మూత్రంలో రక్తం కనపడటం:
1. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందా?
మూత్రకోశపు ఇన్ఫెక్షన్ (సిస్టైటిస్)
2. ఎరుపు రంగు మూత్రంతో పాటు ఎప్పుడు నొప్పి ఉంటుందా?
మూత్రపిండాల ఇన్ఫెక్షన్ (నెఫ్రైటిస్)
3. మూత్రం విసర్జంచే సమయంలో మాత్రమే నొప్పి ఉంటుందా?
మూత్రమార్గపు ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్)
4. మూత్రాన్ని విసర్జించే సమయంలో 'కత్తితో కోసినట్లు' తీక్షణమైన నొప్పి వస్తుందా?
మూత్రపిండాల్లో రాళ్ళు (కిడ్నీ స్టోన్స్)
5. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు, మూత్రం ధార చివరలో రక్తం కనపడుతుందా?
మూత్రాశయవ్యాధులు (యూరినరీ డిజార్డర్స్)
6. ఏ రకమైన నొప్పి లేకుండా మూత్రంతో పాటు రక్తం పోతుందా?
మూత్రమార్గపు ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్)
7. మూత్రంతో పాటు రక్తపు గడ్డలు పడుతున్నాయా?
మూత్రమార్గంలో పెరుగుదలలు
8. కొద్ది రోజుల క్రితం మీ నడుముకు దెబ్బ ఏదైనా తగిలిందా?
దెబ్బలు / గాయాలు
9. అల్లోపతి మందులు ఏవైనా వాడుతున్నారా? కొత్తగా ఏవైనా ఆహార పదార్థాలు తిన్నారా?
మందులు./ ఆహార పదార్థాలు దుష్ఫలితాలు
10. మీ గుండె కొట్టుకునే తీరులో హేచ్చుతగ్గులు సంభవిస్తున్నాయా? గుండె చేసే మామూలు శబ్దాలు కాకుండా, ఇతరత్రా సవ్వడులు (మర్మర్స్) వినిపిస్తున్నాయా? మీకు ఈ మధ్య పక్షవాతం వచ్చిందా?
రక్తంలో బుడగలు / గడ్డలు (ఎంబోలిజం / త్రాంబస్)
మూత్రంలో రక్తం కనిపించడాన్ని ఆయుర్వేదంలో 'రక్తమూత్రం' అంటారు. బారతీయ శస్త్ర చికిత్సా పితామహుడు సుశృతుడు ఈ లక్షణాన్ని 'రక్తమేహం' అని కూడా పిలిచాడు. ఇది ప్రధానంగా పిత్తదోషం పెరగటం వలన ఏర్పడుతుంది కనుక ఈ స్థితికి 'అథోగత రక్త పిత్తం' అన్న పర్యాయపదం కూడా ఉంది.
మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. కొద్దిపాటి రక్తమే స్రవిస్తున్నప్పటికి అది మూత్రం అంతటితోనూ కలవడం వలన హెచ్చు రక్తం పోతున్నట్లుగా భ్రమ కలిగి ఆందోళన పెరుగుతుంది.
మూత్రం రక్తంతో కలిసిపోయి కనిపిస్తున్నప్పుడు మూత్రావహ సంస్థానం మొత్తాన్నీ అంటే మూత్ర పిండాల దగ్గర నుండి మొదలెట్టి మూత్ర నాళిక వరకు అన్ని భాగాలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మూత్రంతో కలిసే రక్తపు రంగును ఆధారం చేసుకొని అది ఏ ప్రాంతం నుంచి వెలువడుతున్నదో చెప్పవచ్చు.
మూత్ర మార్గాన్ని పరీక్షించడానికి ఇటీవల కాలంలో చాలా రకాలైన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు మహిళలలో మూతం రక్తంతో కలిసిపోయి కనిపిస్తున్నప్పుడు గర్భాశయం ద్వారం నుంచి సర్వికల్ స్మియర్ ను సేకరించి క్యాన్సర్ కోసం పరీక్షిస్తారు. అలాగే మత్తు మందు ఇచ్చి, సిస్టోస్కోప్ సహాయంతో మూత్రకోశపు లోపలి భాగాన్ని చూడవచ్చు. అంతేకాకుండా, అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉపయోగించి మూత్ర పిండాలలో సమస్యలను వెలుపలినుంచే తెలుసుకోవచ్చు. ఇంత చేసినప్పటికీ సమస్య ఎక్కడ ఉందో తెలియనట్లయితే మరో రెండు పరీక్షలు కూడా ఉపకరిస్తాయి మొదటిది ఇంట్రా వీనస్ పైలోగ్రామ్ (ఐ.వి.పి.). రెండవది క్యాట్ స్కాన్.
ఐ.వి.పి. లో పక అపాదర్షక పదార్థాన్ని రక్తనాళాలలోకి ఎక్కించి అది మూత్ర పిండాల ద్వారా, మూత్రకోశాల ద్వారా అంచెలంచెలుగా బహిర్గతమయ్యే విధానాన్ని ఎక్స్ రే లు తీస్తారు. ఇలా తీయడం వల్ల లోపల ఏ ప్రాంతంలో ఉందో అర్థమవుతుంది.
క్యాట్ స్కాన్ అనే పరీక్ష ద్వారా, అనుమానం ఉన్న భాగాన్ని వివిధ భంగిమలలో రకరకాల అడ్డుకోతలతోనూ, నిలువు కోతలలోనూ శరీరాన్ని ముట్టుకోకుండానే చూడవచ్చు.
ఈ నవీన పరీక్షా పద్దతులవల్ల ఉంచితే మూత్రం రక్తంతో కలిసిపోయి వెలువడుతున్నప్పుడు ఈ క్రింది విషయాల దిశగా విశ్లేషించుకుంటూ పోతే మీ సమస్యకు జవాబు దొరుకుతుంది.
1. మూత్రకోశపు ఇన్ఫెక్షన్ (సిస్టైటిస్):
సర్వ సాధారణంగా తరుచుగా మూత్రవిసర్జన చేయటం అనేది మూత్రకోశం ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు కనిపిస్తుంది.
ఎక్కువ నీళ్లు తాగితే ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందనే భావంతో మూత్రమార్గానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లతో బాధపడే వారు చాలా మంది అసలు నీళ్లు తాగటమే తగ్గించేస్తారుగాని, ఇలా చేయడం సరికాదు.మూత్రమార్గం వ్యాధి గ్రస్తమైనప్పుడు బాగా నీళ్ళు తాగటం అవసరం. దీనివల్ల సూక్ష్మజీవులు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయి త్వరగా సాంత్వన లభిస్తుంది.
అలాగే జననేంద్రియాల శుభ్రత పాటించాలి. దాంపత్యంలో పాల్గొనే ముందు, పాల్గొన్న తరువాత, విధిగా మూత్ర విసర్జన చేయాలి. నెలసరి సమయాలలో డైపర్లలో (లోపల చొప్పించే విధమైనవి కాకుండా అచ్ఛాదనంగా ఉండేవి) వాడితే మంచిది. అలాగే కాటన్ తో తయారైన లోదుస్తులను (ఉతికి శుభ్రం చేసినవి) వాడాలి.
గృహచికిత్సలు: 1. చిన్న ఏలకుల చూర్ణం (పావు చెంచాడు), అరిటిబోదె రసం (అరకప్పు) రెండూ కలిపి తీసుకోవాలి. 2. కలకండ, ద్రాక్షలను ముద్దగానూరి పెరుగుమీద తేటతో తీసుకోవాలి. 3. బూడిదగుమ్మడికాయ రసం (అరకప్పు), యవక్షారం (చిటికెడు), పంచదార (రెండు చెంచాలు) అన్నీ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 4. పల్లేరుమొక్కను సమూలంగా తెచ్చి, కషాయం కాచి పూటకు అరకప్పు చొప్పున పంచదార, తేనెలు కలిపి రెండు పూటలా తీసుకోవాలి. 5. ఏలకులు, కొండపిండి వేళ్ళు, శిలాజిత్తు, పిప్పళ్ళు అన్నీ సమానభాగాలు తీసుకొని పొడిచేయాలి. దీనిని పూటకు అరచెంచాడు మోతాదుగా అరకప్పు బియ్యపు కడుగు నీళ్ళతో పుచ్చుకోవాలి.
ఔషధాలు: ఏలాదిచూర్ణం, శుద్ధ శిలాజిత్తు, తారకేశ్వరరసం, ప్రవాళభస్మం, శతావరిఘృతం, పంచనాసవం, చందనాది వటి, చంద్రప్రభావటి, దేవకుసుమ రసాయనం, గోక్షురాది గుగ్గులు, గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్తు భస్మం, శతావరి లేహ్యం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం.
2. మూత్రపిండాల ఇన్ఫెక్షన్ (నెప్రైటిస్):
ఆగి ఆగి వచ్చే నొప్పికి, అదే పనిగా వచ్చే నొప్పికి తేడా ఉంది. రెండవ తరహా నొప్పి సామాన్యంగా మూత్రపిండాలు వ్యాధిగ్రస్తమవడాన్ని సూచిస్తుంది. ఇలాంటి సందర్భాలలో నొప్పి అనేది మంద్రస్థాయిలో ఉండటమే కాకుండా, వెనుక వైపు, నడుముకు కాస్త పైభాగాన కేంద్రీకృతమై ఉంటుంది.
మూత్రకోశం వ్యాధిగ్రస్తమైనప్పుడు ఇన్ఫెక్షన్ ఎగువకి ప్రసరించి, మూత్రపిండాలను చేరి వాటిని కూడా వ్యాధిగ్రస్తం చేస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో ఇన్ఫెక్షన్ లేకుండా కూడా (శరీరపు స్వీయరక్షణ వ్యవస్థ అదుపు తప్పడం వలన) ఈ రకమైన పరిస్థితి ఉత్పన్నమవుతుంటుంది. ల్యూపస్ ఎరిథిమాటోసిస్, పాలీ అర్టిరైటిస్ నోడోసా వంటి వాటిల్లో ఇలా జరుగుతుంది.
ఈ రుగ్మతల్లో మూత్ర పిండాల్లోని కణజాలాలు విచ్చిన్నమవడంతో వాటి సాధారణ విధులకు ఆటంకం కలుగుతుంది. పర్యవసానంగా రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడం, మూత్రపు పరిమాణం బాగా పెరగటం లేదా బాగా తగ్గటం, కళ్ళు ఉబ్బినట్లు కనిపించడం కాళ్ళూ చేతుల్లో వాపు రావడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన నీరసం, రక్తాల్పతలు కూడా ఉంటాయి.
సూచనలు: ఈ స్థితుల్లో పైన పేర్కొన్న 'మూత్రకోశపు ఇన్ఫెక్షన్' కు వాడే మందులతోపాటు కీటాణు నాశకంగా పనిచేసే బృహత్ బంగేశ్వర రసం అనే మందును కూడా వాడాలి.
3. మూత్రమార్గపు ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట ఇన్ఫెక్షన్):
మూత్రం ఎరుపు రంగులో కనిపించడంతోపాటు నొప్పి కూడా ఉన్నట్లయితే అది కిడ్నీలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కంటే మూత్రకోశానికి లేదా మూత్రనాళికలు చెందినా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ. గనోరియా వంటి లైంగిక సంబంధ వ్యాధులలో కూడా పై లక్షణం ప్రధానంగా కనిపించే అవకాశం ఉంది.
గృహచికిత్సలు: 1. పెద్ద ఏలకుల గింజలు, సురేకారం సమాన భాగాలు తీసుకుని పొడిచేయాలి. దీనిని పూటకు పావు చెంచాడు వంతున రెండుపూటలా నీళ్ళతో తీసుకోవాలి. 2. స్వర్ణగైరికం (రెండు భాగాలు), పటిక (ఒక భాగం), పంచదార (మూడు భాగాలు) వీటినన్నిటిని కలిపి పొడిచేయాలి. దీనిని పూటకు అరచెంచాడు చొప్పున మూడు పూటలా ధనియాల కషాయంతో పుచ్చుకోవాలి.
ఔషధాలు: స్వర్ణవంగం, సంపూర్ణ కాంచన రసం, ఇందుశేఖర రసం, చందనాసవం, ఖదిరారిష్టం, చందనాదివటి, త్రివంగభస్మం.
