శ్రీ రామనవమికి భద్రాద్రిలో భారీ బందోబస్తు
posted on Apr 6, 2025 7:24AM

16 మంది డీఎస్పీలు,66 మంది సీఐలు
భద్రాచలంలో ఆదివారం (ఏప్రిల్ 6)జరగనున్న శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సీతారామస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు. గత ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉండటంతో వీఐపీలు పెద్దగా హాజరు కాలేదు. ఈ సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సోమవారం జరిగే పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నారు.
దీనికి తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం స్వామివారి కల్యాణోత్సవం, సోమవారం పట్టాభిషేకం జరగనుంది. కల్యాణోత్సవం జరిగే మిథిలా స్టేడియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చలవ పంతుళ్లు వేశారు. వేసవి వేడికి భక్తులకు దాహార్తిని తీర్చేందుకు మంచి నీటి సౌకర్యం తో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. ఇదే సమయంలో భద్రతా ఏర్పాట్లు కూడా భారీగానే చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా పలువురు వీఐపీలు హాజరవుతుండటం, సరిహద్దు రాష్ట్రంలో మావోల కదలికలు, తాజా ఎన్ కౌంటర్ల నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది . శ్రీ రామనవమి కి భక్తులు కూడా భారీగానే హాజరవుతున్నారు .
దీన్ని దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే 16 మంది డీఎస్పీలు,66 మంది సీఐలు,185 మంది ఎస్సైలు,ఏఎస్సైలు, 304 మంది హెడ్కానిస్టేబుళ్లు, 208 మంది మహిళా పోలీసుసిబ్బంది, 555 మంది కానిస్టే బుళ్లు, హోంగార్డులు 404 మంది ,డాగ్ స్క్వాడ్, రోప్ పార్టీ, 5 బృందాల ప్రత్యేక దళం ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.. ఎక్కడికక్కడ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు, నిఘా విభాగం సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు.