ఆ మంత్రికి పదవి మరో 6 నెలలా.. మూడేళ్లా..? అంతా ఆ స్వామి దయేనా..
posted on Jun 9, 2021 6:53PM
వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి నాని తిట్లతో ఫేమస్ అయితే.. మలుపులు తిప్పడానికి స్క్రూ పట్టుకుని వచ్చే బొత్స ఫేమస్ అయ్యారు. వీరందరి కన్నా ఓ రేంజ్ లో ఫేమస్ అయింది ఈయనే. ఆ మంత్రి పేరు ఒక టైమ్ లో అయితే మార్మోగిపోయింది. ఇప్పుడు మరో ఆరు నెలల్లో జరగబోయే మంత్రివర్గ మార్పుల్లో పీకేయడానికి తయారైన లిస్టులో ఈయన పేరే ఫస్ట్ ఉందనే టాక్ వినపడుతోంది. కాని అదేం లేదని తమ సారుకి స్వరూపానంద స్వామి ఆశీస్సులున్నాయని మరో రెండున్నరేళ్లు కూడా కంటిన్యూ అవుతారని ఆయన వర్గం ధీమాగా ఉంది. ఈ రెండు రకాల టాక్ లతో కాస్త కన్ఫ్యూజింగ్ గానే ఉన్నా.. బాస్ కి ఏం జరిగినా అది హైలెట్ అవటం అయితే పక్కా.
వెలంపల్లి శ్రీనివాస్.. దేవాదాయశాఖా మంత్రి. వివాదాలెక్కువ.. ఆరోపణలెక్కువ.. పని తక్కువ అని ప్రత్యర్ధులు అంటారు. ఆయన మనుషులేమో వయసు తక్కువ, అనుభవం తక్కువ..అయినా పవరెక్కువ, పెర్ ఫార్మెన్స్ ఎక్కువ అని చెప్పుకుంటారు. జూన్ 8కి మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లయింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు ఉంటారని కూడా వారనుకోలేదని జోకులు వినపడ్డాయి..అది వేరే విషయం..మనకనవసరం. ఈయన నియోజకవర్గంలోనే కనకదుర్గ గుడి ఉంది. అందులోనే బోలెడన్ని స్కాములు జరిగాయి. ఈవో నియామకం దగ్గర నుంచి.. వెండి విగ్రహాలు మాయమవడం.. ఉద్యోగులు చేసిన అవినీతి.. కాంట్రాక్టుల్లో అవినీతి..ఆఖరికి ఉద్యోగుల నియామకంలోనూ లేటెస్టుగా అవినీతి.. ఇలా అవినీతికి అవకాశమున్నఎక్కడా వదిలిపెట్టలేదు. మంత్రిగారి ఏం చేస్తున్నారని కొందరు..అసలు మంత్రిగారి ఇన్వాల్వ్ మెంట్ ఉందని కొందరు ఆరోపించారు. అయినా మంత్రిగారు చలించలేదు.
ఇక అంతర్వేదిలో రథం దగ్ధమైన విషయంలోనూ బాస్ సరిగా డీల్ చేయలేకపోయాడు.అటు బిజెపి, ఇటు జనసేన, మరోవైపు నుంచి టీడీపీ ఇంకోవైపు నుంచి టార్గెట్ చేయడంతో.. రెచ్చిపోయారు. చెలరేగిపోయి ఎదురుదాడికి దిగారు. చివరకు సీబీఐకి ఫైల్ పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. నూతన రథం కూడా వచ్చేసింది. కాని ఇప్పటికీ ఆ రథాన్ని ఎవరు తగలబెట్టారో తెలియలేదు. తేలలేదు. రామతీర్ధం ఘటన అయితే మరీ ఘోరం. రాముడి తలనే నరికేశారు. వాళ్లెవరో ఇప్పటికీ అంతుచిక్కలేదు. దానిచుట్టూ రాజకీయం మాత్రం బ్రహ్మాండంగా నడిచింది. కొడాలి నాని తర్వాత నోరు పారేసుకోవడంలో ఎక్స్ పర్ట్ అని.. ఈ ఘటనలు జరిగినప్పుడు మాట్లాడిన మంత్రి వెల్లంపల్లిని చూస్తే అర్ధమైంది. వరుసగా అనేక చోట్ల విగ్రహాలపై దాడులు జరిగాయి. ఎవరు చేశారో ఇప్పటికీ తేల్చలేదు. ఇప్పటికీ ఎక్కడా దేవాలయాల్లో సరైన రక్షణ లేదు. పైగా వైసీపీ ఇన్ ఫ్లూయెన్స్ తో అన్యమతస్తులు చాలా దేవాలయాల్లో పెత్తనాలు చేస్తున్నారు. షాపులు, కాంట్రాక్టులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ వారి కనుసన్నల్లోనే ఉంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వస్తూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా మంత్రి వెల్లంపల్లి మాత్రం నోరు మెదపరు. ఆయనకు రావాల్సింది ఆయనకు రాకపోతేనే ఫ్రస్టేషన్ వస్తుంది గాని..లేదంటే కూల్ గా ఉంటారని ఆయనపై ఆరోపణలు చేస్తుంటారు ప్రత్యర్ధులు.
ఇన్ని జరిగినా ఆయన సేఫ్ గా ఉన్నారంటే ...ఏం జరిగినా ఆయన స్వరూపానందస్వామి దగ్గరకు వెళ్లడం, సలహాలు తీసుకోవడం.. ఆయన డైరెక్షన్ లోనే పని చేయటమే..ఆయనకు శ్రీరామరక్ష లా అయిందని అంటుంటారు. ఆ స్వామి జన్మదినం రోజు ప్రతి గుడిలోనూ ప్రత్యేక పూజలు చేయమని సార్ వల్లే జీవో వెళ్లింది. మంత్రి నిర్వహించిన రివ్యూ సమావేశాన్ని వీడియో కాల్ ద్వారా స్వామిజీ గైడ్ చేశారంటే అర్ధం చేసుకోవచ్చు పరిస్ధితి ఎలా ఉందో. ఇక లోకల్ గా నియోజకవర్గంలో మంత్రి అనుచరులు ఇష్టారాజ్యం దోచుకుంటున్నారని మీడియా కథనాలు వచ్చాయి..వస్తున్నాయి..వస్తూనే ఉన్నాయి. ఇన్నిఉన్నా.. మంత్రి మళ్లీ కొనసాగుతారనే ధీమాలో భక్తులు ఉన్నారు. కాదు ఈసారి షఫిలింగ్ లో ఎగ్జిట్ ఖాయమనే అంచనాలు మాత్రం వస్తున్నాయి.