150 కోట్ల బడ్జెట్ తో నాని మూవీ..!

న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani)కి మినిమమ్ గ్యారెంటీ హీరో అనే పేరుంది. అందుకే అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య నాని సినిమాల బడ్జెట్  పెరుగుతూ వస్తుంది. 'దసరా' మూవీ రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న 'సరిపోదా శనివారం' మూవీ బడ్జెట్ రూ.70 కోట్లకు పైనే అంటున్నారు. ఇదిలా ఉంటే, నాని కొత్త సినిమా ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందనే వార్త సంచలనంగా మారింది.

నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో రూపొందిన సినిమా 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ మూవీ 2023 మార్చిలో విడుదలై.. రూ.120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో రెండో సినిమా రాబోతుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇది నాని కెరీర్ లో 33వ సినిమాగా రానుంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.150 కోట్లని టాక్. ఇది చాలా పవర్ ఫుల్ స్టోరీ అని, 90ల కాలంలో సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని, దీని కోసం భారీ సెట్లు వేయనున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది.