ఇది చదివాక మీరు నీటి సంరక్షణలో భాగమవుతారు!

ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్ (A drop of water is a grain of gold) ఎడారి ప్రాంతమైన తుర్క్‌మెనిస్తాన్‌లో నీటిని ఇలా వర్ణిస్తారు. ఒక్క చుక్క నీరు బంగారాన్ని పండిస్తుంది  అనేది దీని అర్ధం. దీన్ని బట్టి వారు నీటికి ఎంత విలువ ఇస్తారు అనేది అర్థమవుతుంది. సహజంగా ఎక్కడైతే ఒక వనరు చాలా తక్కువగా ఉంటుందో.. అక్కడ ఆ వనరు విలువ గరిష్టమవుతుంది. దీన్ని బట్టే ఆ వనరుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తుర్క్‌మెనిస్తాన్‌లో నీటి కొరత చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో అక్కడి ప్రజలు ఎన్నో అవసరాలను తగ్గించుకుని నీటిని పొదుపుచేస్తారు. 

కేవలం ఎడారి దేశాల్లోనే కాకుండా మన భారతదేశంలో కూడా వివిధ ప్రాంతాలు కరువుకు కేరాఫ్ అడ్రస్ గా ముద్రవేయబడ్డాయి. ఆయా ప్రాంతాలలో తాగునీటికి కూడా సతమతమైపోతున్నవారు ఎందరో.. ఇళ్లలో కుళాయిలు తిప్పగానే హాయిగా నీటిధారను ఒడిసిపట్టుకునే ప్రజలు కిలోమీటర్ల కొద్దీ నడిచి బిందెల్లో నీటిని నింపుకుని వచ్చేవారి కష్టాన్ని, వారి ఇబ్బందులను ఒక్కసారైనా గుర్తుచేసుకోవాలి. 

స్నానాల కోసం, ఇంటి అవసరాల కోసం బకెట్ల కొద్దీ నీటిని వృధా చేసేవారు నీటికోసం పడరాని పాట్లు పడుతున్న ప్రజల కోణంలో ఆలోచించాలి. పిల్లల నుండి పెద్దల వరకు నీటి విలువను గుర్తించాలి. హాయిగా మూడుపూటలా తింటున్నామంటే దానిక్కారణం రైతులు పండించే పంటలే.. సగటు రైతుకు పంట దిగుబడి బాగుండాలంటే.. నీటి సరఫరా అంతే బాగుండాలి. మనిషి శరీరంలో 60-70% శాతం నీరు ఉంటుంది. అలాగే భూమిలో కూడా అంతే మొత్తంలో నీరు ఉండాలి. కానీ మనిషి మాత్రం భూగర్భజలాలను దారుణంగా వాడేస్తున్నాడు. 

ఇది కేవలం తుర్క్‌మెనిస్తాన్‌ ప్రజలు పాటించే రోజు అయినా ప్రతి దేశం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ ప్రధాన దేశమైన భారతదేశంలో నీటికి చాలా ప్రాధాన్యత ఉంది. భూగర్భజలాలను ప్రభావితం చేసే ప్రతి అంశం పట్లా అవగాహన పెంచుకోవాలిప్పుడు. 

వాయుకాలుష్యం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నదీ జలాల సంరక్షణ, నీటి కాలుష్యం అరికట్టడం, నీటి పొదుపు, అదే విధంగా చెట్ల పెంపకం, అడవుల సంరక్షణ ద్వారా నీటి వనరులు పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇవి పాటిస్తే.. మన నీటి వనరులు దేశంలో బంగారు సిరులు పండిస్తాయి.

                                   ◆నిశ్శబ్ద.

Related Segment News