బీజేపీకీ ట్రిపుల్ తలాఖ్...
posted on Jan 8, 2017 12:26PM

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బీజేపీ పార్టీపై సెటైర్లు విసిరారు. సీపీఎం పార్టీ మూడు నిర్వహించిన సెంట్రల్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన ఇప్పటికే బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైందని.. ఇప్పుడు త్వరలో జరగనున్న యూపీ ఎన్నికల్లో కూడా ఓడిపోతుందని.. ట్రిపుల్ తలాఖ్ పూర్తవుతుందని సెటైర్ వేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఢిల్లీలో తొలి తలాఖ్, బీహార్‌లో రెండో తలాఖ్ ఎదురయ్యాయని, ఇప్పుడు యూపీతో అసలు ట్రిపుల్ తలాఖ్ అంటే ఏంటో బీజేపీకి తెలిసొస్తుందని అన్నారు. కులమతాల ఆధారంగా ఓట్లు అడగకూడదని ఈ మధ్యే సుప్రీంకోర్టు ఆదేశించినా.. బీజేపీ మాత్రం యూపీలో మత అంశాలను తెరపైకి తెస్తోందని... దీనిలోభాగంగానే యూనిఫాం సివిల్ కోడ్, ట్రిపుల్ తలాఖ్ అంశాలను బీజేపీ-ఆరెస్సెస్ తెరపైకి తెచ్చాయని అన్నారు. లౌకికవాద శక్తులు కలిసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఏచూరి పిలుపునిచ్చారు. ఈ దేశంలో బీజేపీ చేసిన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మరెవరూ చేయలేదని.. హిందువుల ఓటు బ్యాంక్ నిలుపుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారని అన్నారు.