చెవి నొప్పి

 

1. మీకు ఇటీవలి కాలంలో జలుబు చేసిందా?

జలుబు (కామన్ కోల్డ్)

2. తాత్కాలికంగా వినికిడి శక్తి మందగించిందా?

చెవి అంతర్భాగం (మిడిల్ ఇయర్) లో ఇన్ఫెక్షన్

3. చెవిని పట్టుకొని లాగితే చాలా నొప్పిగా ఉంటుందా?

వెలుపలి చెవి ఇన్ఫెక్షన్

4. ఈ మధ్య పెద్ద పెద్ద శబ్దాలు విన్నారా? చెవి ప్రాంతంలో ఏదన్నా దెబ్బ తగిలిందా? ముఖ్యంగా ఈ సంఘటనల తరువాత వినికిడి సమస్య తలెత్తిందా?

కర్ణభేరి పగలటం (పర్ఫరేటేడ్ ఇయర్ డ్రమ్)

5. పంటి సమస్యలేవైనా ఉన్నాయా?

దంతసంబంధ సమస్యలు

6. ఈ మధ్య సైనసైటిస్ అనే వ్యాధికి గురైనారా?

నిత్యరొంప (సైనసైటిస్)

7. నోరు తెరిచినప్పుడు చెవి నొప్పు ఎక్కువవుతుందా?

హనుగ్రహం (లాక్ జా)

 

చెవిపోటును ఆయుర్వేద పరిభాషలో కర్ణశూల అంటారు. శాస్త్రకారుడు చెవిపోటు రావటానికి దారితీసే కారణాలను చెపుతూ, “అవశ్యాయము, ప్రతిశ్యాయము, జలక్రీడ – వీని చేతను, చెవిలో దురద జనించడం చేతను, ధ్వనిని అసహజమైనరీతిలో వినడం చేతను, దెబ్బలు మొదలైన అఘాతముల చేతను, వాత ప్రకోప కారణముల చేతను వాటాను ప్రకోపించి తీవ్ర వేగముతో కర్ణ రంధ్రములను చేరి, తత్సంబంధిత నాడుల యందు వ్యాపించి శూలను కలుగచేయును" అంటాడు. ఇక్కడ అవశ్యాయమం ప్రతిశ్యాయం అనేవి జలుబు తాలూకు వివిధ దశలు. ఇక జలక్రీడలంటే స్విమ్మింగ్ మొదలైనవని అర్థం అవుతూనే వుంది. చెవిపోటు కలగడానికి శాస్త్ర కారుడు సూత్రప్రాయంగా చెప్పిన కారణాలను కొంచెం వివరంగా తెలుసుకుందాం.

 

1. జలుబు (కామన్ కోల్డ్):

జలుబు కారణంగా ముక్కులోపలి మ్యూకస్ పొరలు వాయడం చేతగాని, సైనసైటిస్ వ్లలగాని, టాన్సిల్స్ చేతగాని, లేదా ఎడినాయిడ్స్ పెరగడం వల్లగాని గొంతునూ మధ్యచేవినీ కలిపే శ్రోత్ర నాళం (యూస్టేషియన్ ట్యూబ్) పూడుకుపోయి మధ్య చెవిలో ఉండాల్సిన ఒత్తిడిలో మార్పును తీసుకువచ్చి కర్ణభేరి పైన పీడనాన్ని ప్రదర్శిస్తుంది. దీనితో చెవి అంతా నొప్పిగా అనిపిస్తుంది. పిల్లల్లో ఇది సర్వసాధారణంగా కనిపించేదైనప్పటికీ, పెద్దవారు దీనికేమీ అతీతులు కారు.

 

గృహచికిత్సలు: 1. వస పొడిని లేదా నల్లజీరకర్ర పొడిని ఒక గుడ్డులో మూటకట్టి గాఢంగా వాసన పీల్చాలి. 2. తులసి ఆకులను (ఐదు) మిరియాలను (ఐదు) అల్లం ముక్కను (చిన్నది) అన్నిటిని కలిపి కచ్చాపచ్చాగా దంచి నీళ్ళలో వేసి కషాయం కాయాలి. దీనికి కొద్దిగా బెల్లం చేర్చి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 3. నవాసాగరం (అమోనియం క్లోరైడ్), సున్నం ఈ రెంటిని సమతూకంగా తీసుకుని పొడిచేసి కలపాలి, దీనిని చిటికెడు తీసుకొని ముక్కుపొడుం లాగ పీల్చాలి. 4. మిరియాల చూర్ణాన్ని చిటికెడు మోతాదుగా పెరుగుతో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 5. గోధుమ పిండి (అరచెంచా) వాయువిడంగాల చూర్ణం (అరచెంచా) రెంటినీ కలిపి రాత్రి పడుకునే ముందు నీళ్ళతో తీసుకోవాలి.

