బరువు తగ్గటం

1. బరువు తగ్గతంతో పాటు ఆకలి కూడా తగ్గిందా? జీర్ణాశయ సమస్యలు

2. బరువు తగ్గినప్పటికీ ఆకలి బాగానే వుందా? లేదా మునుపటి కంటే పెరిగిందా? శారీరక క్రియలు వేగవంతమవటం

3. బరువు కోల్పోవటంతో పాటు మీ కళ్లు పసుపు పచ్చగా మారాయా? కామెర్లు (జాండిస్/ హెపటైటిస్)

4. బరువు తగ్గటమే కాకుండా నలతగా, అలసటగా అనిపిస్తుందా? ఇన్ఫెక్షన్

5. బరువు తగ్గటంతోపాటు, మధ్య మధ్యలో జ్వరం వస్తోందా? క్షయవ్యాధి (ట్యుబర్క్యులోసిస్)

6. బరువు కోల్పోవటంతో పాటు కండరాల నొప్పులు, కీళ్ళు నొప్పులు, వపులూ ఉన్నాయా? ఆటోఇమ్యూన్ వ్యాధులు

7. బరువు తగ్గటంతో పాటు అధైర్యం, ఆత్మ స్యూనతా భావాలు బాదిస్తున్నాయా? క్రుంగుబాటు (డిప్రెషన్)

బరువు కోల్పోవటాన్ని ఆయుర్వేదంలో కార్శ్యత్వం అంటారు. బరువును కోల్పోతుంటే దానిని చిన్న విషయంగా కొట్టిపారెయ్య కూడదు. బరువు కోల్పోవడానికి కారణం ఏమై ఉంటుందనేది తరచి చూడటం అవసరం. పోషకాహార లోపం దగ్గర్నుంచీ శరీరపు పనితీరులో లోపం ఏర్పడటం వరకు వివిధ రకాల కారణాలు శరీరపు బరువును తగ్గేలా చేస్తాయి. మీరు బరువెందుకు తగ్గుతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఈ విషయాలు సహాయ పడతాయి.

 

1. జీర్ణాశయ సమస్యలు: బరువు కోల్పోవడంతోపాటు ఆకలి కూడా తగ్గితే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య ఏదన్నా ఉందేమో చూడాలి. అంటే ఛాతిలోమంట, అజీర్తి, గ్యాస్, కడుపునొప్పి, పుల్లటి త్రేన్పులు ఇలాంటివన్న మాట. సాధారణంగా అమాశయపు పూత, కడుపులో అల్సర్లు ఏర్పడటం వంటివి ఇటువంటి వాటికి కారణాలుగా ఉంటాయి. ఒకోసారి అమాశయానికి చెందినా పైభాగం డయాఫ్రం లోనికి చొచ్చుకు వెళ్లినప్పుడు (హాయేటస్ హెర్నియా) కూడా ఇటువంటి లక్షణాలే కలుగుతాయి.

 

జీర్ణక్రియా లోపాలున్నప్పుడు ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకోవాలి, చిన్న నిప్పు కణికమీద గడ్డిపోచల్ని, ఎండుపుల్లల్ని వేస్తూ క్రమ క్రమంగా పెంచుకుంటూ పోతే, అది అత్యంత పెద్దదైన అగ్ని జ్వాలగా మారే అవకాశం ఉంది. అలాగే జీర్ణశక్తి కూడా. దాన్ని నానాటికి వృద్ధి చెందిస్తూ పోవాలనేది ఆయుర్వేద సిద్ధాంతం.

 

పెగుపూత, కడుపులో మంట – ఇవన్నీ 'పిత్త ప్రకోపం' వల్ల ఏర్పడతాయి. పిత్త వ్యాధుల్లో పుల్లటి పదార్థాలను, కారం మసాలాలను వదిలేయాలి. విరేచన కర్మ అనే పద్ధతి ద్వారా పిత్తదోషాన్ని నిర్హరించడానికి వీలవుతుంది.

 

మధ్య వయసులో హఠాత్తుగా ఆకలి తగ్గటంతో పాటు బరువు కూడా కోల్పోతుంటే అమాశయానికి సంబంధించిన క్యాన్సర్ ను గురించి ఆలోచించాలి. ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలి.

 

గృహచికిత్సలు: 1. అతిమధురం, ఎండుద్రాక్ష, గింజలు తీసిన కరక్కాయలను సమాన భాగాలు గ్రహించి చక్కెర కలిపి నూరి ముద్ద చేసి తీసుకోవాలి.

2. నేలవేము, వేపపట్టాలల కషాయాన్ని తేనెతో సహా తీసుకోవాలి.

3. ఉసిరిపండ్ల వరుగు చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా పాలలో కలిపి ఆహారానంతరం రెండు పూటలా తీసుకోవాలి.

ఔషధాలు: అవిపత్తికర చూర్ణం, ద్రాత్రీలోహం, శంఖ భస్మం, కామదుఘారసం, సూతశేఖర రసం, శంఖ భస్మం.

 

2. శారీరక క్రియలు వేగవంతమవటం: థైరాయిడ్ గ్రంథి అసాధారణ స్థాయిలో చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు , మధుమేహం ప్రాప్తించినప్పుడు, విపరీతమైన శారీరక శ్రమ చేస్తున్నప్పుడు బరువు తగ్గుతారు.

 

థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా చైతన్యవంతమైనప్పుడు శరీరపు సహజ కార్యకలాపాలన్నీ వేగవంతమవుతాయి. అంటే, నాడి వేగం పెరుగుతుంది. చర్మం కందినట్లవుటుంది. గుండె వడివడిగా కొట్టుకుంటుంది. ఒకోసారి నీళ్ల విరేచనాలు, కళ్ళు ఉబ్బినట్లుండటం, మామూలు వాతావరణంలో కూడా ఎక్కువగా చమట పట్టడం, శరీరం కంపిస్తుండటం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిలో శరీరం పనితీరుకు సంబంధించిన ప్రతి అంశము వేగవంతమవడం వల్ల మామూలుగా తీసుకునే ఆహారం శరీరానికి సరిపోదు. ఫలితంగా బరువు తగ్గుతారు. థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు చోటుచేసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన, 'సంతర్పణ' ప్రధానమైన మందుల్ని వాడవలసి వుంటుంది.

 

1. మధుమేహం విషయానికొస్తే దానిని గుర్తించడానికి మూత్రపరీక్ష, రక్తపరీక్ష మొదలైనవి ఉన్నాయి. మధుమేహాన్ని ఆహార పదార్థాలను నియంత్రిత ప్రమాణంలో తరచి తరచి వాడుకోవడం, వ్యాయామం, మందులు మొదలైన వాటి ద్వారా అదుపులో పెట్టుకోవాలి. కొంతమంది శారీరకంగా, అసాధారణ స్థాయిలో చురుకుగా వుంటారు. అటువంటి వారు అంత తేలికగా లావుకారు. అది వారి నైజం.

 

గృహచికిత్సలు: 1. పెన్నేరు చూర్ణాన్ని అరచెంచాడు మోతాదుగా పాలలో కలిపి మూడు పూటలా తీసుకుంటే హైపర్ థైరాయిడిజం మూలంగా ఏర్పడిన కార్శ్యత్వం తగ్గుతుంది.

2. రోజు పది మిరియపు గింజలను తమలపాకులో పెట్టి నమిలి మింగి చల్లని నీళ్లు తాగితే కృశించిన వారు లావవుతారు.

3. నేరేడు గింజల చూర్ణాన్నిగాని (పూటకు అరచెందాడు చొప్పున, మూడు పూటలు నీళ్లతో తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

4. నేరేడు గింజలు, పొడపత్రి ఆకు, పసుపు, ఉసిరి, పండ్ల పెచ్చులు, నేల వేము, మెంతులు వీటిని సమానంగా కలిపి పొడి చేసి మూడు పూటలా ఆహారానికి ముందు నీళ్లతో తీసుకుంటే మధుమేహ జనిత కార్శ్యత్వం తగ్గుతుంది.

  ఔషధాలు: అశ్వగంధా ఘృతం, రస సింధూరం తారకేశ్వరం రసం, మామేజ్జక ఘటివటి, జంబ్వాసవం, త్రివంగ భస్మం, సప్తామృత లోహం. బాహ్యప్రయోగం అశ్వగందా తైలం.

 

3. కామెర్లు (జాండిస్ / హైపటైటిస్) కామెర్ల వల్ల బరువు తగ్గుతారు. కళ్ళు పచ్చని రంగులోకి మారడంతో పాటు మూత్రం ముదురు గోధుమ వర్ణంలో వస్తుంటే కామెర్లు వచ్చాయేమో చూడాలి. కామెర్లకు కారణం ఏదైనా కావచ్చు, ఉదాహరణకు కాలేయం వ్యాధిగ్రస్తమవడం, పాంక్రియాస్ (అన్నకోశం దగ్గరగా వుంటూ జఠరరసాన్ని ఉత్పత్తి చేసే (గ్రంథి) వ్యాధి గ్రస్తమవడం, అనువంశికత ప్రధానంగా వచ్చే పెరినీషియస్ ఎనీమియా (రక్తాల్పత), కాలేయానికి క్యాన్సర్ రావడం ఇలాంటివన్నీ కారణాలే! కామెర్లు పిత్తం దూషింపబడటం వల్ల వస్తాయి. దీనికి విరేచన కర్మను చేయించి, తారువాత శమనౌషధాలను వాడవలసి ఉంటుంది. అలాగే, అగ్న్యాశయం (పాంక్రియాస్), పిత్తాశయం (గాల్ బ్లాడర్) రోగగ్రస్తం అయినప్పుడు విశ్రాంతి, ఆహారంలో మార్పులతోపాటు వ్యాధికి అనుగుణమైన ఔషధాలను వాడవలసి ఉంటుంది. కామెర్లకు సరైన కారణాన్ని కనుక్కొని దానికి చికిత్స చేస్తే తగ్గినా బరువును తిరిగి పొందుతారు. ఉదాహరణకు, రక్తాల్పత ఉన్నప్పుడు స్నేహకర్మ, వమనకర్మ, విరేచనకర్మలతో పాటుగా రక్తాన్ని వృద్ధి పరిచేందుకు గాను లోహభస్మం, మండూరం, లోహంతో తయారైన ఆసవారిష్టాలను, మేక కాలేయం నుంచి తీసిన మాంసరసం అనుపానంతో ఇవ్వవలసి ఉంటుంది.

 

గృహచికిత్సలు: 1. నేల ఉసిరిక రసాన్ని పావు కప్పు మోతాదులో చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి.

2. నవసాగరం (200 మి.గ్రా.) కటుక రోహిణి చూర్ణం (1 గ్రా.), కరక్కాయ పెచ్చుల చూర్ణం (12 గ్రా.) అన్నీ కలిపి రోజులు రెండు సార్లు నీళ్లతో తీసుకోవాలి.

3. త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డ సరం ఆకులు, కటుకరోహిణి, నేలవేము, వేప పట్టలను సమభాగాలు తీసుకొని కషాయం కాచి అర కప్పు చొప్పున, చెంచాడు తేనె చేర్చి రెండు పూటలా తాగాలి.

 

ఔషధాలు: ఆరోగ్యవర్ధీని వటి, అవిపత్తికర చూర్ణం, మండూరభస్మం, సూతశేఖర రసం, పిప్పల్యావం.


4. ఇన్ఫెక్షన్ బరువు కోల్పోవటంతో పాటు నలతగా, అలసటగా అనిపిస్తుంటే శరీరంలో నిగూఢంగా ఏదన్నా ఇన్ఫెక్షన్ దాగి వుందేమో చూడాలి. ఉదాహరణకి, గ్యాస్ట్రోఎంటేరైటిస్ లో శరీరంలో నీరు, ముఖ్యమైన లవణాలు విరేచనాల రూపంలో వెళ్లిపోయి శరీరపు బరువు తగ్గుతుంది, అదేవిధంగా అమీబియాసిస్ లోనూ, కడుపులో ఏలికపాములు, నులిపురుగులు లాంటివి వున్నప్పుడు, అంతరావయవాల్లో (ఊపిరితిత్తులు, కాలేయం, ఎముకలు, మూత్రపిండాల్లో) చీము చేరినప్పుడు బరువు కోల్పోతాయి. ఇలాంటి స్థితిల్లో కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.

 

5. క్షయవ్యాధి (ట్యుబర్క్యులోసిస్) క్షయవ్యాధి అనడంతోనే మనకు దగ్గు జ్ఞాపకం వస్తుందిగాని క్షయవ్యాధికి గురైన ప్రతివారిలోను దానికి సంబంధించిన అన్ని లక్షణాలు కనిపించాలని నియమం లేదు. జ్వరం, బరువు తగ్గటం - ఈ రెండు లక్షణాలే కనిపిస్తాయి ఒకోసారి. మరోవిషయం - ఎయిడ్స్ వల్ల కూడా బరువు కోల్పోతారు. అయితే, ఈ వ్యాధి బారిన పడిన వెంటనే లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించడానికి మరోసారి అయిదు నుంచి పది సంవత్సరాల సమయం పడుతుంది. నోరు పూయడం, చర్మ సంబంధ సమస్యలు, ఎక్కువగా చమట పట్టడం, బరువు కోల్పోవడం, జ్వరం, లింఫ్ గ్రంథులు వాయడం - ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇందులో ఈ వ్యాధులకు 'స్వస్థస్యోర్జస్కర చికిత్సలు' అవసరమవుతాయి. ఈ చికిత్సలు స్వాస్థ్యాన్ని పునః స్థాపిస్తాయి.

గృహచికిత్సలు: 1. పెన్నేరు, పిప్పళ్లను సమాన భాగాలు తీసుకొని చూర్ణం చేసి పంచదార, తేనె. నెయ్యి కలిపి తీసుకోవాలి.

2. పిప్పళ్ల చూర్ణం, ద్రాక్ష, చెక్కెరలను కలిపి తీసుకోవాలి.

3. లాక్షా చూర్ణాన్ని 20 గ్రాముల మోతాదుగా బూడిద గుమ్మడికాయ రసంలో ముద్దుగా నూరి తీసుకుంటే రక్తం పడకుండా ఉంటుంది.

4. అడ్డసరం ఆకుల రసాన్ని తేనె అనుపానంగా తీసుకోవాలి. ఔషధాలు: సితోపలాది చూర్ణం, తాళీసాది చూర్ణం, చ్యవనప్రాశ లేహ్యం, రాజ మృగాంక రసం, మహాలక్ష్మీ విలాస రసం.

 

6. ఆటో ఇమ్యూన్ వ్యాధులు: ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో బరువు కోల్పోతారు. ఆటో ఇమ్యూనిటీని 'స్వయం ప్రేరిత స్వీయరక్షణ వ్యవస్థ'గా భావించవచ్చు. ఈ ఆటో ఇమ్యూనిటీ వ్యాధుల్లో శరీరం తనలోని జీవకణాలనే శరీరేతర కణాలుగా భావిస్తుంది. దీనితో యాంటీ బాడీలు వృద్ధిచెంది జీవకణాల మీద దాడిచేస్తాయి, దీనికి ఉదాహరణ – రుమాటిజం వల్ల కీళ్ల నొప్పులూ, కండరాల నొప్పులూ, వాపులూ, స్వల్పంగా జ్వరం వంటివి ఉంటాయి. ఈ వ్యాధుల్లో కూడా బరువు కోల్పోయే అవకాశం ఉంది. ఈ తరహా వ్యాధుల్లో పంచకర్మ చికిత్సలనూ, లక్షనాత్మకమైన చికిత్సలనూ చేయాల్సి వుంటుంది.

 

7. క్రుంగుబాటు (డిప్రషన్) ఆకలి మందగించడం, బరువు కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం - ఈ లక్షణాలు ఆత్మన్యూనతకూ, డిప్రెషన్ లకు సంకేతాలు. ఉద్రేకం, నిర్వేదం, మనసు నిలకడగా లేకపోవడం, నిద్రపట్టక పోవడం ఇవన్నీ మనిషిని చిక్కిపోయేలా చేస్తాయి. ఆత్మన్యూనత వేధిస్తున్నప్పుడు వ్యక్తిత్వ విశ్లేషణ, ఆశ్వాసనం (స్వస్థత చేకూరుతుందనే నమ్మకాన్ని కలిగించడం) వంటి అద్రవ్యభూత చికిత్సలు ఉపయుక్తంగా ఉంటాయి. ఔషధాలు: నారసింహ ఘృత, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబలా తైలం, అశ్వగంధారిష్టం, సర్పగంధా చూర్ణం, స్వర్ణముక్తాది గుటిక. బాహ్యాప్రయోగం - బ్రాహ్మీ తైలం.