అలా అయితే కేసీఆర్ 114 సార్లు తల నరుక్కోవాలి..
posted on Jun 1, 2016 11:05AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో ఆయనకు తోడుగా ఉండి.. ఉద్యమం విజయవంతం అయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముఖ్య భూమిక పోషించింది ఎవరంటే తెలంగాణ ఐకాస ఛైర్మన్ ఆచార్య కోదండరాం గుర్తుకు వస్తారు. అయితే అప్పుడు కేసీఆర్ కు అంత దగ్గరగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా కేసీఆర్ పై, ఆపార్టీపై విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. ఒకానొక సందర్బంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ ఏర్పాటు చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే మరోసారి కోదండరాం.. కేసీఆర్ కు.. కేసీఆర్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా విమర్శలు చేశారు.
కరీంనగర్లో నిర్వహించిన ముస్లిం గర్జన కార్యక్రమానికి హాజరైన ఆయన కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని , బడ్జెట్‌లో వాటో కోసం మైనార్టీలు ఐక్యంగా ఉద్యమించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. గతంలో మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రంగనాథ్ మిశ్రా, సచార్ కమిటీలు వేయగా.. అవి కూడా ఆర్థికంగా, విద్యా, ఉపాధిలో వెనుకబడిన మైనార్టీలకు ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చని సూచించారు. అయినా కూడా ప్రభుత్వం ఆమేరకు నేటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారాయన. అంతేకాదు తాను మాట మీద నిలబడే వ్యక్తినని.. కేసీఆర్ మాట తప్పితే తలనరుక్కుంటానని పదే పదే చెప్పినా.... ఇప్పటివరకు ఆయన 114 సార్లు మాట తప్పారని ఎన్ని సార్లు తల నరుక్కున్నరని కోదండరాం విమర్శించారు.
మరోవైపు కోదండరాం చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. తన రిటైర్మెంట్ తరువాత అక్కున చేర్చుకుని శాసన మండలిలో తనకు స్ధానం కలిపించనందునే కోదండరాం కేసీఆర్‌ని బదనాం చేస్తున్నారన్నది తెరాస వర్గాల వాదన. చూద్దాం ... భవిష్య పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో....