ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటేన ఖరారైంది. వచ్చే నెల 2న ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభ శంకుస్థాపనకు ఆయన హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం (ఏప్రిల్ 15)న ఏపీ కేబినెట్ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధాని పర్యటన గురించి చెప్పారు. మూడేళ్లలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులకు శాశ్వత భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అలాగే రహదారులు కూడా పూర్తి కావాలన్నారు. ఇన్ చార్జ్ మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు మూడు పార్టీల నేతల భాగస్వామ్యం తప్పని సరిగా ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక రెవెన్యూ సంబంధిత అంశాలను సత్వరమే పరిష్కరించాలని, సూర్యఘర్ పథకం అమలును వేగవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.  

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు   రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.  ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం,  అన్ని చర్యలూ తీసుకుంటోంది.