ఈటలను బిజెపి తన వైపు ఎలా తిప్పుకుంది?

ఒకప్పుడు యుద్ధం చేయాలంటే కత్తికి కత్తి తగిలించి చావో రేవో తేల్చుకునేదాకా తలపడేవారు. బలం, బలగం తక్కువున్నాసరే వీరత్వంతో జయించాలని..లేదంటే వీరమరణం పొందాలని అనుకునేవారు. ఇప్పుడు రాజకీయాల్లో ఆ అవసరం లేకుండా పోయింది. కత్తితో పొడవనక్కర్లేదు.. రక్తపు చుక్క కారనక్కర్లేదు.. కాని విజయం సొంతం చేసుకోవచ్చు. మనకంటూ సైన్యం లేకపోయినా.. కొత్త సైన్యాన్నిశత్రువుల నుంచే దిగుమతి చేసుకోవచ్చు. వీటికి కావాల్సింది వ్యూహం.. అధికారం. కింది నుంచి పై దాకా ఇదే తంతు. కాకపోతే అందరి కంటే పైనున్నది ఇప్పుడు కమలనాథులు కాబట్టి.. వారిదే పై చేయి.

బలం పెంచుకోవాలన్నా.. సైన్యాన్ని పెంచుకోవాలన్నా.. రిక్రూట్ మెంట్ కి కొత్త ఇంటర్వ్యూలు పెట్టి..ట్రయినింగులిచ్చి నానా హంగామా చేయనక్కర్లేదు. రాజకీయ మార్కెట్ లో రెడీమేడ్ సరుకుల్లా రెడీమేడ్ నేతలుంటారు. వారిని తమవైపు లాక్కుంటే చాలు. లాగాలంటే చేయి పట్టుకుని లాగనక్కర్లేదు... వారి వెనక నుంచి ఎవరన్నా తరిమితే.. ఇటొచ్చిపడేలా చేసుకుంటే చాలు.. పనైపోతుంది.  బిజెపి ఇదే వ్యూహాన్ని ఫాలో అయిపోతుంది. చేతిలో సీబీఐ, ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్...ఇంకా పరోక్షంగా కొన్ని బలమైన వ్యవస్ధలు చేతిలో ఉన్నాయి.అవన్నీ ఉంటే.. వాటి రికార్డుల్లోకి ఎక్కిన నేతలంతా చేతిలోకి వచ్చినట్లే మరి. అదే జరుగుతుందని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.

మొన్నటికి మొన్న బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని దెబ్బ తీయటానికి ఇదే ఫార్ములా అప్లయ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వచ్చి కమలానికి జై కొట్టారు. ముకుల్ రాయ్ లాంటి నేత వచ్చి బిజెపి పంచన చేరారు. కారణం ఆయనో స్కామ్ లో ఇరుక్కోవటం.. మమతా బెనర్జీ టార్గెట్ చేయడం. ఈ రెండిటి నుంచి తప్పించుకోవాలన్నా, తలదాచుకోవాలన్నా బిజెపి నీడ బెటరనిపించేలా లాబీయింగ్ నడిపించారు.. సక్సెస్ అయ్యారు.అలా అనేకమందిని తెచ్చుకున్నారు. వారి పైన ఆ తర్వాత కేసులున్నాయి గాని..విచారణలు లేవు. అంతెందుకు మమతాబెనర్జీతో తలపడి నందిగ్రామ్ లో గెలిచిన సువేందు అధికారి కూడా సీబీఐ నోటీసులందుకున్నాకే బిజెపిలో చేరారు.

ఇప్పుడు తెలంగాణలో ఈటల రాజేందర్ సంగతిలో అదే జరిగిందని చెబుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డితో మాట్లాడారు... రేవంత్ రెడ్డి చాలా అభిమానం చూపించారు.. కోదండరామ్ తో మంతనాలు జరిపారు.. ఇంతమందితో మాట్లాడి ఇటువైపు రాకుండా బిజెపివైపు వెళ్లిపోయారు. ఎందుకు అంటే? ఈ రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి కేసీఆర్ ని ఢీకొట్టాలి.. మరోవైపు భూకబ్జా కేసుల్లో ఇరుక్కున్నాడు.. ఆ కేసుల నుంచి బయటపడాలి..కేసీఆర్ కురిపిస్తున్న నిప్పుల్లోంచి బయటపడాలంటే బిజెపియే బెటరని వివేక్ ద్వారా బ్రెయిన్ వాష్ కార్యక్రమం నడిపించారు.. అంతే.

ఇంకా చాలా ఉదాహరణలున్నాయి. ఇప్పుడు అసోంలో బిజెపి తరపున సీఎం అయిన హిమంతా బిశ్వాస కూడా కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ లో ఉండగా శారదా కుంభకోణంలో సీబీఐ నోటీసులొచ్చాయి. ఆ తర్వాతే ఆయన భిజెపిలో చేరారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేత నారాయణ రాణే మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నాక బిజెపిలో చేరారు..రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఇక గ్లామర్ బాయ్ జ్యోతిరాదిత్య సింథియా సైతం ఓ ల్యాండ్ వ్యవహారంలో విచారణకు ఆదేశించాక.. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి బిజెపి జెండా కప్పుకున్నారు.  ఇలా నేతలు తప్పులు చేయడం.. ఆ తర్వాత బిజెపి దగ్గరకు చేరదీయడం.. వారి తప్పులు అలాగే ఉంచి.. వారిని కంట్రోల్ లో పెట్టుకోవడం కామన్ అయిపోయింది. ఏపీలో సీబీఐ కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిస్ధితి కూడా అదే. నేతలు సైతం... సిద్ధాంతాలు, ప్రజాప్రయోజనాలు ఎప్పుడో వదిలేశారు. పదవులను వాడుకుని సంపాదించుకోవటం... సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవటానికి అధికారపార్టీల వైపు వెళ్లిపోవడం.. అంతే. నీతి, నిజాయితీ, నైతికత అనే పదాలను వారి డిక్షనరీల్లోంచి శాశ్వతంగా తీసేశారు.