దేశంలోనే కాస్ట్లీ కటింగ్..కేవలం రూ.28వేలు

 

గ్రామాల్లో బార్బర్లు కటింగ్ చేస్తే మహా అయితే రూ.20 నుంచి 30 తీసుకుంటారు. అదే పట్టణాల్లో రూ.100 వరకు ఉంటే గణం. అలాంటిది అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి  ఒక చిన్న కటింగ్ చేసి రూ.28,000 సంపాదించాడు. అదెలానో మీరే చదవండి.... నార్వేకు చెందిన హెరాల్డ్ బాల్డర్ చిన్న చిన్న ట్రావెల్ వీడియోలు పోస్ట్‌ చేస్తూ, యూట్యూబర్‌గా అందరికి సుపరిచితుడు. అతడు దేశ విదేశాలు తిరుగుతూ వీడియోలు రూపొందిస్తాడు. ఈసారి అతడు భారత్ పర్యటనకు వచ్చాడు. అహ్మదాబాద్‌లో ఆరు బయట ఒక వీధిలో ఉన్న సెలూన్ వద్దకు వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. తొందరగా ట్రిమ్ చేయమని చెప్పి, తన యూట్యూబ్ చానెల్ కోసం అనుమతి తీసుకొని ఈ ప్రాసెస్ మొత్తాన్ని కేమెరాలో బంధించాడు. మధ్య మధ్యలో  ‘ఈ వ్యాపారం గురించి తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది. ఈ వ్యాపారం ఎలా సాగుతుంది, రోజుకు ఎంతమంది కస్టమర్లు వస్తారు, అలాగే పేవ్‌మెంట్ మీద వ్యాపారాన్ని నిర్వహించడానికి ఎవరికైనా డబ్బు చెల్లించాలా’ అని పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు. 

అలాగే కటింగ్ అయిన తరవాత సెలూన్‌ నడిపే వ్యక్తితో కలిసి సెల్ఫీలు కూడా దిగాడు. ఇంత చేస్తే ఎంత డబ్బు తీసుకుంటాడో అని భావించాడు హెరాల్డ్. కానీ ఆ బార్బర్ కేవలం రూ.20 మాత్రమే అడిగాడు. దాంతో ఆశ్చర్యపోయిన హెరాల్డ్ ..‘ఇదే అసలు నిజాయతీ. అతడు నన్ను రూ.20 మాత్రమే అడిగాడు. అతడు ఎక్కువ అడిగితే కోపం వచ్చేదేమో’ అని వెల్లడించాడు. వెంటనే అతడి జేబులో నుంచి 400 డాలర్లు(రూ.28,000) తీసి సదరు వ్యాపారికి ఇచ్చాడు. ‘నేను ప్రయాణంలో కలిసిన మంచి వ్యక్తికి అదనంగా బహుమతి ఇచ్చాను ’ అని మెచ్చుకున్నాడు. ఆ డబ్బుతో ఏదైనా పరికరం కొనుక్కోమని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని సూచించాడు. ఆ డబ్బు తీసుకొన్న బార్బర్ హెరాల్డ్ కు ఓ కప్పు కాఫీ కొనిచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.