ఆ సారి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ,  తుళ్ళుతూ వుండే వాడి మొహం చిన్నబోయింది. ఆ సంగతిగుర్తించాక రెండు మూడుసార్లు అడిగాను ఏం లేదు, ఏం లేదటూ మాట దాటవేశాడు. ఆఖరికి ఒక రోజు ఇంట్లో అందరూ నిద్రపోయాక నెమ్మదిగా నాగదిలోకి వచ్చాడు ఆశ్చర్యంగా చూశాను 'అమ్మా' అన్నాడు ఏదో చెప్పాలని ఆరాటపడుతూ చెప్పలేక సందేహించాడు. నల్లబడిన మొహం వాడి సంశయనం చూశాక ఏదో వుందని అన్పించింది. తరచి తరచి అడిగాను, ఆఖరికి" అమ్మా మీరు నన్ను క్షమిస్తానంటే ఒకమాట చెబుతాను" అంటూ తన ప్రేమవ్యవహారం, రిజిష్టరు పెళ్ళి, బిడ్డ పుట్టుట అంతా తలవంచుకుని చెప్పాడు, వింటూ నిర్ఘాంతపోయాను కులమేకాక మతం వేరు మన పరువు వశం, మర్యాద మంటగలిపావు అంటూ ఆవేశంలో తిట్టాను "అమ్మా, మీరెన్ని అన్నా భరిస్తాను కాని నేను చేసిన అపరాధానికి నా కన్నబిడ్డ అనాధగా ఏడాది చేతుల్లోనే పెరగడం నేను సహించలేకుండా వున్నానమ్మా ఆ బిడ్డకి ఏదో దారి మీరే చూడాలి" అంటూ కంట తడి బెట్టాడు. వాడి కంటినీరు చూడగానే ఆవేశం దిగిపోయింది. చలించాను వాడి బాధ ఆవేదన అర్ధం అయి కరిగిపోయాను. ఇప్పుడింక వాడు చేసిన పనికి ఇంకా ఎన్ని అని మాత్రం లాభం ఏమిటి? జరిగిందేదో జరిగిపోయింది. కాని ఆ బిడ్డను ఏం చెయ్యడం? మాబిడ్డ అని చెప్పి యింటిలో ఎలా పెట్టుకుంటాం లోకం ఏమంటుంది, కన్నతల్లిని కనుక నేనుక్షమించినా రంగారావు క్షమించడు. నా కోడలి దృష్టిలో నా రెండో కొడుకు చులకన అవడం నేను సహించలేను. ఏంచేద్దాం? ఇద్దరం ఎంతోసేపు ఆలోచించాం ఎంతో చర్చించాం. ఎన్నో పరిష్కారమార్గాలు వెదికాం, ఆఖరికి నాకో ఉపాయం తట్టింది. ముందుగా ఆ పసిబిడ్డని అనాధశరణాలయంలో చేర్పించిన తరువాత ఏదో నెపంతో యింట్లో చేర్చవచ్చని ఆలోచించాను. ఇలా అయితే ఎవరికీ ఆ బిడ్డ మా రక్తం పంచుకు పుట్టిన బిడ్డే అని తెలియదు. ఆ బిడ్డా అనాధ అవదు అని ఆలోచించాము బిడ్డని పెంచుకోవడానికి తెచ్చుకోవడం యింత తేలికకాదని నాకు తెలుసు అయితే నా పెద్ద కోడలికి మొదటిసారి కాన్పు చాలా కష్టమే, ఏదో అవాంతరం  జరిగి అతి  కష్టం మీద ఆపరేషన్ చేసి బిడ్డని తీశారు - మళ్ళీ యింకోసారి కాన్పు రాకూడదని గర్భసంచియే తీసేస్తారు. ఆ వున్న వక్కనలుసు తప్ప మరి మా యింట బిడ్డలు లేరు కనుక ఆడపిల్లకోసం అంటూ ఈ బిడ్డని పెంచుకోవచ్చు అని ఆలోచించాను. నా ఆలోచనకి నా కొడుకుకూడా సమ్మతించారు. బిడ్డను పెంచుతున్న ఆయా భర్త చేత రహస్యంగా ఓనాడు ఆ బిడ్డని శరణాలయంలో విడిచి పెట్టించాం. ఆ బిడ్డ మేడలో వెంకటేశ్వరుని రాగిబిళ్ళ వుంటుంది ఆనవాలుగా మొదటి పని పూర్తి అయింది. తర్వాత ఏదో వంకన శరణాలయం నించి ఆ పిల్లను తీసుకురావాలను కుంటుండగానే ఈలోగా ఘోరమైన కారు ప్రమాదంలో నా కొడుకు, కోడలు మనవడు అందరూ చనిపోయారు. ఆ హఠాత్ సంఘటనతో కొన్నాళ్ళు అసలు మతే లేకుండా పోయింది. కాస్త ఆ దుఃఖం ఉపశమించాక చనిపోయిన నా కొడుకు ఆత్మశాంతి కైనా నేను ఆ బిడ్డని అలా అనాధగా వదిలేయరాదని నిశ్చయించాను. కానీ ఏ వంకతో యింటికి తీసుకురాను, నేను మంచాన పడిన రోగిష్టిని రంగారావు పిచ్చివాడిలా యిల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. వాడికి ఏమని చెప్పి వప్పించను. అక్కడికి ఎన్నిసార్లు యిల్లు పాడుపడినట్టుంది. పెళ్ళికి వప్పుకోకపోతే కనీసం ఏ బిడ్డనైనా తెచ్చి పెంచుకొందాం, అంటూ చెప్పాను రంగారావు నా మాటా వినలేదు. ఎన్నిసార్లు ఆ ప్రసక్తి తెచ్చినా ఏమిటమ్మా పిచ్చి మన వాళ్ళను కున్నవాళ్ళే మనని విడిచిపోయారు, ఎక్కడినుంచి తెచ్చి పెంచుకున్నది మన బిడ్డ ఎలా అవుతుంది? అనవసరంగా ఈ జంజాటం మనకెందుకు మీరు రోగిష్టి, నేను మగవాడిని యింట్లో దాసీలున్నా బిడ్డని పెంచటం అంతమాటలా సరి అయిన ఆదరణ చూపకుండా దాసీలమీద విడిచిపెట్టే దానికి యీకొత్త బంధం మనకెందుకు అంటూ కొట్టి పారేశాడు. ఇంకేం చెయ్యను మా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అలా దిక్కూ మొక్కూ లేని అనాధగా పెరుగుతూందన్న నిజం నా గుండెని దహిస్తూంది శ్యామలా నా కొడుకిచ్చిన మాట నిలుపుకోలేక పోతునానన్న ఆవేదన నాకు శాంతి నీయడం లేదు. ఆ బిడ్డని అలా వదిలేస్తే చనిపోయిన నా బిడ్డ ఆత్మ శాంతిగా వుంటుందా. యీ నిజం తెలిసి నేను యెలా ప్రశాంతంగా బ్రతకగలను చెప్పు!" ఆవిడ విషాదంగా అంతా చెప్పుకొచ్చి నిట్టూర్చింది. నేను ఆశ్చర్యపోయాను. అంతకంటే యీ జమీందారిణి తనతో చెప్పడంలోగల అర్ధం బోధపడక మరింత ఆశ్చర్యపోయాను. నా మొహంలో ఆశ్చర్యం గుర్తించి జమీందారిణి తిరిగి మొదలు పెట్టారు "శ్యామలా! ఈ విషయాలన్ని నీకెందుకు చెప్పానని ఆశ్చర్యపడుతున్నావుగదూ! చూడు శ్యామలా! ఆ బిడ్డని ఈ ఇంట్లోకి తీసుకురావడం అన్నది జరిగితే అది నీవల్లనే కావాలి......"
    "నేనా........?" ఆశ్చర్యంగా అడిగాను. "నేనా ...... ఎలా....... శ్యామలా ..... నీవు చెప్పితే రంగారావు కాదనడన్న నమ్మకం నాకుంది. యీ రెండు నెలలుగా యింట్లో నీవు వచ్చినాక వాడెంత మారింది నేను గమనిస్తూనే ఉన్నాను."
    నా మొహం ఎర్రపడింది.......తడబడుతూ ఏదో అనబోయాను. జమీందారిణి అది గుర్తించినట్టే శ్యామలా మంచంలోంచి కదల్లేని ఓ వృద్దురాలి కడసారి కోరిక యిది. ఈ పని నెరవేర్చకుండా ప్రశాంతంగా నేను చనిపోను; నా కోరిక తీర్చగలవా" అంత గంభీరత ఏమయిందో ఓ యాచకురాలిలాగ ఆవిడ ఆశగా చూస్తూ ఏం జవాబిచ్చాడో తట్టనట్టు అచేతనురాలి నయ్యాను. కాని కాని నేను చెపితే ఆయన వింటారా అసలు అంత చదువు నాకేది......" తడబడుతూ బిడియంగా అన్నాను. అసలు ఏమని అడగను?" ఏమని అడుగుతానో ఏం చేస్తానో అది నాకు తట్టకేనిన్ను అడుగుతున్నాను శ్యామలా, వాడికి ఏమని చెప్పావో ఎలా వప్పిస్తావో నీవే ఆలోచించు. యీ రహస్యం మాత్రం వాడికి తెలియకూడదు. వాడి దృష్టిలో నాకొడుకు దిగజారడం నేను సహించలేను శ్యామలా, నీవు ఒకప్పుడు అనాధగా పెరిగావు. అనాధ అంటే ఏమిటో నీకంటే ఎవరికీ బాగా తెలియదు. యింత జమీ, యింత ఆస్థివుండి నా బిడ్డ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఎలా అనాధగా పెరగడం నేను సహించలేను శ్యామలా ఏం చేస్తావో ఆ బిడ్డని ఈ యింత చేర్చు అది నా కోరిక. ఏం తీర్చగలవా" వృద్ధ జమీందారిణి కంట తడబెడుతూ, వణుకుతున్న చెయ్యి ముందుకు చాపారు. అప్పుడింకా నా కర్తవ్యం ఏమిటి? కాదని చెయ్యనని ఎలా చెప్పగలను?" శ్యామలా! వెంటనే కాకపోయినా కాస్త సమయం చూసి నెమ్మదిగా చెయ్యొచ్చు. నీవు మాట యిస్తే నాకు నిశ్చింత యింక" అంటూ ఆవిడ తొందర పెట్టారు. యింక ఆలోచించేందుకు అనేందుకు, ఏమిలేక ఆవిడ చేతిలో చేయి వేశాను. "నా శాయశక్తులా ప్రయత్నిస్తానని ఆ బిడ్డని అనాధగా వదిలివేయనని, ఈ సంగతి నా పెదవి దాటి బయటికి రాదని" వాగ్దానం చేశాను. ఆమె నిశ్చింతగా నిట్టూర్చారు.
    
    
                             -----అయిపోయింది-----