బీజేపీలోకి టీడీపీ ఏమ్మేల్యే ! : క్లారిటీ ఇచ్చేశారు
posted on Jul 9, 2019 8:18AM

తెలుగు రాష్ట్రాల మీద ప్రధాన ఫోకస్ పెట్టిన బీజేపీ ఆపరేషన్ కమలం ప్రారంభించడంతో ఏపీలో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకొంటున్నారు. మొన్నటికి మొన్న నలుగురు రాజ్యసభ సబ్యులే తప్పుకుంటే, టీడీపీ మీద అసమ్మతి ఉన్న నేతలకి పదవులు ఆఫర్ చేసి, వ్యాపారాలు ఉన్న నేతలకి ఐటీ రైడ్స్ భయం చూపించి తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాకికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కేంద్ర మంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుజనా చౌదరి కొద్ది రోజుల క్రితం వల్లభనేని వంశీని బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కిషన్ రెడ్డిని కూడా ఆయన కలవడంతో.. వంశీ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో తాను బీజేపీలో చేరబోతున్న వస్తోన్న వార్తలను వల్లభనేని వంశీ ఖండించారు. గన్నవరం నియోజకవర్గం పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేవలం మర్యాదపూర్వకంగానే తాను కలిశానని వంశీ చెబుతున్నారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి కుటుంబానికి చెందిన స్వర్ణ భారత్ ట్రస్ట్ తన నియోజకవర్గ పరిధిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆ ట్రస్ట్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రతి నేలా తాను హాజరవుతున్నాని బీజేపీతో టీడీపీకి దూరం పెరిగాక కూడా స్వర్ణ భారత్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆయన తెలిపారు. అందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే తాను ఎప్పటికీ చంద్రబాబు నాయుడికి, టీడీపీకి విధేయుడిగా ఉంటానని తన మీద దుష్ప్రచారం చేయొద్దని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్నటికీ పార్టీ మారే ఉద్దేశం లేదని ఆయన స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు.