హాలులో మాటలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి... సన్నగా వినిపిస్తున్న సంగీతం తప్ప మరో శబ్దం కొన్ని క్షణాలపాటు వినిపించలేదు. కారణం___నూతన వధూవరులు మేడ మెట్లు దిగి వస్తున్నారు. అందరి కళ్ళు అటే తిరిగాయి. అసలే అందగత్తె అయిన శ్యామలాదేవి ఆరోజు మరింత అందంగా, మనోహరంగా కనిపించింది అందరికీ. ఒంటి రంగులో కలిసిపోయే ఫారిన్ నైలెక్స్ జరీ పూవుల చీర, అదే రంగు బ్లౌజ్, ఆధునికమైన సిగ, సిగలో విరిసీ విరియని గులాబులు, ఆభరణాల నించి కింద చెప్పుల వరకు అన్నీ మాచింగ్ వే! అన్నిటికంటే ఆరోజు ఆమె మొహంలో నిండిన తృప్తి, సంతోషం వల్ల గాబోలు__రోజూ కంటే చిన్నగా కనిపిస్తూంది. చూస్తున్న ఎవరూ ఆమెకి నలభై ఏళ్ళన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఆమెపక్కన రామ్ మోహన్ రావు చాలా సింపుల్ గా తెల్లని పైజామా, సిల్కు లాల్చీలతో ఉన్నాడు. ఇద్దరూ క్రిందికి దిగి వచ్చి గెస్ట్ లను ఉద్దేశించి నమస్కారం చేశారు. అందరూ అట్టహాసం చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. తాము తెచ్చిన బహుమతులు ఎదురువెళ్ళి అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మగవాళ్ళు రామ్ మోహన్ రావుకి షేక్ హాండిచ్చారు. శ్యామలాదేవికి మళ్ళీ వైవాహిక జీవితంలో అడుగుపెట్టినందుకు తమ సంతోషాన్ని, అభినందనలని తెలిపారు. మరీ పరిచయస్థులు ఆమె భుజం చుట్టూ చెయ్యివేసి తమ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదంటూ బాధపడిపోయారు. అందరి అభినందనలని వికసిత వదనంతో, ముకుళిత హస్తంతో అందుకుంది శ్యామలాదేవి. బేరర్లు మళ్ళీ గ్లాసులు నింపారు. అందరూ గ్లాసులు పైకెత్తి, "ఛీర్స్... ఫర్ ది హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ది న్యూలీవెడెడ్ కపుల్" అంటూ విష్ చేశారు.
    డ్రింక్ పార్టీ, ఆ తరువాత బయట గార్డెన్ లో ఏర్పాటుచేసిన డిన్నర్ పార్టీ ఆర్భాటంగా ముగిశాయి. దంపతులు అందరి మధ్య తిరుగుతూ అతిథి మర్యాదలు స్వయంగా చూశారు.
    అర్థరాత్రికి పార్టీ ముగిసింది.

                                          *    *    *

    చాలా రోజుల తరువాత...
    ఆ రోజు బీచ్ ఒడ్డున పెద్ద బహిరంగ సభ జరుగుతూంది. రాజారావు ఉరఫ్ శ్యామలాదేవి మాజీభర్త ఉద్రేకంగా ఉపన్యాసం ఇస్తున్నాడు.
    "మనది పవిత్ర భారతదేశం! స్త్రీ మన జాతి పవిత్రతకి అపురూపమయిన చిహ్నం. ఆమె భారతనారి. ఆదర్శ గృహిణి, ధర్మపత్నిగా గౌరవించబడాలి. ఆమె స్థానాన్ని గుర్తించి గౌరవించే అవసరం మనకు ఉంది. స్త్రీ కష్టసుఖాలెరిగి ప్రవర్తించిననాడు ప్రతి సంసారం నందనవనం అవుతుంది. మన వివాహ వ్యవస్థలో పరమార్థం ఇదే..."
    "హియర్, హియర్!" అని ఆవేశంగా చప్పట్లు చరిచిన భారతనారీ గౌరవ ప్రదాతల్లో మొదట ఉన్నాడు సూర్యనారాయణ. ఆ ఉపన్యాసానికి ఊగిపోతూ ఆనందపడిపోతున్నాడు.
    సముద్రం ఒడ్డున దూరంగా... ఏకాంతంగా ఉన్నచోట రాజారావుగారి మాజీ భార్య... ప్రస్తుతం రామ్ మోహన్ రావు భార్య అతని ఒళ్ళో తల పెట్టుకుని తన్మయావస్థలో వుంది.
    "రామ్, మనం ఎంత అదృష్టవాంతులం" శ్యామల అంది. ఆమెని దగ్గిరకి తీసుకుంటూ. "ఈ దేశంలో మనం ఇలా దగ్గరవడం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు శ్యామూ" అన్నాడు. వెన్నెలని చూసి ఎగిరి పడుతున్న కెరటాలు వారిద్దరి భావోద్వేగం ముందు మేం చాలలేమన్నట్లు వారి పాదాలదాకా వచ్చి పడగ ముడిచి జారిపోయిన పాముల్లా జారిపోతున్నాయి.
    దూరంగా ఉపన్యాసం సాగుతూనే ఉంది.
    సముద్రానికి చేరువగా వున్న గూడెంలో రంగి చెవులు హోరెత్తిస్తున్న ఆ ఉపన్యాసానికి నిద్ర పట్టక విసుక్కుంది. "ఏటిమావాఁ, ఇందాకటి నించి ఏటి సెప్తుండారు... అబ్బబ్బ, ఇని ఇని సెవులు హోరెత్తిపోతన్నయి. నిద్రట్టిసావడం లేదు" అంది.
    "ఏటోనే మనకేటి తెలుస్తుంది, పెద్దోరి గొడవ. పదహే సముద్రం ఒడ్డుకాడకి పోయి నల్లగా ఇసకలో పడుకుందాం" అన్నాడు వెంకటేశు. నిద్రపోతున్న ఇద్దరి పిల్లలని ఇద్దరూ తలో పిల్లని చంకనేసుకుని నడిచి వెళ్ళి, సముద్రం ఒడ్డున ఓ పడవ చాటున ఆ ఇసకలో పడుకుని కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు.
    అదే సముద్రంలో___ నిర్మానుష్యమైనచోట___ నడిరాత్రి ఒక భారతనారి, ఆదర్శ గృహిణి, ధర్మపత్ని__ శకుంతల వచ్చి సముద్రంలో దూకింది.
    సముద్రం హోరు ఎక్కువయింది.

                                         * సమాప్తం *