తల్లి, భార్య చేతుల్లో తన్నులు తిన్న ఎమ్మెల్యే

 

మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకోవటం చట్ట రీత్యా నేరం. అయితే చట్టాలను చేసే ఓ ప్రజాప్రతినిధి ఈ చట్టాన్ని మరచి తన తల్లి, మొదటి భార్య చేతుల్లో తన్నులు తిన్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ఆర్ని(ఎస్టీ)నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజు నారాయణ కి 8 ఏళ్ల క్రితం అర్చన తో వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. కాగా ఆయన రెండో పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడో ఏమో మొదటి భార్యని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన మొదటి భార్య, అతని తల్లి ఆయన్ని చితకబాదారు. రాజు నారాయణ తాజాగా తన రెండో భార్య ప్రియాతో కలిసి మంగళవారం 42వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు.

అనంతరం ఓ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో నారాయణ తల్లి, ఆయన మొదటి భార్య అర్చన వారి వాహనాన్ని అడ్డగించి ప్రియాను కిందకి లాగి ఆమెపై దాడి చేశారు. చెంప దెబ్బలు కొడుతూ, తన్నుతూ ఆమెపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ప్రియాను కాపాడేందుకు వాళ్లకు అడ్డుపడిన రాజు నారాయణను కూడా చితకబాదారు. వీరికి అక్కడ ఉన్న స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు. దీనిపై స్పందించిన రైతు నాయకుడు కిషోర్‌ తివారీ మాట్లాడుతూ.. ‘ ఓ ప్రజాప్రతినిధి ఇలా సిగ్గులేకుండా మరో మహిళతో ఉంటూ తన భార్యకు అన్యాయం చేస్తున్నారు. ఆయన ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అర్చనకు, ఆమె ఇద్దరు పిల్లలకు 48 గంటల్లోగా న్యాయం చేయాలి. లేనిపక్షంలో శనివారం రాష్ట్ర పర్యటనకి రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.