ఆంధ్రుల మీద కేసీఆర్ ద్వేషం రావణకాష్ఠమే!

 

రావణకాష్ఠం అనేది ఎలా చల్లారకుండా నిరంతరం మండుతూనే వుంటుందో కేసీఆర్‌కి ఆంధ్రుల మీద వున్న ద్వేషం, చులకనభావం నిరంతరం మండుతూనే వుంటాయి. తెలంగాణ ఉద్యమంలో మిగతా అందరూ స్వరాష్ట్రం అనే ఆకాంక్ష మీద తమ ఉద్యమ పునాదులు కట్టుకుంటే, కేసీఆర్ మాత్రం ఆంధ్రుల మీద ద్వేషం అనే పునాది మీద తన ఉద్యమ ప్రస్థానాన్ని సాగించారు. ఆంధ్రుల మీద విద్వేషం చల్లారిపోకుండా ఎప్పటికప్పుడు ఎగదోస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మిగతా పార్టీల వారు, ప్రజా సంఘాల వారు కూడా టీఆర్ఎస్ కంటే ఎక్కువగానే తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించారు. కానీ వాళ్ళెవరూ ఏనాడూ ఆంధ్రులను కించపరిచేలా మాట్లాడలేదు. మా తెలంగాణ మాకు కావాలని ఉద్యమించారే తప్ప, ఆంధ్రుల మీద విషం కక్కలేదు. కానీ కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు ఆంధ్రుల మీద విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆర్ అధికారం చెలాయించిన దాదాపు పదేళ్ళ కాలంలో పైకి ‘మాకు ఆంధ్రుల మీద ద్వేషం లేదు’ అనే మాట పైపైకి చెబుతున్నప్పటికీ, ఈ పదేళ్ల కాలంలో హైదరాబాద్‌లోని ఆంధ్రులు గుండెలు గుప్పిట్లో పెట్టుకుని జీవించారన్నమాట మాత్రం వాస్తవం. అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ నిర్వహించిన ‘సమగ్ర సర్వే’ కార్యక్రమం ఆంధ్రులకు ఎంత ఆందోళన కలిగించిందో అందరికీ తెలిసిందే. కేసీఆర్ పాలన ముగిసి, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని ఆంధ్రులు కొంత ప్రశాంతతను సాధించారు. కేసీఆర్ అండ్ గ్యాంగ్ ఆంధ్రులను ఎంత తిట్టినా, హైదరాబాద్‌లో ఆంధ్రులు హైదరాబాద్‌లో జరిగిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్ అభ్యర్థులనే అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించారు. అయితే ఆ కృతజ్ఞత కూడా బీఆర్ఎస్ నాయకులు చూపించడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్, కేటీఆర్ పలు సందర్భాలలో ఆంధ్రుల మీద తమ ద్వేషాన్ని వెళ్ళగక్కారు.

బీఆర్ఎస్ నరనరాల్లో జీర్ణించుకునిపోయి వున్న ఆంధ్రుల మీద ద్వేషం ఇప్పుడు తాజాగా మరోసారి బయటపడింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆంధ్ర మూలాలు వున్న వ్యక్తి. గతంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీద గెలిచిన ఆయన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన ఎన్నికలలో, 2023లో జరిగిన ఎన్నికలలో ఆయన కేసీఆర్ పార్టీ అభ్యర్థిగానే గెలిచారు. 2023లో ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరడం నేరం కాదుగానీ, బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం మాత్రం నేరం అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి కేసీఆర్ పార్టీలోకి మారిన కౌశిక్ రెడ్డి నానా రచ్చ చేస్తున్నారు. సరే, వీళ్ళ రాజకీయాల సంగతి ఎలా వున్నా, ఈ వివాదం నేపథ్యంలో ఆంధ్రుల మీద బీఆర్ఎస్ నాయకులకు వున్న ద్వేషం మరోసారి బయటపడింది. ఆరెకపూడి గాంధీని కౌశిక్ రెడ్డి ‘ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి’ అనే మాటను ఉపయోగించి విమర్శించడం అనేది తెలంగాణలో వున్న ఆంధ్రులను అవమానించడమే. ఆంధ్రుల మీద ద్వేషాన్ని వెదజల్లడం అనేది బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి కాబట్టి కౌశిక్ రెడ్డి ఆ మాటను ఎలాంటి జంకూ గొంకూ లేకుండా ఉపయోగించగలిగారు. ఆరెకపూడి గాంధీ బతకడానికి వచ్చిన వ్యక్తి అయినట్టయితే, ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు టీఆర్ఎస్‌లోకి తీసుకున్నట్టు? రెండుసార్లు తమ పార్టీ అభ్యర్థిగా ఎందుకు పోటీగా నిలిపినట్టు? కేసీఆర్ తన పార్టీ టిక్కెట్‌ని ఎక్కడినుంచో బతకడానికి వచ్చిన వ్యక్తికి కాకుండా ఇక్కడే భూమిలోంచి బయటకి వచ్చిన వ్యక్తికే ఇచ్చి గెలిపించుకోవచ్చుగా? 

కౌశిక్‌రెడ్డి ఉపయోగించిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. అలా బతకడానికి వచ్చినవాళ్ళు వేసిన ఓట్లతోనే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అన్ని స్థానాలను గెలవగలిగిందని ఆయన అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఆంధ్రులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత నుంచి గానీ, జూనియర్ అధినేత నుంచి గానీ, దారుణమైన కామెంట్ చేసిన కౌశిక్ రెడ్డి నుంచి గానీ క్షమాపణ చెప్పే సూచనలు కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ రావణకాష్ఠంలా బీఆర్ఎస్ పార్టీ మండిస్తున్న ఆంధ్ర ద్వేషాన్ని తెలంగాణలోని ఆంధ్రులు గమనిస్తున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెబుతారు.