ప్రణబ్‌కు వోటు ద్వారా జగన్‌కు మేలు జరగబోతోందా?
posted on Jul 14, 2012 9:16AM
యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందా? లేదా? అన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో ఎంపి సబ్బంహరి నేరుగా ప్రణబ్‌ను కలిసి ఓ 20నిమషాలు పాటు మాట్లాడటం కూడా సంచలనమైంది. అయితే తామేమి మాట్లాడుకున్నామో పత్రికాప్రతినిధులకు చెప్పటానికి సబ్బంహరి ఇష్టపడలేదు. అయితే ఎన్నికల నేపథ్యమే కారణమై ఉంటుందన్నది పరిశీలనలో తేలింది. ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఢల్లీ వచ్చి ప్రధానితో మాట్లాడి వెళ్లాక ఆ పార్టీ తరుపున ప్రణబ్‌ను కలిసినది సబ్బంహరి ఒక్కరే. ప్రధాని తమ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని కోరారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
విజయమ్మ తన కుమారుడు జగన్మోహనరెడ్డిని ఇడి దర్యాప్తు విషయంలో నెమ్మదించేలా చూడాలని ప్రధానిని కోరారని కూడా తెలిసిందే. అయితే ఎంపి సబ్బంహరితో ప్రధాని కోరిక మేరకు విజయమ్మ తమ పార్టీ మద్దతు గురించి తెలియజేశారని సమాచారం. ఒకవేళ ప్రణబ్‌కు మద్దతు ఇవ్వకుంటే ఇడిని తట్టుకోలేమని జగన్ భావించే విజయమ్మ ఢల్లీి ప్రయాణం ఫిక్స్ చేశారని రాజకీయ ఉద్దండులు అప్పట్లో విశ్లేషించారు. ఏదేమైనా తప్పని సరి పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి వై.కా.పా. మద్దతు ప్రకటించే ఉంటుందని పరిశీలకులు తేలుస్తున్నారు. సబ్బంహరి చెప్పకపోయినా దీని గురించి త్వరలో ఎవరో ఒకరు వెల్లడి చేయకుండా దాచలేరన్నది జగమెరిగిన సత్యం. అయితే విషయం విజయమ్మ నోటి నుంచి వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.