తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో మూడు రోజులు మకాం దేనికో?
posted on Oct 26, 2015 8:51AM
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ఎదుర్కొనే ప్రశ్న ఆయన డిల్లీ పెద్దలతో ఎందుకు దూరంగా ఉంటున్నారని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ఈ ఏడాదిన్నర కాలంలో ఆయన చాలా తక్కువ సార్లు డిల్లీ వెళ్ళారు. ఆయన కేంద్రప్రభుత్వంతో కూడా గొడవలు పెట్టుకొంటూ, దానికి దూరంగా ఉంటున్నందునే తెలంగాణా రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడంలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆయన డిల్లీ వెళ్లి అక్కడే మూడు రోజులు మకాం వేయబోతున్నట్లు తెలియగానే రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. సీబీఐ కేసు మెడకు చుట్టుకోగానే దానిని వదిలించుకోనేందుకే ఆయన డిల్లీలో పెద్దలను కలిసేందుకు వెళుతున్నారని అందుకే అక్కడ ఆయన మూడు రోజులు మకాం వేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రేపు డిల్లీలో జరుగబోయే నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ్ళ డిల్లీ బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్ నాద్ సింగ్, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తదితరులతో సమావేశం అవుతారని సమాచారం. తెలంగాణాకు కేంద్రం విడుదల చేయవలసిన నిధులు, వివిధ ప్రాజెక్టుల గురించి ఆయన వారితో చర్చిస్తారని తెలుస్తోంది.