జగన్‌పై కేసులు త్వరలో కొట్టేస్తారా ?

జగన్‌ బెయిల్‌ పిటీషన్‌ సుప్రీంకోర్టునుండి విత్‌డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైవుంటాయా అని రాష్ట్రరాజకీయ నాయకులంతా ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. వివారాలలోకి వెళితే వైసిపి పార్టీ తన బద్ద శత్రువైన కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ప్రణబ్‌కు ఓటు వేయడం ద్వారానే రాష్ట్రంలో చాలా విమర్శల పాలయింది. విపక్షాలకు వైసిపి నేతలు  చాలా వివరణలు ఇచ్చుకోవలసి వచ్చింది.అధికార కాంగ్రెస్‌ పార్టీ  రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ వైసిపి కుట్రలపార్టీ అది ఖచ్చింతంగా మా ప్రత్యర్ధి పార్టీనే అని తేల్చిచెప్పడంతో తాత్కాలికంగా దాని విషయం అన్ని ప్రధాన పార్టీలు ప్రక్కన పెట్టాయి.


 

సుప్రీంకోర్టులో జగన్‌కు బెయిలు వచ్చే అవకాశం ఉందని స్వయానా విజయమ్మ చెప్పారు. ఒక వేళ అదే జరిగితే మళ్ళీ జగన్‌వర్గంపై కాంగ్రేసేతర పార్టీలు  దాడి చేసి  వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ  కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందని  ఆరోపించే అవకాశం ఉంది.  ఇప్పుడు ఎందుకిదంతా , ఎలాగూ  జగన్‌ ఇ.డి. విచారణ నుండి తప్పించుకోలేకపోయారు. ఇక నిండా మునిగిన వాడికి చలి ఎందుకనుకున్నారో  ఏమో ఇడి విచారణ కూడా ముగిశాక కడిగిన ముత్యంలా బైట పడాలనే  ఉద్ధేశంతో బెయిలు పిటీషన్‌ వెనుకకు తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కళంకిత మంత్రులకు  న్యాయ సహాయం అందిస్తూ మంత్రులకు అక్రమాస్తులతో సంబంధం లేదని కోర్టుకు సంకేతాలు పంపింది.



రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆత్మరక్షణా చర్యలు జగన్‌కు కలసి వచ్చేలా చేశాయి. ఎలాగూ కొట్టేసే కేసుకు  బెయిలును కాస్త ముందు తీసుకొని ప్రతిపక్షాలకు పని కల్పించడం కన్నా తనను తాను నిరూపించుకొని  బయటపడటం కరెక్టుగా భావించారు.  అదే సమయంలో ఏ ఒక్క ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను  సిబిఐకి  లభించ లేదు  కనుక కోర్టు తనను  నిరపరాధిగా విడుదల చేయగలదు. ఈ సమయంలో బెయిలు పిటీషన్‌ పెట్టుకొని బయటకు వచ్చి విమర్శల పాలవడం కన్నా అన్ని విచారణలు అయిపోయాక నిర్దోషిగా  బయటకు రావడమే మిన్నగా అలోచించి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.