 

ఔషధాలు: వ్యోషాదివటి. లక్ష్మీవిలాసరసం, కాంచనారగుగ్గులు, షడ్బిందు తైలం (ముక్కులో డ్రాప్స్), త్రిభువన కీర్తిరసం, లవంగాదివటి, కర్పూరాదిచూర్ణం, కస్తూరిమాత్రలు,

బాహ్యప్రయోగాలు - కర్పూరాదితైలం, చంద్రకళాలేపం, రాస్నాదిచూర్ణం.


2. చెవి అంతర్భాగం (మిడిల్ ఇయర్) లో ఇన్ఫెక్షన్:

వైరస్, బ్యాక్టీరియా వంటి వాటి వల్ల మధ్య చెవి కుహరం వ్యదిగ్రస్తమై కర్ణభేరిని వాపునకు గురిచేస్తుంది. దీని పర్యవసానంగా వినికిడి శక్తి తాత్కాలికంగా లోపించవచ్చు.

 

గృహచికిత్సలు: 1. కామంచి ఆకు రాసాన్ని చిన్న సెగమీద వేడిచేసి మూడు లేదా నాలుగు చుక్కలు చొప్పున రోజుకు రెండు సార్లు చెవిలో డ్రాప్స్ వేయాలి. 2. కుంకుడికాయల రసాన్ని మూడు లేదా నాలుగు చుక్కల చొప్పున చెవిలో రోజుకు రెండు లేదా మూడుసార్లు డ్రాప్స్ గా వేసుకోవాలి. 3. తాటి చెట్టు లేత పువ్వు మొగ్గల నుంచి రసం పిండి చెవిలో డ్రాప్స్ గా వేసుకోవాలి. 4. మిరప పువ్వులను, నల్లతుమ్మ పువ్వులను సమానభాగాలుగా తీసుకొని, ముద్దగా దంచి రసం పిండాలి. దీనిని చెవిలో డ్రాప్స్ గా వేసుకోవాలి.

ఔషధాలు: త్రిభువనకీర్తి రసం, వ్యోషాదివటి.

 

3. వెలుపలి చెవికి ఇన్ఫెక్షన్:

వెలుపలి చెవి (ఎక్స్ టర్నల్ ఇయర్) తాలూకు నాళాన్ని కప్పుతూ చర్మం ఉంటుందన్న సంగతి తెలిసిందే, ఈ నాళం తాలూకు చర్మం పైన సెగగడ్డలు, గుల్లలు వంటివి తయారైనప్పుడుగాని, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధి వచ్చినప్పుడుగాని తత్సంబంధిత ప్రాంతంలో తీవ్రంగా నొప్పి వస్తుంది. చెవిలోపలి ఎముకల సముదాయం పైన ఉండే చర్మం బిగుతుగా అమరి ఉండటంతో ఏ మాత్రం వాపు జనించినా, అది ప్రసరించడానికి స్థలం చాలక నొప్పి కలుగుతుంది.

 

గృహచికిత్సలు: 1. ఆవనూనెను వేడిచేసి చెవిలో డ్రాప్స్ గా వేయాలి. 2. నవ్వుల నూనెలో (పావు కప్పు) వెల్లుల్లి గర్భాలను (రెండు) వేసి వేడిచేసి చెవిలో నాలుగు లేదా ఐదు డ్రాప్స్ చొప్పున వేయాలి. ఔషధాలు: త్రిఫలాగుగ్గులు, గంధకరసాయనం, బాహ్యప్రయోగాలు - అపామార్గ తైలం, సముద్రఫేన చూర్ణం (సముద్రపు నురుగు చూర్ణం)


4. కర్ణభేరి పగలటం (పర్ఫరేటెడ్ ఇయర్ డ్రమ్): వ్యాధులు కలగటానికి కారణాలను చెబుతూ శాస్త్రకారుడు 'అసాత్మ్యేంద్రియార్థ సంయోగం' గురించి చెప్పాడు. దీని అర్థం, చెవి అనే జ్ఞానేద్రియం, శబ్దం అనే ఇంద్రియార్థంతో అసహజమైన రీతిలో సంయోగం చెందటం. ఇదే సందర్భంలో ఆగంతుజ కారణాలను కూడా వ్యాధులకు కారణాలుగా చెబుతాడు. ఆగంతుజ కారణాలంటే గాయాలు, దెబ్బలు మొదలైనవన్న మాట. చెవి నొప్పి కలగటానికి ప్రధానమైన కారణాలు ఇవే. పెద్ద విస్పోటనాలు జరిగినప్పుడుగాని, థియేటర్లలో స్టీరియో శబ్దాలను విన్నప్పుడుగాని, చెవి ప్రాంతంలో బలమైన దెబ్బ తగిలినప్పుడుగాని కర్ణభేరి పగిలి తీవ్రమైన నొప్పి కలుగుతుంది, శబ్ద గ్రహణ శక్తి కూడా తగ్గిపోతుంది. ఇలా జరిగినప్పుడు సాధారణంగా కర్ణభేరిలోని రంధ్రం దానంతట అదే పూడుతుంది. మందులు వాడితే ఫలితం మరింత త్వరితగతిని కనిపిస్తుంది.

ఔషధాలు: శారిబాది వటి.

బాహ్యప్రయోగం - బిల్వాది తైలం.

 

5. దంతసంబంధ సమస్యలు:

కొంతమంది యుక్త వయస్కులలో జ్ఞాన దంతం మొలిచేటప్పుడు చెవిపోటు కూడా వస్తుంది. ఇలాగే కొంతమంది పిల్లల విషయంలో కూడా జరుగుతుంది. దంతాలు చిగుర్లను తొలుచుకుని వచ్చే సమయంలో, ఏ పక్కనుంచైతే దంతాలు వస్తుంటాయో ఆ ప్కకనుండే చెవిని మాటి మాటికి తడుముకోవటం గాని, రుద్దుకోవడం కాని చేస్తుంటారు. నరాలనేవి దంతాల చిగుర్లనుంచి చెవి వరకూ వ్యాపించి ఉండటమే దీనికి కారణం. ఔషధాలు: ఖదిరావటి,

బాహ్యప్రయోగం - ఇరిమేదాది తైలం.

 

6. నిత్యరొంప (సైనసైటిస్):

మన తలను బరువులేకుండా తేలికగా ఉంచడం కోసం కపాలం లోపల సైనస్ లనే గాలి గదులు ఉంటాయి. ఇవి వ్యాధిగ్రస్తమైనప్పుడు నొప్పి అనేది చేవిలోనికి నరాల ద్వారా ప్రసరించే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో ఇటువంటి నొప్పిని 'రిఫర్డ్ పెయిన్' అంటారు. ఇటువంటి నొప్పి ఎక్కువగా చెవికి వెనుక పక్కనుండే ఖాళీ ప్రదేశం వ్యాధిగ్రస్తమైనప్పుడు (మాస్టాడైటిస్)వస్తుంది. దీనికి మందులతోపాటు స్వేదకర్మ వంటి చికిత్సలు అవసరమవుతాయి.

 

గృహచికిత్సలు: 1. తులసి, అల్లం, ఎలాక్కాయలు, మిరియాలు, మునగాకులను కషాయం కాచుకుని తాగాలి. 2. వావిలి రసం (పావులీటరు), నువ్వుల నూనె (పావు లీటరు), ఉల్లిముద్ద (పావు కిలో) వీటినన్నిటిని కలిపి సన్నని సెగ మీద ఉడికించాలి. నూనె మాత్రం మిగులుతుంది. దీనిని రోజువారిగా తలకు రాసుకోవాలి. 3. తుమ్మి ఆకులను (గుప్పెడు), వెల్లుల్లి గర్భాలను (మూడు), ఉప్పును (చిటికెడు) కలిపి ముద్దచేసి రసం పిండాలి. దీనిని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్ గా నాలుగైదు రోజులు వేసుకోవాలి.

 

ఔషధాలు: ఆరోగ్యవర్ధీనీ వటి, చిత్రక హరీతకి, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగారాజ గుగ్గులు, నవక గుగ్గులు, నవాయాస చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజ గుగ్గులు. పైకి వాదాల్సినవి - అసన బిల్వాది తైలం, బలా గుడూచ్యాది తైలం, బలాశ్వగంధాది తైలం, రాస్నాది చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫలాది తైలం.


7. హనుగ్రహం (లాక్ జా): దవడ ఎముక తాలూకు జాయింటు చెవికి ముందు భాగాన కదులుతుంటుంది. దీనిని 'టెంపోరో మాండిబ్యులర్ జాయింట్' అంటారు. ఈ భాగం వ్యాదిగ్రస్తమైనప్పుడు దవడను కదిలించినప్పుడల్లా చెవిలో క్లిక్ మనే శబ్దం వస్తుంటుంది. ఒకోసారి దవడను కదిలించడం కష్టమైపోవడంతో పాటు చెవిలో నొప్పిగా కూడా ఉంటుంది. దీనిని మామూలు చెవిపోటును చికిత్సించినట్లుగా కాకుండా కీళ్లనొప్పి మాదిరిగా చికిత్సించాల్సి వుంటుంది. అంటే స్నేహస్వేదాలు, పంచకర్మలతోపాటు శోథహర ఔషధాలతో శమన చికిత్సలు చేయాల్సి వుంటుంది.

ఔషధాలు: మహాయోగరాజగుగ్గులు, మహావాతవిధ్వంసినీ రసం, పునర్నవాది గుగ్గులు, లక్షాదిగుగ్గులు.

బాహ్యప్రయోగం - మహానారాయణతైలం.