కరోనా విధుల్లో 8 నెలల గర్భిణి.. మగువా నీకు వందనం..
posted on May 16, 2021 12:00PM
ప్రస్తుత కరోనా సమయంలో బయటకి రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. మామూలు వ్యక్తులే గడప దాటాలంటే హడలిపోతున్నారు. అలాంటిది 8 నెలల గర్బిణి.. ఎలాంటి బెరుకూ లేకుండా విధులకు హాజరవుతున్నారు. అందులోనూ.. నిత్యం జనాలతో ప్రత్యక్ష సంబంధం ఉండే వైద్య విధుల్లో పాల్గొంటున్నారు. అందులోనూ, కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ డ్యూటీ చేస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆమె పేరు అన్నపూర్ణ. విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, రావాడ రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎ.ఎన్.ఎమ్ గా సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయమే ఆస్పత్రికి వచ్చి తన విధుల్లో భాగంగా తమ పరిధిలో గల గ్రామాల్లో ఇంటి ఇంటికి వెళ్లి జ్వరాలు, గర్భిణీల వివరాలు సేకరించి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేస్తున్నారు. తరువాత ఆస్పత్రికి వచ్చి అధికారులు తనకి అప్పగించిన పని చేస్తున్నారు.
పీహెచ్‌సీకి వస్తున్న కరోనా రోగులకు కూడా ఈమె సేవలందిస్తుంది. ఆమె గర్భిణి కావటంతో కరోనా విధులకు వెళ్లొద్దని కుటుంబ సభ్యులు, వైద్యులు చెప్పినా ప్రజలకు సేవచేయాలనే తపనతో ఆమె విధులకు హాజరవుతున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కాకపోతే ఇంకెప్పుడు ప్రజలకు సేవ చేస్తామని ఆమె అంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకొంటూ సాధారణ రోగులతో పాటు కరోనా రోగులకు కూడా సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
8 నెలల గర్భిణి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది బెడ్ రెస్ట్ కే పరిమితం అవుతారు. ఈ సమయంలో విశ్రాంతి చాలా అవసరం. అయినా.. అన్నపూర్ణ అవేమీ పట్టించుకోవడం లేదు. ఆమె ఉన్న పరిస్థితిలో సెలవులు తీసుకోవచ్చు. అయినా కరోనా కష్ట సమయంలో సేవ చేసేందుకే ఆమె నిర్ణయించుకున్నారు. మరి కొన్నిరోజుల్లో అమ్మ కాబోతున్నా.. తన వృత్తిలో కరోనా ప్రమాదం పొంచి ఉన్నా.. ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అధైర్యాన్ని దరిచేరనీయకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సేవలందిస్తూ, విధులకు హాజరవుతూ అటు అధికారులు, ప్రజలు నుండి ప్రశంసలు అందుకుంటోంది ఆ కాబోయే అమ్మ..