పడవ బోల్తా పడి నైజీరియాలో 103 మంది మృతి
posted on Jun 14, 2023 9:51AM
నైజీరియాలో పెను విషాదం సంభవించింది. అక్కడి క్వారా రాష్ట్రంలో నైగర్ నదిలో పడవ బోల్తాపడి 103 మంది మరణించారు.
ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దాదాపు వంద మందిని అధికారులు రక్షించారు. గల్లంతైన మరి కొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మూడు వందల మంది వరకూ ఉన్నారని చెబుతున్నారు. సామర్థ్యానికి మించి జనం పడవలో ఎక్కడం వల్లే అది బోల్తాపడిందని అధికారులు చెబుతున్నారు.
నైజీరియాలో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. చాలా వరకూ ఇక్కడ ప్రయాణాలకు పడవలనే ఉపయోగిస్తారు. సామర్థ్యానికి మించి ప్రయాణీకులను అనుమతించడం, పడవల నిర్వహణాలోపం కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. గత నెలలో కట్టెలు, వంట చెరకు కోసం పడవలో వెళ్లిన వారిలో 15 మంది మరణించగా, పాతిక మంది వరకూ గల్లంతయ్యారు.