బీఆర్ఎస్ నేత‌ల్లో అరెస్టుల భ‌యం.. ముందు జైలుకెళ్లేదెవ‌రో?

కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ దూకుడు పెంచిందా? అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజుల్లో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై విచార‌ణ‌ల‌తో హ‌డావుడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి,  ఆ త‌రువాత కాస్త నెమ్మ‌దించారు. అయితే, మ‌రోసారి బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీపావ‌ళి పండుగ నాటికి బీఆర్ఎస్ కీల‌క నేత‌ల్లో ఒక‌రిద్ద‌రు అరెస్టు కాబోతున్నార‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇందుకు కార‌ణం మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు. 

బీఆర్ఎస్ సర్కార్‌ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై జరుగుతున్న విచారణ తుది దశకు వచ్చిందని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుంద‌ని పొంగులేటి వ్యాఖ్యానించారు. పొంగులేటి వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టి పారేశారు. ఏం చే్స్తారో చేసుకోండి.. భ‌య‌ప‌డేది లేద‌న్నారు. అయితే, బీఆర్ఎస్ నేత‌ల్లో మాత్రం ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతిపై విచార‌ణ చివ‌రి ద‌శ‌కు చేరింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణతో పాటు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, విద్యుత్ కొనుగోలులో గోల్ మాల్ వ్య‌వ‌హారాల‌పై విచార‌ణసైతం తుది ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్ ల‌లో ఎవ‌రో ఒక‌రు అరెస్టు అయ్యే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. 

బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని నిర్మించారు. ఇందుకోసం ల‌క్ష‌ల కోట్ల‌ను వెచ్చించారు. అయితే, ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించి కాంగ్రెస్  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతిని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయ‌మూర్తితో విచార‌ణ‌కు ఆదేశించారు. విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని సమాచారం. దాని ఆధారంగా కేసులు, అరెస్టులు జరిగే అవ‌కాశం ఉంది. విచారణలో మాజీ ఈఎన్‌సీలు, ఇంజినీర్లు చెబుతున్న దాన్నిబట్టి చూస్తే ప్రాజెక్టులో నిర్మాణంలో అవినీతి, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.  

దీంతో క్రిమినల్ కేసులు పక్కాగా నమోదయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు, కాంట్రాక్టు సంస్థలకు చిక్కులు తప్పేలా లేవు. 2014లో మొదటి దఫా బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో హరీశ్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండో దఫా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను పర్యవేక్షించారు. స్పష్టంగా చెప్పాలంటే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణాల్లో ప్ర‌తిదీ కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింది. కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు ఇంజ‌నీరింగ్ అధికారులు, ప్ర‌భుత్వ అధికారులు న‌డుచుకున్నారు. ఇది బ‌హిరంగ విష‌య‌మే. ప్ర‌స్తుతం క‌ళేశ్వ‌రం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి బ‌య‌ట‌ప‌డినా అది కేసీఆర్ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

 ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపైనా విచార‌ణ ఫైన‌ల్ స్టేజికి వ‌చ్చింది.  బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు, సినీ, వ్యాపార‌, రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌ముఖుల ఫోన్ల‌ను ట్యాపింగ్ చేశార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు ఆదేశించింది. విచార‌ణ క్ర‌మంలో ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఈ విచార‌ణ ప్ర‌క్రియ తుదిద‌శ‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌, కేటీఆర్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మ‌రోవైపు హైద‌రాబాద్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ఫార్ములా కారు రేసులోనూ భారీ ఎత్తున అక్ర‌మాలు జ‌రిగాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపింది. ఈ అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అవ‌స‌ర‌మైతే ఈడీ విచార‌ణ‌కు కూడా ఆదేశించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ధ‌ర‌ణి పోర్ట‌ల్ విష‌యంలోనూ విచార‌ణ జ‌రుగుతుంది. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పెద్దెత్తున రాష్ట్రంలోని భూముల‌ను అన్యాక్రాంతం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటిపైనా విచార‌ణ కొన‌సాగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ హ‌యాంలో ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రం నుంచి జ‌రిపిన విద్యుత్ కొనుగోళ్ల‌లోనూ భారీగా అవినీతి జ‌రిగింద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావిస్తుంది. ఈ అంశంపైనా విచార‌ణ కొన‌సాగుతున్నది.  వీట‌న్నింటిలో చాలా వ‌ర‌కు కేసీఆర్‌, కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావిస్తోంది. విచార‌ణ నివేదిక‌లు పూర్తి స్థాయిలో వ‌చ్చిన త‌రువాత.. నివేదిక వివ‌రాల‌ను బ‌ట్టి త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను తీసుకొనేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. 

దీపావ‌ళి పండుగ నాటికి రాష్ట్రంలో పొలిటిక‌ల్ బాంబు పేలుతుంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు బీఆర్ఎస్ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై, ఫోన్ ట్యాపింగ్ పై విచార‌ణ నివేదిక‌లు రెండుమూడు రోజుల్లో ప్ర‌భుత్వానికి అంద‌బోతున్నాయ‌ని.. దీపావ‌ళి నాటికి అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అరెస్టుల పర్వం మొదలైతే.. ముందుగా జైలుకు వెళ్లేది ఎవరు? ఏ  కుంభకోణంలో ఎవరెవరు ఇరుక్కుంటారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు.. సామాన్య ప్ర‌జ‌ల్లోనూ ఆసక్తి రేపుతోంది. అయితే  ఈ అంశంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి పేల్చ‌బోయే బాంబుల‌ కోసం తాను ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లోనే మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న కొత్త అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. దీంతో కాంగ్రెస్ గూటికి చేర‌బోయే బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు ఎవ‌ర‌నే అంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.