పదే పదే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా? దాని వల్ల కలిగే నష్టాలు తెలిస్తే షాకవుతారు!!

టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా రకాలుగా సులభతరం చేసిందనడంలో సందేహం లేదు. ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాలంటే  ఆటో లేదా టాక్సీ కోసం ఎక్కువసేపు  వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు. వివిధ రకాల యాప్స్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని సౌకర్యవంతంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. షాపింగ్ చేయడానికి చేతిలో క్యాష్ లేకపోయినా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. టెక్నాలజీ మాయ వల్ల చాలా మంది కాలం మొత్తం బిజీ బిజీగా గడుపుతారు. ఈ కారణంగా కనీసం వంట చేసుకోవాలన్నా కష్టంగానే ఉంటుంది చాలామందికి. ఈ కారణంగా నగరాలలో, ఓ మోస్తరు పట్టణాలలో  ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తుంటారు.

 బిజీ జీవితాలకు ఆన్లైన్ ఫుడ్ అనేది శ్రమ తగ్గించి రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. దీని వల్ల  ఇంట్లో కూర్చొని  ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. కానీ ఇంతకు ముందు  ఈ సౌకర్యాన్ని అయిష్టంగా  ఉపయోగించుకునేవారు. ఆన్లైన్ ఆర్డర్ అంటే ఖర్చు నుండి బోలెడు ఆలోచనలు చుట్టుముట్టేవి. కాస్త వంట వస్తే ఎంతో సులువుగా అయిపోయే భోజనం వందలాది రూపాయలు ఖర్చుపెట్టి కొనాలా అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.  సమయాన్ని సంపాదించడానికి వెచ్చించేవారు  వంట చేసుకునే సమయంలో డబ్బు సంపాదించి అందులో కొంత ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందిలే అనే వింత ఆలోచనకు అలవాటు పడ్డారు. ఇక పెద్దవాళ్లు ఇంట్లో లేక అడిగేవారు లేకపోతే ఈ తరం దంపతుల నుండి బ్యాచ్లర్స్ వరకు అందరిదీ ఇదే పంధానే.  తోచినప్పుడల్లా ఫోన్ తీసుకుని ఆర్డర్ పెట్టేయడమే.  నిమిషాల్లో వేడివేడిగా ఆహారం డోర్ డెలివరీ అవుతుంది. ఈ వ్యసనం చాలా దారుణంగా తయారవుతోంది.  ఇది మనిషి శారీరక మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

 ఆన్లైన్ ఫుడ్ తినడం వల్ల జరుగుతున్న సమస్యలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చాలా వరకు  ఫుడ్ డెలివరీ ఎంపికలలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, అలాగే అధిక క్యాలరీలు, తక్కువ పోషకాలు ఉన్న ఆహారాలే ఉంటాయి. కాలక్రమేణా వీటిపై  ఆధారపడటం అసమతుల్య ఆహారం  తీసుకోవడానికి దారితీస్తుంది.  ఇది శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాల లోపానికి దారితీస్తుంది. నేటి కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న ఉబకాయం, అధికబరువు, మధుమేహం వంటి సమస్యకు ఇదిగో ఈ ఆన్లైన్ ఫుడ్ లే కారణమవుతాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తాయి. ఈ రకమైన ఆహారంలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు,  సోడియం ఉంటాయి, ఇది జీవక్రియను దెబ్బతీస్తుంది.  శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.

ఆన్లైన్ ఫుడ్ కు అలవాటు పడేవారిలో బయటపడిన మరొక దారుణ నిజం ఏమిటంటే చిన్నవయసులోనే వస్తున్న గుండె సంబంధ సమస్యలు. అనారోగ్యకరమైన ఆహారాలు అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  స్ట్రోక్‌తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా వేయించిన,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  ఇది ధమనులలో  పేరుకుపోతుంది.


ఫైబర్  పోషకాలు లేని  ఆహారాలు మలబద్ధకం, కడుపులో వికారం,  పేగుల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలకు కారణమవుతాయి.  అలాగే వీటిలో అధిక చక్కెర,  అధిక కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇలాంటి ఆహారాలను  తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఊహించనివిధంగా పెరుగుతాయి.  ఇది క్రమంగా  టైప్-2 డయాబెటిస్,  ఇతర జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది .

ఆహారాన్ని ఆర్డర్ చేసే వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అంటే సాధారణ ఆహారం ఆరోగ్యానికి అలాగే మనస్సుకు కూడా మంచిది. కానీ  వేయించిన, అధిక కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల  అనేక వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. ఇది  ఒత్తిడి, ఆందోళన,  నిరాశకు  కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.


పదే పదే బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం ఖర్చుతో కూడుకున్నది.  ఇది  బడ్జెట్‌ను పాడుచేస్తుంది ఆహారంపై అధికంగా ఖర్చు చేయడం వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ప్యాకేజింగ్,  వ్యర్థాలు తరచుగా ఆహార పంపిణీతో ముడిపడి ఉంటాయి, ప్లాస్టిక్ కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలకు ఇది  దారి తీస్తుంది.

                                                      *నిశ్శబ్ద.

Related Segment News