ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి?వైసీపీ నేతల్లో అలజడి..
posted on Oct 23, 2021 10:05AM
ఆంధ్ర ప్రదేశ్ లో ఓ వంక రాజకీయ రచ్చ జరుగుతోంది. బూతులే రాష్ట్ర అనధికార అధికార ప్రామాణిక భాషగా చెలామణి అవుతున్న రాష్ట్రంలో... మంత్రులే బూతుల మత్రులుగాముద్రవేసుకుని మురిసి పోతున్న రాష్ట్రంలో ... ఒక ప్రతిపక్ష నాయకుడు నోరుజారిన, ఒకే ఒక్క బూతుపదం చుట్టూ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఆ ఒక్క మాటను పట్టుకుని,అధికార వైసీపీ నాయకులు బీపీలు పెంచేసుకుని దాడులు, దండయాత్రలు, బాంబు బెదిరిపులు ఇలా రాష్ట్రాన్ని ఉగ్రవాదుల్లా వనికిస్తున్నారు.
మరోవంక ఎన్నికలు, పొత్తులు, ప్రణాళికల మీద చర్చలు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. అధికార వైసీపేతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకునేందుకు, బీజేపీ సహా ఏ పార్టీ సిద్ధంగా లేవు.వైసీపీ ప్రభుత్వం అరాచక అప్పుల పాలన పట్ల విసిగి పోయిన అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడేందుకు, టీడీపీ, బీజేపీ, జనసేన తిరిగి జట్టుకట్టాలనికోరుకుంటున్నారు. నిజానికి, గత (2019) ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలకు వచ్చిన సీట్ల మధ్య పెద్ద వ్యత్యాసమే ఉన్నా, ఓట్ల మధ్య దూరం అంతగా లేదు. వైసీపీకి 50 శాతం ఓట్లు వస్తే, టీడీపీకి 40 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీ, జనసేనలకు కలిపి ఓ ఆరేడు శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ మూడు పార్టీలు కలిస్తే,కూటమి ఓటు 46-47 శాతానికి చేరుకుంటుంది. ఇక వైసీపే, టీడీపీ కూటమి మధ్య వ్యత్యాసం రెండు మూడు శాతం కంటే దిగువకు పడిపోతుంది. ప్రభుత్వ వ్య్తతిరేకతను కలిపితే ఫలితాలు తిరగబడతాయని, ఓట్ల లెక్కలు చెపుతున్నాయి.
అయితే, పాత మిత్రులు ముగ్గురు మళ్ళీ కలుస్తారా? గతం గతః అని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉమ్మడి శతృవును ఓడించేందుకు చేతులు కలుపుతారా? అంటే, రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయని,రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో
అధికారంలో ఉన్న వైసీపీల మధ్య సీక్రెట్ లవ్ నడుస్తోందన,టీడీపీతో మళ్ళీ పొత్తుకు బీజేపీ కేంద్ర నాయకత్వం అంత సుముఖంగా లేదని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది నిజమే అనుకున్నా, టీడీపీ, జనసేన చేతులు కలిపినా, జగన్ రెడ్డికి దబిడి దిబిడి తప్పదని అంటున్నారు. బీజేపీ, జనసేన ఖాతాలో చేరిన ఆరేడు శాతం ఓట్లలో ఐదున్నర శాతం ఓట్లు జనసేన ఖాతాలోవే, బీజేపీకి వచ్చింది ఒక శాతం కంటే తక్కువే.ఈ నేపధ్యంలో టీడీపీ, జనసేన పొత్తుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా జనసేన అడుగులు ఎటు వేస్తుంది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతు పలికి పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో విభేదించి పవన్ కళ్యాణ్ టీడీపీతో పాటు బీజేపీతో పొత్తుకు స్వస్తి చెప్పారు.2019 ఎన్నికల్లో బీఎస్పీ,
వామపక్షాలతో కలసి ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానానికే పరిమిత అయింది.
ఇక ఆ తర్వాత బీజేపీతో మళ్లీ చేతులు కలిపిన పవన్ కళ్యాణ్, ఈమధ్య కాలంలో బీజేపీకి దూరంగా ఉంటున్నారు.ఈ నేపధ్యంలోనే, అధికారికంగా కాకపోయినా, అనదికారికంగా ఇప్పటికే పొత్తును తుంచేసుకున్నారని,అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు.
ఈమధ్య కాలంలో పవర్ స్టార్ సినిమాల కంటే రాజకీయాల వైపు ఎక్కువ మొగ్గ్గు చూపుతున్నారు. అంతే కాదు, చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకుని, ఫుల్ టైమ్ పొలిటీషియన్’గా ఉంటారని అంటున్నారు.
కాగా ఒక దశలో 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆలోచించిన పవన్ కళ్యాణ్, ఆలోచనలో మార్పు వస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి..మరో వంక టీడీపీ - జనసేన పార్టీలు మళ్లీ చేతులు కలపబోతున్నాయన్న ప్రచారం సాగుతోంది. చివరకు ఏమి జరుగుతోందో ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టం.
అదెలా ఉన్నా మాములుగా అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది, కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాగుతున్న రాజకీయ సందడి చూస్తుంటే, రెండు రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలకు వెళ్ళే ఉమ్మడి వ్యూహం ఏదైనా ఉడుకుతోందా .. లేక కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తోందా ..అనే సదేహాలు బలపడుతున్నాయి. ఏమైనారాష్ట్రంలో ఎన్నికల సందడి అయితే వచ్చేసింది.