నాలుక నొప్పి:
1. నాలుకపైన ఏదైనా దెబ్బ తగిలిందా?
దెబ్బ/గాయం
2. నాలుక చివరి భాగంలోగాని మరెక్కడైనాగాని, నీటి పొక్కుల మాదిరివి తయారైనాయా?
వైరల్ ఇన్ఫెక్షన్లు
3. మీకు కట్టుడు పళ్ళు ఉన్నాయా? వుంటే అవి సరిగా అమరలేదా?
మీకు కట్టుడు పళ్ళు సరిగా అమరకపోవడం
4. మీరు ఎప్పుడు పాలిపోయినట్లుగా, అలసిపోయినట్లుగా కనిపిస్తారా?
రక్తహీనత (ఎనీమియా)
5. మీరు స్మోకింగ్ చేస్తారా?
ధూమపాన దుష్ఫలితాలు
6. మీకు నాలుక నొప్పితో పాటు ముఖంలో మరెక్కడైనా భాగంలో నరాల నొప్పి ఉందా?
దవడ నొప్పి (ట్రైజమైనల్ న్యూరాల్జియా)
7. నాలుక నొప్పితో పాటు ఛాతి నొప్పికూడా ఉందా?
గుండె నొప్పి (యాంజైనా)
8. నాలుక మీద తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా?
క్యాన్సర్ అవకాశాలు
తరచుగా కొంతమందికి నాలుక పుండవ్వటం, ఎరుపుదనంతో కమిలి పోవడం జరుగుతుంటుంది. అలాగే మరికొంతమందికి నాలుక మొద్దుబారటం, తిమ్మిరి పట్టినట్లుండటం జరుగుతుంది. ఈ లక్షణాలు పదే పదే తిరగబెడుతూ అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. చేసే పనిమీద మనసు నిలవనివ్వదు. అలాగని పని మానేసి పూర్తిగా వీటి పియన్ దృష్టిసారించాల్సినంత సీరియస్ గానూ ఉండవు. నాలుకకు సంబంధించిన ఇటువంటి లక్షణాలనన్నిటినీ ఆయుర్వేద శాస్త్రం 'జిహ్వా వ్యాధులు' అన్న పేరుతో విపులీకరించినది. ఇప్పుడు నాలుక నొప్పికి దారితీసే కారణాలను విశ్లేషిద్దాం.
1. దెబ్బ / గాయం:
ఆహారాన్ని నములుతున్నప్పుడు కొంతమందికి నాలుక పళ్ల మధ్య ఇరుక్కుపోయి గాయమవుతుంది. అలాగే, మరికొంతమందిలో, ఫిట్స్ మొదలైనవి వచ్చినప్పుడు నాలుక దంతాల మధ్య పడి తెగిపోయి గాయమవుతుంది. ఇటువంటి సందర్భాలన్నిటిలోను నాలుక నొప్పి ఉంటుంది. అయితే, నాలుకకు సమృద్ధిగా రక్తసరఫరా వుంటుంది. కాబట్టి ఇటువంటి గాయాలు ఇన్ఫెక్ట్ అవ్వకుండా త్వరగానే మానిపోతాయి. కాకపొతే సాధారణంగా, ప్రతి గాయమూ ఎంతో కొంత వాపును కలుగజేస్తుంది కనుక – జాగ్రత్తగా ఉండకపోతే - ఈ వాపు వలన నాలుక మీద తేలికగా మరొక గాయమయ్యే అవకాశం ఉంటుంది.
సూచనలు: ఆయుర్వేద శాస్త్రం ఇటువంటి 'సద్బోవ్రణాలకు' తేనె నెయ్యిల మిశ్రమాన్ని మంచి మందుగా చెప్పింది, ఈ రెండు పదార్థాలను సమపాళ్లలో కలిపి పైపూతగా వాడితే సరి. అలాగే ఇటువంటి గాయాలు ఏర్పడినప్పుడు ఉప్పు నీటిని పుక్కిట పడితే త్వరగా తగ్గుతాయి.
2. వైరల్ ఇన్ఫెక్షన్లు:
నొప్పితో కూడిన అల్సర్లు చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్లకు సూచనలు. ఇవి ఒకసారి వస్తే తిరిగి పదే పదే తిరగబెడుతూ ఇబ్బందిని కలిగిస్తూ వుంటాయి. ముఖ్యంగా, ఒత్తిడికి గురైనప్పుడుగాని, ఆందోళనకు లోనైనప్పుడుగాని ఇవి ఎక్కువగా వస్తుంటాయి.
సూచనలు: ఈ స్థితిని తగ్గించడానికి త్రిఫలా కషయంతో పుక్కిట పట్టాలి. 'బ్రాహ్మీవటి' అనే మందును వాడాలి. ఆందోళనను తగ్గించుకుని ప్రశాంతంగా వుండాలి.
3. కట్టుడు పళ్లు సరిగా అమరకపోవడం:
సరిగా అమరని కట్టుడు పళ్లు నాలుకను ఇరిటేట్ చేసి నొప్పికి కారణమవుతాయి. మీకొకవేళ కట్టుడు పళ్లు అమర్చుకున్న తరువాతనే నాలుకనొప్పి మొదలైతే ఆ విషయం మీకు డెంచర్స్ అమర్చిన దంత వైద్యుని దృష్టికి తీసుకువెళ్లండి - దంతాల కొసలను అరగదీయటం ద్వారా ఇటువంటి సమస్యను తేలికగా పరిష్కరించే వీలుంది.
4. రక్తహీనత (ఎనీమియా):
ఆయుర్వేద పరిభాషలో పాండువ్యాధిగానూ, ఒక సామాన్యంలో తెల్లకామెర్లగానూ పిలిచే రక్తల్పతలో నాలుక నున్నగా తయారై నొప్పిని కలుగచేస్తుంటుంది. దీనిని 'గ్లాసై టిస్' అంటారు. ఒకోసారి దీనిని అనుసరించి పెదవులు చివర్లన ఎరుపు రంగు పగుళ్లు కూడా ఏర్పడుతుంటాయి.
గృహచికిత్సలు: 1. ఉసిరికాయలు (6కిలోలు), బెల్లం (మూడు కిలోలు) తీసుకుని ఒకదానిమీద మరోదానిని పొరలు పొరలుగా ఒక మట్టికుండలో పేర్చాలి, కుండపైన గాలి చొరబడకుండా మూకుడు పెట్టి పైనుంచి మందపాటి గుడ్డతో వాసికం కట్టి భూమిలో మండలం (40 రోజులు) పాతిపెట్టాలి. తరువాత కుండను తీసి లోపలి పదార్థాలను బాగా కలిపి వారంపాటు వదిలేయాలి. పైన ఒకరకమైన ద్రవం తేలుతుంది, దీనిని పారబోసి మిగిలినదానిని పావు కప్పు మోతాదుగా రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 2. కరక్కాయ చూర్ణాన్నిగాని, శొంఠి చూర్ణాన్ని గాని, అరచెంచాడు మోతాదుగా బెల్లంతోకలిపి రోజు రెండు పూటలా తీసుకోవాలి. 3. చెరుకు రసాన్ని గ్లాసెడు చొప్పున రోజుకు కనీసం ఒకసారి తాగాలి. 4. తిప్పతీగ, త్రిఫలాలు, అడ్డరసం, కటుకరోహిణి, నేలవేము, వేప పట్ట. వీటిని సమతూకంగా తీసుకుని కషాయం కాచి రోజుకి రెండుసార్లు తాగాలి.
ఔషధాలు: లోహ భస్మం, పునర్నవాది మండూరము, కాంత వల్లభరసం, నవాయస లోహం, లోహాసవం, ఆయస్మ్రతి, భృంగరాజాసవం.
5. ధూమపాన దుష్ఫలితాలు:
బాగా ధూమపానం చేసే వారిలో నాలుక 'కొట్టుకుపోయి' మంట, నొప్పి అనిపించే అవకాశం ఉంది. దీనికి నాలుక ఉపరితలం పొడారిపోయి బ్యాక్టీరియాకు అవకాశం ఏర్పడటం, ఒక కారణమైతే, నికోటిన్ తాలూకు ఇరిటేషన్ రెండో కారణం.
సూచనలు: దీనికి శాశ్వత పరిష్కారం - సిగరెట్లను మానేయడం, టంకణభస్మంను నీటిలో కలిపి పుక్కిట పడితే పరిస్థితి వేగంగా మెరుగవుతుంది. టంకణ భస్మం బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేసే అంశాలు ఉన్నాయి. ఇది యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది.
6. దవడ నొప్పి (ట్రైజమినల్ న్యూరాల్జియా):
నాలుకకు నరాలు తల నుంచి చేరతాయన్న సంగతి తెలిసిందే. వీటి మార్గంలో ఎక్కడన్నా వాపుగాని, ఇరిటేషన్ గాని ఉంటే, నాలుక నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి సాధారణంగా కత్తితో చీల్చినట్లుగా, వాడిగా ఉంటుంది. అలాగే మాట్లాడుతున్నప్పుడు, నములుతున్నప్పుడు ఎక్కువవుతుంటుంది.
ఔషధాలు: మహావాత విధ్వంసినీ రసం, వాతగజాంకుశ రసం, విషతిందుక వటి.
7. గుండె నొప్పి (యాంజైనా):
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కదుములు, గడ్డలు (క్లాట్స్) ఏర్పడితే, గుండె కండరాలకు రక్తసరఫరా పాక్షికంగానో, పూర్తిగానో నిలిచిపోయి, గుండెనొప్పి (యాంజైనా) గాని, గుండెపోటు (హార్ట్ ఎటాక్) గాని వస్తుంది. గుండె కండరాలకు ఆక్సిజన్ తగ్గటం వల్ల ఇలా జరుగుతుంది. ఒకోసారి గుండెకు సంబంధించిన నొప్పిఛాతిలో కాకుండా నరాల ద్వారా ప్రసరించి నాలుకలో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదం ఈ నొప్పిని 'హృత్ శూల' అన్న పేరుతో వ్యవహరిస్తుంది. నాలుకనొప్పితో పాటు ఛాతిలో ఏ మాత్రం అసౌకర్యం అనిపించినా వెంటనే వైద్యసలహా తీసుకోవాలి.
గృహచికిత్సలు: 1. కటుకరోహిణి, అతిమధురం, వీటిని సమానాభాగాలు తీసుకొని చూర్ణం చేసి రోజుకు మూడుసార్లు అరచెంచాడు చొప్పున వేడి నీళ్ళతో తీసుకోవాలి. 2. తెల్లమద్దిపట్టను తెచ్చి చూర్ణం చేసి పూటకు చెంచాడు మోతాదుగా వేడిపాలతో రెండుపూటలా తీసుకోవాలి. 3. పుష్కరమూలచూర్ణాన్ని పావు చెంచాడు చొప్పున రోజుకు మూడుసార్లు తేనెతో కలిపి తీసుకోవాలి. 4. వెల్లుల్లి పాయను ముద్దచేసి చెంచాడు పేస్టును పాలతో కలిపి ఉడికించి రోజు రెండుపూటలా తాగాలి. 5. కరక్కాయలు, వస, దుంపరాష్ట్రము, పిప్పళ్ళు, శొంఠివీటిని అన్నిటిని సమతూకంగా తీసుకొని పొడిచేసి అరచెంచాడు చొప్పున రోజుకు మూడుసార్లు తేనెతో తీసుకోవాలి.
ఔషధాలు: శృంగిభస్మం, మహావాతవిధ్వంసినీ, రసం, త్రైలోక్యచింతామణిరసం, జహర్ మొహర్ భస్మం, బృహద్వాత చింతామణి రసం, ఆరోగ్యవర్ధినీవటి, అర్జునావష్టం, అశ్వగంధారిష్టం, దశమూలారిష్టం, ధన్వంతర గుటిక, క్షీరబలా తైలం (101 ఆవర్తాలు), ప్రభాకర వటి, సుకుమార రసాయనం, శృంగి భస్మం, అశ్వగంధ చూర్ణం, విదార్యాది ఘృతం.
8. క్యాన్సర్ అవకాశాలు:
శరీరంలో ఇతర భాగాల మాదిరిగానే, నాలుక మీద క్యాన్సర్ ఏర్పడినప్పుడు కూడా ముందస్తుగా, నొప్పి లేని తెల్లని మచ్చలుగాని, ఊదా రంగులో ఉండే గడ్డలుగాని కనిపిస్తాయి. ఇవి బాగా ముదిరి, చివరి స్థితిని చేరుకున్నప్పుడు మాత్రమే నొప్పిని ప్రదర్శిస్తాయి. మీ నాలుక మీద ఇటువంటి మచ్చలు ఉన్నట్లయితే, ముఖ్యంగా, మేమీరు ఎక్కువగా సిగరెట్లు తాగేవారైతే తగిన వైద్య సలహాతో ఇది క్యాన్సర్ కాదని రూఢి పరుచుకోవడం అవసరం. ఇటీవల కాలంలో చిత్రమూలం, తాళీసపత్ర, భల్లాతకం, వంటి ఆయుర్వేద మూలికలెన్నిటిలోనో క్యాన్సర్ వ్యతిరేక గుణాలున్నట్లుగా ఆధారాలతో సహా రుజువయ్యింది. వీటిని తగిన వైద్య సలహాను అనుసరించి వాడుకోవచ్చు.
ఔషధాలు: వజ్ర భస్మం, కాంచనార గుగ్గులు, లక్ష్మీవిలాసరసం, (నారదీయ), భల్లాతకవటి, క్రౌంచ్యపాకం.