4. మూత్రపిండాల్లో రాళ్ళు (కిడ్నీ స్టోన్స్):
మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడిన తరువాత అవి మూత్రంతోపాటు కదులుతూ కిందకు జారుతున్నప్పుడు కత్తితో కోసినట్లు నొప్పి వస్తుంది. మూత్రమార్గంలో రాళ్ళు ఉన్నవారు బాగా నీళ్ళు తాగాలి. సాధారణంగా ఇలాంటి కిడ్నీరాళ్ళు క్యాల్షియం వలన తయారవుతాయి. కనుక క్యాల్షియం ఎక్కువగా ఉండే పాలు వెన్న తదితర పాల ఉత్పత్తులనూ, యాంటసిడ్లనూ వాడకూడదు, ఇవేకాక, బీన్స్, బీట్ రూట్, ద్రాక్ష, పాలకూర, టీ మొదలైనవి కూడా తగ్గించుకుంటే మంచిది.
గృహచికిత్సలు: 1. బొప్పాయి వేరును తెచ్చి, పొడిచేసి, పూటకు పావు చెంచాడు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి. 2. ముసాంబరాన్ని చిటికెడు ప్రమాణంగా ద్రాక్షపండులో మాటుపెట్టి తీసుకోవాలి. 3. ఆముదపు వేరు కషాయానికి (అరకప్పు) యవక్షారాన్ని (చిటికెడు) కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 4. పసుపును (అరచెంచాడు) బెల్లంతో కలిపి, బియ్యపు అడుగునీళ్ళతో పుచ్చుకోవాలి. 5. పులుమెరిపట్ట,. శొంఠి, పల్లేరు వీటి కషాయానికి బెల్లం కలిపి అరకప్పు మోతాదుగా రెండు పూటలా మండలం (40 రోజులు) పాటు తీసుకోవాలి. 6. దోసగింజల కషాయాన్ని లేదా కొబ్బరి పువ్వుల ముద్దను పాలతో కలిపి కొన్ని రోజులు పుచ్చుకోవాలి. 7. పిల్లిపీచర గడ్డల రసాన్ని (అరకప్పు) ఆవుపాలతో కలిపి తాగాలి. 8. కొడిశపాలపట్టం లేదా వేరుచూర్ణాన్ని అరచెంచాడు చొప్పున అరకప్పు పెరుగుతో కలిపి రెండుపూటలా తీసుకోవాలి. 9. కొండపిండ వెళ్ళ కషాయానికి (అరకప్పు) శుద్ధిచేసిన శిలాజిత్తును (చిటికెడు) కలిపి పంచదార చేర్చి కొన్ని రోజుల పాటు రెండుపూటలా తీసుకోవాలి.
ఔషధాలు: చంద్రప్రభావటి గోక్షురాదిగుగ్గులు, వరుణాక్వాథం, హజ్రల్యహూద భస్మం, సహచరాదితైలం.
5. మూత్రాశయ వ్యాధులు (యూరినరీ డిజార్డర్స్):
మూత్రవిసర్జన చేసేటప్పుడు మొదట్లో స్వచ్చమైన మూత్రం వస్తూ చివరలో మాత్రం రక్తంతో కలిసిపోయి కనిపిస్తున్నట్లయితే అప్పుడు ఆ రక్తాన్ని మూత్రకోశానికి సంబంధించినదిగా అర్థం చేసుకోవాలి. మూత్రాశాయానికి చెందినా ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం లోపల పెరిగే కంతులూ (అర్భుదాలు) ఇలాంటి లక్షణాలను ప్రదర్శిస్తాయి. కొన్నిసార్లు ఏ రకమైన వ్యాధి లేకపోయినప్పటికీ శ్రమతో కూడిన ఆటలాడే వారిలోనూ, గుర్రపు స్వారీలు మొదలైనవి చేసే వారిలోనూ మూత్రకోశం లోపల ఒరుసుకుపోయి రక్త మిశ్రిత మూత్రం వెలువడే అవకాశం ఉంది. మూత్ర విసర్జన ప్రారంభంలో మూత్రంతో పాటు రక్తం కనిపిస్తున్నట్లయితే దానికి కారణం వెలుపలి భాగాల్లోణి అంశాలేనని గ్రహించాలి. ఉదాహరణకు లైంగిక వ్యాధులలోనూ, ఆసుపత్రులలో మూత్రమార్గంలోనికి క్యాథటర్లను సక్రమంగా చొప్పించనప్పుడు, పొరపాటున ఏదైనా వెలుపలి పదార్ధం మూత్ర మార్గంలోనికి ప్రవేశించినప్పుడు, లేదా ప్రోస్టేటుగ్రంథి వాచినప్పుడు (అష్టీలా వాతం) ఇలా జరుగుతుంది. పై రెండు విధాలుగా కాకుండా, మూత్ర విసర్జన మొదట నుంచి చివరి వరకు, రక్తం మూత్రంతోపాటుగా కనిపిస్తుంటే దానిని మూత్ర పిండాలకు సంబంధించిన రక్త స్రావంగా అర్థం చేసుకోవాలి.
