చిగుళ్ల నుంచి రక్తస్రావం
1. పళ్లు తోముకుంటున్నప్పుడు చిగుళ్లనుంచి రక్తస్రావమవుతుందా?
దంతధావనాతియోగం
2. మీ చిగుళ్లు వాచిపోయి ముట్టుకుంటే చాలు రక్తాన్ని స్రవిస్తుంటాయా?
చిగుళ్ళవాపు (జింజివైటిస్)
3. మీకు కట్టుడు పళ్లు ఉన్నాయా? తరచుగా నోటి లోపల పుండ్లు తయారవుతుంటాయా?
కట్టుడు పళ్లు వల్ల నోటిపూత
4. దంతాలు పుచ్చిపోయి పాడైపోవటం, చిగుళ్ల లోపల చీముగడ్డలు (యాబ్సిస్) తయారవ్వటం వంటివి ఉన్నాయా?
నోటిలోపల పుండ్లు /చిగుళ్లమీద గడ్డలు
5. మీకు మధుమేహం ఉందా?
మధుమేహవ్యాధి దుష్ఫలితాలు (డయాబెటిక్ కాంప్లికేషన్స్)
మీరు మీ చిగుళ్లను ఎప్పుడైనా గమనించారా? ఎర్రగా, మాంసపు ముద్దలాగా ఉంటాయి. చిగుళ్లకు సమృద్ధిగా రక్తసరఫరా జరగటం వల్ల ఇలా కనిపిస్తాయి. అయినప్పటికీ వాటికి ఇన్ఫెక్షన్, వాపు తదితరాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. చిగుళ్లలో హెచ్చు సంఖ్యలో నరాలు వుంటాయి కాబట్టి ఏ కొంచెం అసౌకర్యంగా ఉన్నా, ఏ మాత్రం బాధ ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది. ఇది ఒక రకంగా అదృష్టమనీ, మరో రకంగా దురదృష్టమనీ చెప్పాలి. అదృష్టమెందుకంటే, బాధవల్లగాని, నొప్పుల కారణంగాగాని వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. దురదృష్టమెందుకంటే ఏ కొద్దిపాటి తేడా సంభవించినప్పటికి తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుంది.
ఆయుర్వేదంలో చిగుళ్లకు సంబంధించిన వ్యాధులను 'దంతమూలగత వ్యాధులు' అంటారు. వీటిని లక్షణాల ఆధారంగానూ, దోషాల ఆధారంగానూ వివిధ రకాలుగా విభజించి వర్ణించారు. అనేక దంతమూలగత వ్యాధుల్లో రక్తస్రావం ఒక ప్రధానమైన లక్షణంగా కనిపిస్తుంది. వివరాల్లోకి వెళదాం.
1. దంత ధావనాతియోగం:
పళ్ళు తోముకునేటప్పుడు చిగుళ్ళనుంచి రక్తం కారటమనేది మనలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటుంది. పళ్లు తోముకునే బ్రషింగ్ ప్రక్రియను మరీ ఎక్కువ సేపు, మరీ బలంగా చేస్తే ఈ సమస్య తలెత్తుతుంది. బ్రషింగ్ వల్ల ఆచ్ఛాదన లేని చిగుళ్లు రేగుతాయి. ఫలితంగా రక్తస్రావమవుతుంది. దంతధావన సమయంలో మాత్రమే రక్తస్రావమవుతుంటే సున్నితంగాను, త్వరితంగానూ బ్రషింగ్ ప్రక్రియను ముగించాలి. అలాగే, దంతాల మధ్యభాగంలో ఇరుకున్న ఆహారపు ముక్కలను సున్నితంగా, దారం సహాయంతో తొలగించాలి తప్పితే పిన్నీసులను, చెక్కపేళ్లను ఉపయోగించకూడదు. సక్రమంగా దంతాలను శుభ్ర పరుచుకోనందు వలన కూడా చిగుళ్ల నుంచి రక్తం కారే అవకాశం ఉంది. దంతాలను అశ్రద్ధ చేస్తే క్రమంగా పళ్ల మీద 'గార; ఏర్పడి, గట్టిగా తయారై సున్నితమైన చిగుళ్లకు హాని కలిగించి తద్వారా రక్తస్రావానికి కారణమవుతుంది. ఏ రకమైన ప్రేరేపణలూ లేకుండా దానంతట అదే రక్తస్రావమవుతున్నప్పుడు (అంతర్గత కారణాలను ఉంచితే) ముందుగా చిగుళ్లకు పట్టిన గార గురించే ఆలోచించాలి. ఆయుర్వేదంలో ఈ రకమైన రక్తస్రావాలను "శీతాదం' అంటారు.
సూచనలు: దీనికి ప్రతిసారణం, గండూషం అనే రెండు చికిత్సాప్రక్రియలు ఉపయోగపడతాయి. ప్రతిసారణం అంటే పై పూతగా ఔషధాన్ని ప్రయోగించడం, గండూషం అంటే ఔషధాన్ని పుక్కిట పట్టడం, ప్రతిసారణానికి త్రిఫలాలు, శొంఠి చూర్ణాలనూ, గండూషానికి ఇరిమేదాది తైలాన్నీ ఉపయోగించాలి.
2. చిగుళ్ల వాపు (జింజివైటిస్):
చిగుళ్ల ఇన్ఫెక్షన్ దీర్ఘకాలం నుంచి ఉంటున్నట్లయితే చిగుళ్లతో వాటికి ఆధారాన్నిచ్చే దవడ ఎముకలు సైతందెబ్బతినే అవకాశం ఉంది. దీనిని 'జింజివైటిస్' అంటారు. జింజివైటిస్ లక్షణాలు ఆయుర్వేదంలో వివరించిన 'సౌషిరం' అనే దంతమూలగత వ్యాధి లక్షణాలతో సరిపోతాయి. దీనిని అశ్రద్ధ చేస్తే కొంతకాలానికి దంతాలు ఊడిపోయే ప్రమాదం ఉంది.
గృహచికిత్సలు: 1.లొద్దుగ, తుంగముస్తలు, జఠామాంసి, త్రిఫలాలు, రాసాంజనం (అతిమధురం నుంచి తయారు చేస్తారు) అనే ఔషధాల చూర్ణాన్ని తేనెతో కలిపి ప్రతిసారణంగా, అంటే పై పూతగా వాడాలి. 2. పిప్పళ్ళు, సైంధవ లవణం, జీలకర్ర, పటిక వీటిని సమానభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి వస్త్ర గాలితం పట్టి చిగుళ్ళను, దంతాలను శుభ్రపరచుకోవాలి. 3. జీలకర్ర, సైంధవ లవణం, కరకపలుపు, చిల్లగింజలు, బూరుగుముళ్ళు వీటిని సమతూకంగా తీసుకుని పొడిచేసి ప్రతినిత్యం పండ్ల పొడిగా వాడుకోవాలి. 4. పొగడపట్ట చూర్ణం, కరక్కాయ పెచ్చుల చూర్ణం వీటి రెండిటిని సమభాగాలుగా తీసుకొని పొడిచేసి చిగుళ్ళపైన రుద్ది నీళ్ళతో పుక్కిట పట్టాలి.
ఔషధాలు: త్రిఫలా గుగ్గులు, ఖదిరావటి.
బాహ్యప్రయోగం - ఇరిమేదాదితైలం.
3. కట్టుడు పళ్ళు వల్ల నోటిపూత:
కట్టుడు పళ్ళు సక్రమంగా అమరకపోవడం, నోటిపూత, హెర్పిస్ పుండ్లు తరచుగా ఏర్పడుతుండటం వంటి కారణాల వలన చిగుళ్లు ఒరుసుకుపోయి రక్తస్రావమవుతుంది. మీ చిగుళ్ల సమస్య కట్టుడుపళ్ల వల్ల ఏవచ్చినదేనని తేలితే వాటిని సరి చేయించుకోవాలి. నోటి పూత, హెర్పిస్ వల్ల ఏర్పడే కోల్డ్ సోర్స్ వంటి వాటికి జాత్యాది తైలం అద్భుతంగా పని చేస్తుంది. దీనిని పై పూతగా వాడాల్సి ఉంటుంది.
గృహచికిత్సలు: 1. త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ) పెచ్చులను మాత్రం తీసుకుని చూర్ణం చేసి, కషాయం కాచి, తేనె చేర్చి పుక్కిలించి ఉమ్మాలి. 2. నల్లజీలకర్ర, చెంగల్వకోష్ఠు, కొడిశపాలగింజలు వీటిని సమాన భాగాలుగా తీసుకొని నోటిలో వుంచుకొని వక్కపొడిలా నములుతూ ఉండాలి. 3. అతిమధురం (యష్టిమధుకం) చూర్ణం (అరచెంచా), ఉసిరి వరుగుచూర్ణం (అరచెంచా) రెండూ కలిపి తేనెతో రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 4. మాచికాయను అరగదీసి గంధాన్ని నాలుకకు రాసుకుని లాలాజలాన్ని ఉమ్మివేయాలి. 5. మానుపుసుపును కాషాయం కాచి గట్టిపడేంతవరకు సన్నని సెగమీద ఉంచాలి. దీనిని రసాంజనం అంటారు. ఈ రసాంజనాన్ని తేనెతో కలిపి నోటికి పూసుకోవాలి. 6. అడ్డసరపు ఆకులను దంచగా వచ్చిన రసానికి (రెండు చెంచాలు) కావిరాయి (అరచెంచా) కలిపి తగినంత తేనె చేర్చి మాత్రలుగా చుట్టి చప్పరించాలి.
ఔషధాలు: ధాత్రీలోహం, కాంచనార గుగ్గులు, ఖదిరాదివటి.
