కేజీ మ్యాంగో 2 లక్షలు.. మామిడి చెట్లతో కోటీశ్వరులు..
posted on Jun 9, 2021 7:02PM
ఫలాలలో రారాజు మామిడి పండ్లు. తెలుగువారికి బంగినపల్లి అంటే భలే పసందు. మామిడిలో వందల రకాలు ఉంటాయి. అందులో ఖరీదైనవి.. అరుదైనవీ చాలానే ఉన్నాయ్. మన దగ్గర నాణ్యమైన మామిడి పండ్లు కిలో 50 రూపాయలు పలుకుతుంది. అదే మాల్స్‌లో ఆల్ఫోన్సో లాంటి రకాలైతే కేజీ 200లకు పైనే ఉంటుంది. ఆ ధర చూసే.. అబ్బో అంత ఖరీదా అనుకుంటాం. అలాంటిది ఇండియాలోని ఓ రకం మామిడి పండ్ల కిలో ధర ఏకంగా 2 లక్షలు పలికిందంటే నమ్ముతారా? కానీ, ఇది నిజం. ఆ మామిడి ధర.. అక్షరాల రెండు లక్షల రూపాయలు.
ఆ మ్యాంగో జపాన్ బ్రీడ్. 'టాయో నో టామాగో'. జపాన్ దేశంలో ఫుల్ పాపులర్. ప్రపంచంలోకే అత్యంత తీపి కలిగిన మ్యాంగోగా పేరు. చూట్టానికి ఎరుపు రంగులో ఉండటం వలన వీటిని.. 'ఎగ్స్ ఆఫ్ సన్'.. 'సూర్యుని గుడ్లు' అని అంటుంటారు. జపాన్‌తో పాటు వరల్డ్ మార్కెట్‌లో ఈ రకం మ్యాంగోస్‌కు మాంచి ధర పలుకుతుంది.
అయితే.. జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు కాబోలు అందుకే ఆ మామిడిపండ్లకు అంత రేటు అనుకునేరు. కానే కాదు. అది జపాన్ రకమే అయినా.. దాన్ని పండించింది ఇండియాలోనే. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లోని సంకల్ప్, రాణి పరిహార్ అనే కపుల్స్.. 'టాయో నో టామాగో' రకం మామిడిని పండిస్తున్నారు. వారి చెట్లకు కాసిన మామిడి పండ్లు కిలో ధర రికార్డు స్థాయిలో సుమారు 2 లక్షలు పలుకుతోంది. ఆ ధర పెట్టి కొనడానికి వ్యాపారులు పోటీ పడుతున్నారట. ఒక్కో చెట్టుకు దాదాపు 20 పండ్లు కాస్తున్నాయి. ఈ లెక్కన.. ఒక్క చెట్టుంటే.. 40 లక్షల ఆదాయం. అలాంటిది ఇక మామిడి తోటే ఉంటే..! కోటీశ్వరులేగా....