వెంకటరెడ్డి అక్రమాల గనిలో తవ్విన కొద్దీ నేరాలు!

పాపం పండటం అంటే ఏమిటో, పాపం పండితే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డికి ఇప్పుడు తెలిసి వస్తోంది. జగన్ హయాంలో నిబంధనలను తుంగలోకి తొక్కి ఇసుక మైనింగ్ అనుమతులు, అమ్మకాలు, టెండర్లు, కాంట్రాక్టుల వ్యవహారంలో  ఇష్టారీతిగా వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి, ఇప్పుడు గతంలో చేసిన పాపాలకు మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జగన్ హయాంలో వీఈ వెంకటరెడ్డి అక్రమాలపై ఏసీబీ అవినీతి నిరోధక శాఖ నజర్ పెట్టింది. వెంకటరెడ్డి అక్రమాలపై దర్యాప్తునకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 కింద అనుమతులను సంపాదించింది. 

జగన్ హయాంలో  ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ ఎండీగా వెంకట రెడ్డి బహువిధాలుగా అక్రమాలకు, అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక మైనింగ్, విక్రయాలు, టెండర్లు, కాంట్రాక్టుల విషయంలో నిబంధనలకు తూట్లు పొడిచి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి.  ఆ ఆరోపణల మేరకు వెంకటరెడ్డి పూర్తిగా వైసీపీ నేతల ఆదేశాల మేరకు పని చేశారు.  అలా పని చేసి ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా చేశారు.  ఆ ఆరోపణల ఆధారంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీన సస్పెండ్ చేసింది.  ఇప్పటికే వెంకటరెడ్డి మైనింగ్ లీజుల కేటాయింపులో పలు ఉల్లంఘనలకు, అవకతవకలకు పాల్పడ్డారని ఏపీబీ నిర్ధారించింది. అలాగే ఇసుక టెండర్ల ఖరారులోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు ఏపీబీ దర్యాప్తులో తేలింది.

ఇప్పుడు అందుకు సంబంధించి ఫైళ్లు, డాక్యుమెంట్ల పరిశీలనలో దిగ్భ్రాంతికర విషయాన్ని ఏపీబీ బయటపెట్టింది. జైపీ పవర్ వెంచర్స్ అనే కంపెనీ అప్పటికే ప్రభుత్వానికి 800 కోట్ల రూపాయలు బకాయి పడి ఉండగా వెంకటరెడ్డి  ఆ కంపెనీకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంతే కాకుండా సుప్రీం కోర్టుకు, హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీలకు తప్పుడు అఫిడవిట్లను సమర్పించారు. ఈ విషయంపైనే ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తున్నది.  ఈ నెల 31న వెంకటరెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది.  అయితే  సస్పెన్షన్ లో ఉండటం వల్ల ఆయన రిటైర్ కాలేరు.  అదలా ఉంచితే గత రెండు నెలలుగా వెంకటరెడ్డి పరారీలో ఉన్నారు. సస్పెన్షన్ నోటీసులు అందుకోవడానికి కూడా ఆయన దొరక లేదు.  మొత్తం మీద వెంకటరెడ్డి కదలికలను ఏసీపీ నిశితంగా పరిశీలిస్తున్నది. ఇప్పటికే మైనింగ్ ఎండీగా ఆయన పాల్పడిన   అవకతవకలు, అక్రమాలపై స్ఫష్టమైన ఆధారాలు లభించడంతో  ఆయ నపై  చర్యలు తప్పవు. కలుగులో దాక్కొన్నా బయటకు తీసుకువచ్చి చట్ట ప్రకారం శిక్ష అనుభవించేలా చేస్తారు.