బాహ్యప్రయోగం - అరిమేదాది తైలం.
4. నోటిలోపల పుండ్లు / చిగుళ్ల మీద గడ్డలు:
దంతాలు పాడైపోయి పుచ్చిపోవటం, చిగుళ్లలోపల చీముగడ్డలు తయారవ్వటం వంటి కారణాల వలన చిగుళ్ల నుంచి రక్తస్రావమవుతుంది. ఈ తరహా సమస్యలను ఆయుర్వేదం దంతనాడి, దంతవిద్రది, దంతవేష్ఠనం, దంత పుప్పుటకం అనే పేర్లతో వివరించింది. సూచనలు: ఈ సమస్యలకు సామాన్య చికిత్సగా అతిమధురం, క్షీరీ వృక్షాల బెరడ్లతో కాషాయం తయారు చేసుకుని పుక్కిట పట్టాలి.
ఔషధాలు: ఖదిరాదివటి, ఆరోగ్యవర్ధినీ వటి, గంధక రసాయనం.
బాహ్యప్రయోగం- సహచరాది తైలం, (పుక్కిటపట్టాలి), ఇరిమేదాది తైలం (పుక్కిటపట్టాలి).
5. మధుమేహవ్యాధి దుష్ఫలితాలు (డయాబెటిక్ కాంప్లికేషన్స్):
మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఇతరులతో పోలిస్తే - ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. మధుమేహం ఉన్నవారికి వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే, పెద్దవారిలో ఎవరికైనా సరే చిగుళ్లనుంచి రక్తం కారడంతో పాటు వాపులు, నొప్పి ఉన్నట్లయితే ముందుగా మధుమేహం గురించి ఆలోచించాలి, మధుమేహం ఉన్నదని పరీక్షల్లో తేలితే నోటి స్వాస్థ్యాన్ని మరింత శ్రద్ధగా పాటిస్తూ షుగర్ ణి నియంత్రణలో ఉంచుకోవటం అవసరం. దీనికి ఇతర సాధారణ జాగ్రత్తలతో పాటు మధుమేహహర ఔషధాలను వాడాల్సివుంటుంది.
గృహచికిత్సలు: 1. ఉసిరికాయరసం (అరకప్పు), పచ్చి పసుపు కొమ్ముల రసం (అరకప్పు) కలిపి రోజూ మూడుపూటలా తాగాలి. తాజావి దొరకని కాలంలో ఎండినవి తెచ్చి పొడిచేసి అరచెంచాడు మొతాడుగా మూడుపూటలా నీళ్ళతో తీసుకోవాలి. 2. నేరేడు గింజల చూర్ణాన్ని (అరచెంచాడు) రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 3. పొడపత్రి ఆకు చూర్ణాన్ని చెంచాడు వంతున రోజూ మూడు పూటలా నీళ్లతో తీసుకోవాలి. 4. శుద్ధిచేసిన శిలాజిత్తు (చిటికెడు), అశ్వగంధ చూర్ణం (అరచెంచాడు) రెండూ కలిపి ఒక మోతాదుగా రోజుకు మూడు సార్లు చొప్పున తీసుకోవాలి. 5. స్వర్ణమాక్షిక భస్మం (వేరు శెనగ గింజంత) అశ్వగంధ చూర్ణం (అరచెంచాడు) రెండు కలిపి నీళ్ళతో రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 6. నేరేడు గింజలు, పొడపత్రి ఆకు, పసుపు, ఉసిరి కాయ పెచ్చులు, నేలవేము, మెంతులు వీటిని సమతూకంలో తీసుకొని పొడిచేసి అన్నిటినీ ఒకటిగా కలపాలి. ఈ పొడిని పూటకు చెంచాడు చొప్పున రోజుకు మూడుసార్లు ఆహారానికి ముందు తీసుకోవాలి.
ఔషధాలు: తారకేశ్వరరసం, వసంతకుసుమాకర రసం, శిలాజిత్వాదివటి, మామేజ్జకఘనవటి, చంద్రప్రభావటి, త్రీవంగభస్మం, జాంబవాసవం.
6. పోషకాహార లోపం:
వివిధ పనుల మీద ఇంటికి దూరంగా నెలల తరబడి ఉండే వారిలో సాధారణంగా సి-విటమిన్ల లోపాలు సంభవించి 'స్కర్వి' అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనిలో చిగుళ్ల నుంచి ఎక్కువ మోతాదులో రక్తస్రావమవుతుంది.
సూచనలు: ఈ సమస్య తగ్గాలంటే తాజా కాయగూరలూ, ఆకుకూరలూ, పాలు, ఉసిరి, జామ, ద్రాక్ష తదితర పండ్లూ ఎక్కువగా తీసుకోవాలి. ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటే చంద్రకళారస అనే మందును నిర్ణీత మోతాదులో కొంతకాలం పాటు వాడితే సరిపోతుంది.