మేడారంలో రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే?

అతిపెద్ద గిరిజన జాతర మేడారం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కేబినెట్ భేటీ సచివాలయంలో కాకుండా మేడారంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆయన నిర్ణయం మేరకు  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

 ఈ నెల 18 సాయంత్రం  మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది.  ఈ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న పురపాలక, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో.. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై శాఖల వారీగా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.  

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈ నెల 18 ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, ఆ తరువాత  సీపీఐ శతాబ్ది వేడుకల్లోనూ పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్కడ నుంచి నేరుగా మేడారంకు చేరుకుని కేబినెట్ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఆ రోజు అక్కడే బస చేసి జనవరి 19న మేడారంలో సమ్మక్క, సారలక్క అమ్మవార్ల నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి హైదరాబాద్ చేరుకుంటారు. అదే రోజు రాత్రి దావోస్ పర్యటనకు బయలు దేరుతారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu