వీర్యంలో రక్తం కనిపించడం:

 

1. మీకు అరుదుగా, అప్పుడప్పుడూ వీర్యంలో రక్తం కనిపిస్తుంటుందా?

సిరలు రక్తంతో నిండిపోవటం

2. మీకు ఇటీవల కాలంలో ఎప్పుడైనా పురుషాంగం నుంచి జిగురు వంటి పదార్ధం లేదా, చీము వంటి స్రావం కారిందా? ఇలా జరిగిన తరువాత వీర్యంలో రక్తం కనిపించడం మొదలయిందా?

ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ (ప్రోస్టటైటిస్)

 

చిన్నపిల్లలు తమ రక్తాన్ని చూసుకొని భయపడిపోతాయి. ఏదో జరగకూడనిది జరిన్గిందని హడాలిపోతారు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఈ భయాలు నెమ్మదిస్తాయి. అయితే, ఎంత వయసు వచ్చినప్పటికీ మగవారిని కొన్ని కొన్ని అనారోగ్య లక్షణాలు తీవ్రమైన భయాందోళనలకు గురి చేస్తూనే ఉంటాయి. వాటిల్లో వీర్యంతో పాటు రక్తం కనిపించడం ఒకటి. నిజానికి శారీరక స్రావాలతో పాటు రక్తం కనిపించడమనేది ఇతర ఆనారోగ్య లక్షణాలవంటిదే. దీనిని ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ లక్షణం అంతర్గత సమస్యకు దర్పణం కాబట్టి ఆయా కారణాలన్నిటినీ విశ్లేషిస్తే సమస్య మంచు విడిపోయినట్లు విడిపోతుంది.

1. సిరలు రక్తంతో నిండిపోవటం:

కొంతమంది మగవారిలో అప్పుడప్పుడూ ప్రోస్టేటుగ్రంథి ప్రాంతంలో ఉండే సిరలు తాత్కాలికంగా రక్తంతో నిండి పోయి ఒత్తిడిని ప్రదర్శిస్తాయి. అలాంటప్పుడు వీర్యంలో రక్తం కనిపించే అవకాశం ఉంది. ప్రోస్టేటుగ్రంథి అనేది మగవారిలో శుక్రకణాలు ప్రయాణించడానికి వీలుగా ఒక రకమైన ద్రవాన్ని (సెమన్ ని) తయారు చేస్తుంది. ఇది పొత్తికడుపు ప్రాంతంలో, మూత్రకోశం కింద, మూత్రనాళాన్ని చుట్టి ఉంటుంది).

ఆయుర్వేదం పదమూడు రకాలైన శారీరక విధులను ఆపుకోకూడదని చెప్పింది, ఈ విధులను 'వేగాలు' అంటారు. వీటిల్లో 'శుక్ర నిరోధం' ఒకటి. స్కలనాన్ని మధ్యలో ఆపినందు వల్ల వీర్యంలో రక్తం కనిపించడాల్లాంటి ఇక్కట్లు వస్తాయి.

ఐదు పదుల వయసు దాటినా వారిలో (దాదాపు ప్రతి ముగ్గురిలోనూ ఒకరికి) కొద్దో గొప్పో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతుంది. బి.పి.హెచ్. లేదా 'బినైన్ ప్రోస్టేట్ హైపర్ ట్రోఫీ'గా పిలిచే ఈ వ్యాధి లక్షణాలు ఆయుర్వేదంలో వివరించిన అష్ఠీలా వాతం అనే వ్యాధి లక్షణాలతో సరిపోతాయి. ఈ బి.పి,హెచ్. వ్యాధిలో కూడా వీర్యంతో పాటురక్తం కనిపించే అవకాశం ఉంది. ఈ లక్షణంతో పాటు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావటం, మూత్రం ధారా సన్నగా అడ్డుకున్నట్లు ఉండటం, తగినంత ఒత్తిడితో మూత్రం వెలువడక పోవడం, మూత్రం బొట్లు బొట్లుగా పడటం, అనుకున్న వెంటనే మూత్ర విసర్జన చేయలేక పోవడం అనే లక్షణాలు కూడా బి.పి.హెచ్.లో కనిపిస్తాయి. సిద్ధాంతరీత్యా ప్రోస్టేటుగ్రంథి పెరిగిన తరువాత క్యాన్సర్ గా మారే 'అవకాశం' ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో అల అరగటం లేదు. కాకపొతే, వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ రిస్కు పెరుగుతుంటుంది కాబట్టి వృద్దాప్యంలో ఈ గ్రంథి పెరుగుదలను అశ్రద్ధ చేయకూడదు.

గృహచికిత్సలు: 1. చిన్నఏలకుల చూర్ణం (పావు చెంచాడు), అరటిబోదె రసం (అరకప్పు) రెండు కలిపి తీసుకోవాలి. 2. కలకండ, ద్రాక్షలను ముద్దగానూరి పెరుగుమీద తేటతో తీసుకోవాలి. 3. బూడిదగుమ్మడికాయ రసం (అరకప్పు), యవక్షారం (చిటికెడు), పంచదార (రెండు చెంచాలు) అన్నీ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 4. పల్లేరుమొక్కను సమూలంగా తెచ్చి, కషాయం కాచి పూటకు అరకప్పు చొప్పున పంచదార, తేనెలు కలిపి రెండుపూటలా తీసుకోవాలి. 5. ఏలకులు, కొండపిండి వేళ్ళు అన్నీ సమానభాగాలు తీసుకొని పొడిచేయాలి. దీనిణి పూటకు అరచెంచాడు మోతాదుగా అరకప్పు బియ్యపు కడుగు నీళ్ళతో పుచ్చుకోవాలి.

ఔషధాలు: ఏలాదిచూర్ణం, శుద్ధ శిలాజిత్తు, తారకేశ్వరరసం, ప్రవాళభస్మం, శతావరిఘృతం, చంద్రనాసవం, చందనాది వటి, చంద్రప్రభావటి, దేవకుసుమ రసాయనం, గోక్షురాది గుగ్గులు, గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్తు భస్మం, శతావరి లేహ్యం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం.

2. ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ (ప్రోస్టటైటిస్):

ప్రోస్టేట్ గ్రంథి అల్పస్థాయిలో ఇన్ఫెక్షన్ సోకితే పురుషాంగం నుంచి జిగురువంటి లేదా చీము వంటి పదార్ధం కారటం లేదా వీర్యంతో రక్తం కనిపించడం జరగవచ్చు. లైంగిక వ్యాధులు, మూత్రమార్గానికి సోకే సాధారణమైన నాన్ స్పెసిఫిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, మూత్రమార్గం లోనికి బలవంతంగా క్యాథటర్లను చొప్పించడం వంటి కారణాల వల్ల ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ కి (ప్రోస్టటైటిస్) గురవుతుంది. ఇది చాలా మొండిది కాబట్టి సాధారణంగా వాడే మూత్రమార్గానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అంత సమర్థవంతంగా పని చేయవు. అయితే, ఆయుర్వేదంలో ఈ తరహా సమస్యకు సమర్థవంతమైన మందులు అనేకం ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, మూత్రవ్యవస్థను పటిష్టంగా, వ్యాధిరహితంతా చేయడానికి సహాయపడతాయి.

ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడు (బినైన్ ప్రోస్టేట్ హైపర్ ట్రోపీ లేదా, సంక్షిప్తంగా బి.పి,హెచ్.) చాలా మంది శస్త్ర చికిత్స గురించి ఆలోచిస్తారు. ఐతే, శస్త్ర చికిత్స ఈ సమస్యకు పూర్తి పరిష్కారం కాదన్న సంగతి తెలిసిందే, పైగా, శస్త్ర చికిత్సానంతరం కొంతమందికి నపుంసకత్వం ప్రాప్తించడం కలవరపెట్టే విషయం, అదృష్టవశాత్తు ఆయుర్వేద చికిత్సలతో ప్రోస్టేట్ గ్రంథి వాపును నిలువరించవచ్చు. ఈ వ్యాధిలో కనిపించే వివిధ లక్షణాలను బట్టీ చికిత్సలు మారుతూ ఉంటాయి.

సూచనలు: మూత్రవిసర్జన కష్టమైనప్పుడు గోక్షురాది గుగ్గులు, చంద్రప్రభావటి, చందనాసవ, చంద్రకళారస, దశమూల హరీతకీ, యవక్షారం వంటి మందులు ఉపకరిస్తాయి. మూత్రపు ధార అడ్డుకుపోయినప్పుడు భౌతికంగా ఏర్పడిన అడ్డును తొలగించాల్సి ఉంటుంది. దీనికి మొదటి స్నేహ స్వేదాలను ప్రయోగించి శరీరాన్ని మార్దవంగా చేసి, ఆ తరువాత, ఉత్తర వస్తి అనే చికిత్సా ప్రక్రియను చేయాల్సి ఉంటుంది.