సూచనలు: మూత్రకోశం వ్యాధిగ్రస్తమైనప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు బాగా విశ్రాంతి తీసుకోవాలి, నీళ్ళు ఎక్కువగా తాగాలి, మూత్రనాలానికి గాయమైనప్పుడు 'వ్రణ రోపణ' చికిత్స (జాత్యాది ఘృత ప్రయోగం) చేయాల్సి ఉంటుంది. మామూలు స్థితి నేలకోనేంట వరకు దాంపత్య జీవితంలో పాల్గొనకూడదు. ప్రోస్టేటుగ్రంథి వాపు ఉన్నప్పుడు గోక్షురాదిగుగ్గులు, గుడూచీసత్వం, శిలాజిత్తు, శిలాజిత్తు, స్వర్ణవంగం, చంద్రప్రభావటి వంటి వాటిని అవసరానుసారం ఉపయోగించాల్సి ఉంటుంది.
6. మూత్రమార్గపు ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్):
ఏ రకమైన నొప్పి లేకుండా మూత్రంతో పాటు రక్తం పోతుంటే మూత్ర మార్గంలో రాళ్ళ కంటే ఇన్ఫెక్షన్ కే ఎక్కు ఆస్కారం ఉంది. దీనిలో మూత్రమార్గం లోపల కంతుల వంటివి పెరిగాయేమో పరీక్షించాలి. నొప్పి లేకుండా మూత్రంలో రక్తం కనిపిస్తుంటే తాత్సారం చేయకుండా వెంటనే వైద్య సలహా పొందాలి, దీనికి అర్భుదహర ఔషధాలు (నిత్యానంద రసం, త్రివంగభస్మం, చంద్రప్రభావటి) అవసరమవుతాయి.
7. మూత్రమార్గంలో పెరుగుదలలు:
మూత్రంతో పాటు రక్తపు గడ్డలు పడుతుంటే అది లోపలి పెరుగుదలలను సూచిస్తుంది. దీనికి కూడా వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
8. దెబ్బలు / గాయాలు:
నడుముకు ఏదైనా దెబ్బ తగిలితే, ఒకోసారి మూత్రపిండాలలో రక్తస్రావమయ్యే అవకాశం ఉంది. అందుకే ఏక్సిడెంట్లలో నడుము ప్రాంతంలో దెబ్బతగిలితే, వెలుపల ఏ గాయమూ కనిపించనప్పటికి, మూత్రాన్ని కూడా గమనించడం అవసరం. దీనికి విశ్రాంతితో పాటు కారణానుగుణమైన చికిత్సలను చేయాల్సి ఉంటుంది.
9. మందులు / ఆహార పదార్థాల దుష్ఫలితాలు:
బీట్ రూట్ వంటివి తిన్నప్పుడు మూత్రం ఎర్రగా కనిపించే అవకాశం ఉంది. విరేచనం సాఫీగా కావడానికి వాడే కొన్ని రకాల మందులలో ఫినాఫ్తలిన్ కలుస్తుంది, ఇదీ మూత్రాన్ని ఎర్రగా కనిపించేలా చేస్తుంది. క్షయ వ్యాధికి వాడే రిఫాంపిసిన్ వలన కూడా మూత్రం ఎర్రగా వస్తుంది. యాంటీకోయాగులెంట్స్ (రక్తం గడ్డకట్టకుండా నిరోధించే మందులు) వాడే వారిలో రక్తం కిడ్నీల్లోకి కారి మూత్రాన్ని ఎర్రగా మారుస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. మూత్రకోశ ఇన్ఫెక్షన్ లో వాడే పైరిడియన్ వల్ల కూడా మూత్రం ఎర్రగా కనిపిస్తుంది. ఈ మధ్య కొంతమంది 'నకిలీ వైద్యులు' కిడ్నీ వ్యాధులను నయం చేస్తామంటూ మూలికావైద్యం పేరిట రహస్య పదార్థాలను ఇస్తున్నారు. ఎవరు పడితే వారు వైద్యం మీద, మనవ శరీర నిర్మాణ శాస్త్రం మీద సరైన అవగాహన లేకుండా, ఏమిస్తున్నారో తేలియకుండా మందులు ఇవ్వడం ప్రమాదకరం, వీటిల్లో శుద్ధి చేయని భస్మాలుండవచ్చు. లేదా, ఇంగ్లీషు మందులే ప్రమాదకరమైన మోతాదులో ఉండవచ్చు, అటువంటివారు ఇచ్చే ఈ మందులు వ్యాధిని కుదిర్చినా కుదర్చకపోయినా మూత్రపిండాల మీద మాత్రం నిశ్చయంగా దుష్ప్రభావం చూపిస్తాయి. వ్యాధిగ్రస్తులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
అల్లోపతి మందుల వలన మూత్రం రక్తసిక్తమవుతున్నప్పుడు వాటిని మానడమో, వాటి మోతాదును సవరించుకోవదమో చేయాలి.
10. రక్తంలో బుడగలు / గడ్డలు (ఎంబోలిజం / (త్రాంబస్):
గుండె స్పందనలో మార్పులు, ఆర్ట్ మర్మర్స్ వంటివి రక్తంలో గడ్డలు (త్రాంబస్) తయారుకావడానికి దోహదపడతాయి. రక్తనాళాలలోపలి గోడలు దెబ్బతిన్నప్పుడు గడ్డలు తయారై, ఉత్పత్తిస్థానం నుంచి విడివడి రక్త ప్రవాహంతో సంచరిస్తూ సన్నని రక్తనాళాలలోనికి ప్రవేశించి, వాటి చీలిక వద్ద తట్టుకుని ఆగిపోతాయి. దీని వలన ఎగువ ప్రాంతానికి రక్త సరఫరా నిలిచిపోతుంది. ఈ విధంగా మూత్రపిండాలలో జరిగితే అది రక్త మిశ్రిత మూత్రానికి దారి తీస్తుంది.
సూచనలు: ఈ సమస్య కనిపిస్తున్నప్పుడు రక్తాన్ని పలుచగా ఉంచడం కోసం లశునాది వటి, మేదోహరవిడంగాది లోహం, హంగ్వాష్టక చూర్ణం అనే మందులను వాడాలి.
సలహాలు:
1. రక్తమిశ్రిత మూత్రం బాధిస్తున్నప్పుడు బాగా నీళ్లు తాగాలి.
2. ఎగువ దిగువ రోడ్ల మీద ప్రయాణం నిషిద్ధం
3. తీవ్రమైన ఎండలకూ, వడగాలులకూ గురి కాకూడదు.
4. లైంగిక కార్యంలో దురుసుగా, దూకుడుగా ప్రవర్తించకూడదు.
5. మూత్రంతోపాటు రక్తం అనిపిస్తున్నప్పుడు వేడిచేసే ఆహార విహారాలను తగ్గించుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది, మసాలాలు, కారం, పులుపు, రుచులు అహితకారాలు, మాంసాహారాలను ఒక మోస్తారుగా తీసుకోవచ్చుగాని, వాటిలో మసాలాలను దట్టించకూడదు.
6. రక్తమిశ్రిత మూత్రంలో కాకర, మునగ, ధనియాలు, సగ్గుబియ్యం ఇవన్నీ మంచివి.
7. బూడిద గుమ్మడి నుంచి రసాన్ని తీసి చెరకు రసంతో కలిపి తీసుకుంటే రక్త మిశ్రిత మూత్రం కనిపిస్తున్నప్పుడు రిలీఫ్ లభిస్తుంది.
8. దానిమ్మ, ఉసిరి పండ్లను మీకిష్టమైన ఆహార రూపాలలో తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
9. మద్యపానం అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి.