పల్నాడులో దాడులు, హత్యలు నిజమే.. కానీ?

 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో భౌతిక దాడులు, హత్యలు జరిగాయని.. అనేక మంది టీడీపీ సానుభూతి పరులు గ్రామాలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పల్నాడులో పరిస్థితులపై విచారణ చేయాలంటూ.. ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో డీజీపీ ఓ కమిటీని నియమించారు. నెల రోజుల పాటు విచారణ జరిపిన రవిశంకర్ కమిటీ.. గొడవలు, ఘర్షణలు నిజమే కానీ.. టీడీపీ ఆరోపిస్తున్నట్టు వాటికి రాజకీయాలతో సంబంధం లేదని తేల్చి చెప్పింది.

తాజాగా ఏడీజీ రవిశంకర్‌ అయ్యనార్ మీడియా మాట్లాడుతూ.. అవన్నీ రాజకీయ హత్యలు కాదని.. రౌడీగ్రూపు హత్యలేనన్నారు. రాజకీయ గొడవల్లో ఒక్కరు మాత్రమే చనిపోయారన్నారు. 110 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయనడంలో వాస్తవం లేదన్నారు. అన్ని కేసులు రాజకీయ ఘర్షణల కేసులు కావని ఏడీజీ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు నమోదైన 10 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని వెల్లడించారు. 70 మంది వైసీపీ, 41 మంది టీడీపీ వారిపై కేసులు నమోదు చేశామని ఏడీజీ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పిన ఏడీజీ రవిశంకర్‌.. మరోవైపు ఎన్నికల తర్వాత పల్నాడులో అనేక ఘటనలు జరిగాయన్న విషయాన్ని అంగీకరించారు. ఎనిమిది హత్యలు జరిగింది నిజమేనని కూడా అంగీకరించారు. కానీ అవి రాజకీయ ఘర్షణలు కాదని గ్రామాల్లో గ్రూపుల మధ్య జరిగే గొడవలను రాజకీయ ఘర్షణలుగా చెబుతున్నారని పోలీసులు చెబుతున్నారు. అంటే ఘటనలు జరిగాయన్న విషయాన్ని మాత్రం అంగీకరించారు. మరి అలాంటప్పుడు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎలా చెప్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.