నివాసానికి అల్లు అర్జున్.. విషయమేంటంటే?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వెళ్లారు. గత కొంత కాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను కలవడం ఇటు రాజకీయవర్గాలలోనూ, అటు సినీ పరిశ్రమ వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తించింది.   ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు.. అదే రోజు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు.  ఈ విషయాలేమీ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో మెగా  కుటుంబం నుంచి ఎవరూ బన్నీ బర్త్ డేకి విషెస్ తెలపలేదంటూ కామెంట్లు చేశారు. అలాగే  పవన్ కల్యాణ్ కుమారుడు గాయపడితే బన్నీ కనీసం స్పందించలేదంటూ ట్వీట్లు గుప్పించారు.  

సింగపూర్ లో చికిత్స తరువాత తన కుమారుడు మార్క్ శంకర్ ను పవన్ కల్యాణ్ దంపతులు హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే  అల్లు అర్జున్ సోమవారం (ఏప్రిల్ 14) పవన్ కల్యాణ్ నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటకు పైగా పవన్ నివాసంలోనే ఉన్నారు. దీంతో అల్లు, మెగా కుటుంబాల మధ్య గ్యాప్ అన్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది.