రక్తాన్ని వాంతి చేసుకోవటం

 

1. అధికసంఖ్యలో వాంతులైనతర్వాత రక్తం వాంతి అయ్యిందా?

అధిక సంఖ్యలో వాంతులు

2. తీవ్రంగా అజీర్ణం ప్రాప్తించిందా?

తీవ్ర ఆమ్లపిత్తం (ఎసిడిటి / గ్యాస్ట్రైటిస్)

3. ఉదారప్రాంతంలో తరచుగా కత్తితో కోసినట్లు తీవ్రమైన నొప్పి వస్తుంటుందా?

కడుపులో పుండ్లు (పెప్టిక్ అల్సర్)

4. మద్యపానం విపరీతంగా చేస్తారా? ఇటీవల మీకు కామెర్లు వచ్చాయా?

కాలేయ కణజాలం గట్టిపడి (వ్యాధిగ్రస్తమవటం (సిరోసిన్)

5. బరువును ఎక్కువగా కోల్పోయారా?

క్యాన్సర్

6. మీ శరీరంలో తేలికగా రక్తస్రావమై చర్మం కములుతుంటుందా?

స్వతః సిద్ధంగా రక్తస్రావం అవ్వడం (ఈజీ బ్లీడింగ్ సిండ్రోమ్)

 

అన్నవాహిక, అమాశయం, చిన్న పేగుల మొదటి భాగం వీటిల్లో ఏదో ఒక ప్రదేశం నుంచి రక్తస్రావమవుతున్నప్పుడు రక్తాన్ని వాంతి చేసుకుంటారు. అమాశయంలోనికి చేరిన రక్తం లోపలి పొరలను కల్లోల పరిచే అనేక సమస్యలనుత్పన్నం చేస్తుంది. వాటిల్లో రక్తాన్ని వాంతి చేసుకోవడం ఒకటి, రక్తమ వాంతి అయ్యే విధానం సమస్య ఏర్పడిన ప్రదేశం, తీవ్రతలను బట్టి మారుతుంది. వామక ద్ర్రవ్యంలో కేవలం రక్తపు చారికలు మాత్రమే కనిపించడంగాని, లేదా మొత్తంగా రక్తాన్నే వాంతి చేసుకోవడంగాని జరగవచ్చు. వాంతి రూపంలో బయటకు వచ్చే రక్తపు రంగులో కూడా తేడాలు ఉంటాయి. ఉదాహరణకు, రక్తం తాజాగా, ఎర్రగా ఉంటే అప్పుడే రక్తస్రావమైనట్లూ, అమాశయం తాలుకూ ఆమ్ల పదార్థాల ప్రభావానికి లోను కానట్లూ అర్థం. అలా కాకుండా రక్తం కాఫీ రంగులోనో, నల్లని రంగులోనో కనిపిస్తే రక్తం చిన్న పేగుల నుంచి వచ్చిందనీ, పైగా జీర్ణ రసాల ప్రభావానికి లోనయిందనీ అర్థం.

ఆయుర్వేదంలో రక్తపు వాంతిమో 'రక్తష్ఠీవనం' అంటారు. దీనినే హెమటెమిసిస్' అనే శాస్త్రీయ పదంతో కూడా పిలుస్తారు. రక్తష్ఠీవనం జరుగుతున్నప్పుడు ఎండోస్కోపీ లేదా బేరియం ఎక్స్ రే లద్వారా సమస్య ఏమిటన్నది నిర్ణయించవచ్చు. సాధారణంగా సమస్య ప్రారంభమై కొంత సేపు గడిచిన తరువాత రక్తస్రావం దానంతట అదే ఆగిపోతుంది. అలా కాకుండా చాలా సేపటి వరకూ రక్తస్రావం జరుగుతుంటే రక్తభారం తగ్గటంతో పాటు రక్తభ్రమణం నిలిచిపోయి (సర్క్యూలేటరీ ఫెయిల్యూర్) ప్రాణ ప్రమాదం జరిగే వీలుంది. దీనిక్కి సత్వరమే వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.

1. అధిక సంఖ్యలో వాంతులు:

మనం తినే ఆహారం ఎప్పుడూ కింద వైపుకే ప్రయాణిస్తుంది. అంత్రచలనం (పెరిస్టాలిసిస్) దీనికి మొదటి కారణమైతే గురుత్వాకర్షణ శక్తి రెండవ కారణం. వాంతులు అవుతున్నప్పుడు ఈ రెండు శక్తులకూ వ్యతిరేకంగా, వీటి బలానికి మించి, అత్యంత వేగంతో, అమిత శక్తితో శరీరం పని చేస్తుంది. ఈ నేపథ్యంలో అన్నవాహిక (ఇసోఫేగస్) లోపలి పొర చీరుకుపోయి రక్తస్రావమయ్యే అవకాశం ఉంది. ఇదే ఒకవేళ జరిగితే రక్తం స్వచ్చమైన ఎరుపు రంగులోగాని, ఒకింత ముదురు రంగులోగాని వాంతి రూపంలో బయటకు వస్తుంది. సాధారణంగా మసాలాలు దట్టించిన మాంసాహారాలతో లేదా అడ్డూ అదుపు లేని మద్యపానంతో ఇలా జరుగుతుంటుంది. అదృష్టవశాత్తు ఇది స్వయం అంతమైనది, అంటే, తదుపరి ప్రేరణ లేనట్లయితే అంతటితో ఈ సమస్య సమిసిపోతుందన్నమాట. అవసరమైతే దీనికి వైద్య సలహా మేరకు 'పిత్తహర' ఔషధాలు తీసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు చల్లని పాలతో అమాషయ శోధన (గ్యాస్ట్రిక్ లీవేజ్) చేయాల్సి ఉంటుంది.

ఔషధాలు: ఆమ్లపిత్తాంతక లోహం, అవిపత్తికరచూర్ణం, మయూరచంద్రికా భస్మం, సూతశేఖర రసం.

2. తీవ్ర ఆమ్లపిత్తం (ఎసిడిటి / గ్యాస్ట్రైటిస్):

తీవ్రమైన ఎసిడిటి తో దీర్ఘకాలంగా బాధపడే వారికి ఒకోసారి ఆమాశయపు లోపలి పొర చెదిరి అంతర్గతంగా రక్తస్రామయ్యే అవకాశం ఉంది. ఆమాశయంలో సంచితమైన రక్తం వాంతి రూపంలో బయటపడుతుంది. ఇలా దానంతట అదే జరగవచ్చు. లేదా, మసాలాలు, కారం, పులుపు, నూనెలతో చేసిన వేపుడు పదార్థాల ప్రేరణతో కలగవచ్చు. వీటికి తగ్గట్టుగా మద్యపానం, టీ, కాఫీ, ధూమపానాలు కూడా తోడైతే సమస్య మరింత ఎక్కువవుతుంది. పోతే కొన్ని రకాల అల్లోపతి మందులు కూడా ఎసిడిటి సమస్యనుత్పన్నం చేసి, రక్తపు వాంతిని కలుగచేస్తాయి. ఉదాహరణకు యాస్ప్రిన్ సంబంధితమనసులు, స్టీరాయిడ్ మందులూ ఈ కోవకు చెందుతాయి. మీ సమస్యకు వీటిల్లో ఏది కారణమో తెలుసుకొని దానిని మానేయాలి. మందుల వల్ల సమస్య ఏర్పడుతున్నదని తేలితే ఆ విషయాన్ని మీకు చికిత్స చేస్తున్న డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లండి.

ఔషధాలు: అర్క లవణం, అష్ట చూర్ణం, భాస్కర లవణం, చిత్రక గుటిక, ధాత్రీ లోహం, ఇందుకాంత ఘృతం, కళ్యాణక క్షారం, కామదుఘా రసం, లీలా విలాస రసం, నారికేళ లవణం, ప్రవాళ పంచామృతం, సాముద్రాది చూర్ణం, శంఖ భస్మం, శంఖ వటి, శుక్తి భస్మం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, వరాటికా భస్మం, వైశ్వానర చూర్ణం.

3. కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్): 

ఆమాశయంలో లేదా చిన్నపేగు మొదటి భాగంలో అల్సర్లు తయారైనప్పుడు సాధారణంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాగే ఆమాశయపు లోపలి పొర ఆమ్ల పదార్థాల ప్రభావానికి లోనై వ్రణం (అల్సర్) తయారవుతుంది.

మనలో చాలా మందికి నోరు, చర్మం తదితర ప్రదేశాల్లో అడపాదడపా అప్సరలు తయారైనప్పటికి శరీరానికుండే రోపణ శక్తి వలన కొద్ది రోజుల్లోనే పూర్తిగా మానిపోతాయి. అయితే ఆమాశయం లోపల తయారైన అల్సర్లు మాత్రం అంత త్వరగా మానవు. నిరంతరమూ వాటికి యాసిడ్స్ తగలటం, జీర్ణమండలంలో ఎల్లప్పుడూ అంత్రచలనాలు (పెరిస్టాలిటిక్ మూవ్ మెంటు) ఉండటం, ఆమ్లాలు ఆమాశయపు లోపలి పొరల్లోకి చొచ్చుకొని వెళ్లి స్థానిక రక్తనాళాన్ని కూడా కొరికి వేయడం వంటి కారణాలు అల్సర్లను మానకుండా 'కోతిపుండు బ్రహ్మరాక్షసి' చందంగా తయారుచేస్తాయి. రక్తనాళం (ముఖ్యంగా ధమని) వ్యాధి ప్రభావానికి లోనైనప్పుడు హఠాత్తుగా రక్తస్రావమవడంతో పాటు తీవ్రమైన నొప్పి, రక్తపు వాంతీ కలుగుతాయి.

అల్సర్ల వల్ల ఏర్పడిన రక్తస్రావంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. ఛాతి అడుగు భాగంలో, ఆమాశయం ఉండే ప్రాంతంలో తీవ్రంగా నొప్పి వస్తుంది. ఆహారంతో కాకుండా మధ్య వేళల్లో ఈ నొప్పి ప్రస్పుటంగా వ్యక్తమవుతుంది. అలాగే అర్థరాత్రిళ్లు ఎక్కువగా వస్తుంటుంది. దీనిలో మరో ప్రధానమైన లక్షణం నొప్పి ఒకే చోట కేంద్రీకృతమవడం, నొప్పి ఎక్కడుందో చూపించమన్నప్పుడు బాధితులు నొప్పి ఉన్న ప్రాంతాన్ని వేలితో స్పష్టంగా చూపించగలుగుతారు. ఈ నొప్పికి ఆహారపదార్థాలకూ సంబంధం ఉంది. వంటసోడా, పాలు తదితర పదార్థాలతో నెమ్మదించడాన్నీ, మద్యం, సిగరెట్లు, మసాలాలు, వేపుడు కూరలు, బిర్యానీ వంటి నూనె వస్తువులతో ఎక్కువవ్వడాన్నీ గమనించవచ్చు. వాంతితో కూడుకున్న రక్తానికి, దగ్గుతోకూడుకున్న రక్తానికి మధ్య బేధాలు రక్తపు వాంతి (హెమటెమిసిస్) దగ్గుతో పాటు రక్తం పడటం (హెమాప్టైసిస్)

 గృహచికిత్సలు: 1. పిల్లిపీచర గడ్డలు (శతావరి) పచ్చివి తెచ్చి, దంచి రసం తీసి పూటకు అరకప్పు చొప్పున రెండు పూటలా పుచ్చుకోవాలి. 2. శతావరి చూర్ణాన్ని పూటకు అరచెంచాడు చొప్పున అరగ్లాసు పాలతో కలిపి రెండుపూటలా తీసుకోవాలి. 3. ఉసిరి చూర్ణాన్ని అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకోవాలి. 4. శొంఠి, నువ్వులు, బెల్లం అన్నీ సమభాగాలు తెసుకొని ముద్దచేసి పూటకు చెంచాడు చొప్పున రెండు పూటలా గోరువెచ్చని పాలతో పుచ్చుకోవాలి. 5. నత్తగుల్లలను శుభ్రంగా కడిగి, పొడిచేసి చిటికెడు (500 మో.గ్రా) పొడిని వేడినీళ్ళతో కలిపి తీసుకోవాలి. దీనికి వాడేటప్పుడు నోరు పొక్కే అవకాశం ఉంది కనుక నోటికి నేతిని పూసుకోవాలి.

ఔషధాలు: కామదుఘారసం, సూతశేఖరరసం, ధాత్రీలోహం, నారికేళలవణం, శతావరి ఘృతం.

4. కాలేయ కణజాలం గట్టిపడి వ్యాధిగ్రస్తమవటం (సిరోసిన్):

కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు లివర్ సిరోసిస్ వస్తుంది. దీనికి మద్యపానం, హైపటైటిస్ లు ప్రధాన కారణాలు. ఈ వ్యాధిలో కాలేయం ముడుచుకుపోయి గట్టి నారవంటి పీచు పదార్థంతో నిండిపోతుంది. దీని పర్యవసానంగా కాలేయంలోని సిరలు నిండుకుపోయి ఉబ్బుతాయి. ఇదే ఒత్తిడి ఇతర సిరలతో పాటు గొంతులోని సిరలకు కూడా ప్రసరిస్తుంది; దీనితో గొంతులోని సిరలు ఉబ్బిపోయి నిండిపోవడమే కాకుండా మెలితిరిగి తేలిగ్గా చిట్లేలాగా తయారవుతాయి. గొంతులోని రక్తనాళాలు చిట్లి పగిలితే అప్పుడు తీవ్రస్థాయిలో రక్తస్రావమై భళ్లున రక్తం వాంతవుతుంది. ఇతి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన స్థితి. ఏ మాత్రం తాత్సారం చేయకూడదు. చేస్తే ప్రాణ ప్రమాదం.

ఔషధాలు: చింతామణి చతుర్ముఖ రసం, చింతామణి రసం, అవిపత్తికర చూర్ణం, భృంగరాజాసవం, చంద్రప్రభావటి, ధాత్రీలోహం, ద్రాక్షాదిరసాయనం, గుడూచి సత్వం, జంబీరాది పానకం, పంచతిక్త క్వాథ చూర్ణం, పిప్పల్యాది లోహం, పునర్నవాది మండూరం, శిలాజిత్వాది లోహం, సప్తామృత లోహం, తాప్యాది లోహం.

5. క్యాన్సర్:

క్యాన్సర్ వల్ల ఆమాశయంలో రక్తస్రావమవ్వచ్చు. క్యాన్సర్ వల్ల రక్తనాళాలు చిద్రమై పగులుతాయి. దీంతో రక్తం విపరీతంగా స్రవించి వాంతి రూపంలో బయటకు వెళ్లి పోతుంది. ఈ లక్షణాన్ని ప్రదర్శించే క్యాన్సర్ లో హఠాత్తుగా బరువు తగ్గటం, అజీర్ణం, ఆకలి తగ్గిపోవటం వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. ఇది కూడా అత్యవసరంగా చికిత్స చేయాల్సిన స్థితి.

6. స్వతః సిద్ధంగా రక్తస్రావం అవ్వడం (ఈజీ బ్లీడింగ్ సిండ్రోమ్):

ఎవరికైనా శరీరంలో రక్తస్రావమై చర్మం కమిలే నైజం ఉన్నప్పుడు ఆమాశయాంతర్గతంగా కూడా రక్తస్రావమయ్యే అవకాశం ఉందని గ్రహించాలి. ఒకోసారి యాస్ప్రిన్ సంబంధమైన ఔషధాలను వాడే వారిలో కూడా ఈ లక్షణం కనిపిస్తుంటుంది. వీటన్నిటికి కారణానుగుణమైన చికిత్సలు చేయాల్సి ఉంటుంది. పోతే, ఈ కారణాలేవీ లేకుండా కూడా కొంతమందిలో ఆకారణంగా రక్తస్రావమవుతుంది. దీనిని వైద్య శాస్త్రంలో 'ఈజీ బ్లీడింగ్ సిండ్రోమ్' అంటారు. దీని వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇది ప్రమాద రహితమైన స్థితి. దీనిలో సాధారణారోగ్యాన్ని కాపాడుకుంటే సరిపోతుంది.