నారా చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం

మన దేశం అన్ని రంగాలలోను బాగుపడాలంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగాలకు ఎంతో సహాయం అందిస్తోంది, ఆధునిక వైద్య విధానాలతో పాటు ఆయుర్వేదం, ప్రకృతి, హోమియోపతి, యునాని వంటి దేశీయ వైద్యాన్ని ఆని విధాలా ప్రోత్సహిస్తోంది. అన్ని వర్గాలకు చెందినా ప్రజలు ప్రకృతి జీవన విధానం, చికిత్సా విధానం పట్ల సరైన అవగాహనతో వాటిని పాటించాల్సి వుంది.

మన సమాజంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ ఆచార వ్యవహార పద్ధతులను మనం మరిచిపోయాం అదే'ప్రకృతి జీవన విధానం'. మనం నిత్యం తీసుకునే ఆహారం, నీరు, గాలి ఇవే మన ఆరోగ్యానికి మూల సూత్రాలు, పరిసర వాతావరణాన్ని పరిరక్షిస్తూ పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రకృతి జీవన విధానాలతో ఆచరిస్తూ తీసుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి, మన ఇంట్లోనే మనం అనునిత్యం ఆరోగ్యకరమైన, ఆచరణ యోగ్యమైన వైద్య విధానాలను పాటిస్తే పరిపూర్ణ ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను పొందవచ్చు. అట్టి ప్రకృతి జీవన విధానాన్ని ఇటీవలి కాలంలో ప్రజా బాహుళ్యంలో విస్తృత ప్రచారం చేస్తూ, ఎంతో మందికి ఆరోగ్య భాగ్యాన్ని అందిస్తున్న డా|| మంతెన సత్యనారాయణ రాజు నిస్వార్థ సేవలు ఎంతైనా ప్రశంసనీయం. కొత్త శతాబ్దిలో ప్రకృతి జీవన విధానం వంటి ఆరోగ్య సూత్రాల ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.

హెచ్.జె.దొర, ఐ.పి.ఎస్ గారి అభిప్రాయం

శ్రీ సత్యనారాయణ రాజు గారు నాకు సంవత్సర కాలం నుంచీ పరిచితులు . వారు అకుంఠిత దీక్షతో మన ప్రాచీన సాంప్రదాయమైన ప్రకృతి వైద్యాన్ని మరల ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి చాలా కృషి సల్పుతున్నారు. ఇప్పటి మన వైద్య ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మన జీవితవిధానంతో ముదిపడ్డాయని భావిస్తారు. ప్రస్తుత జీవన విధానంలో శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, తరువాత భోజన సదుపాయాలు ఎక్కువ కలిగి ఉండడం, నియమం పాటించకుండా అన్ని వేళలా భోజనం చేయడం, ఈ కారణాల వలన అనారోగ్యం చేకూరుతుంది, ప్రస్తుతం వైద్య పద్దతిలో రోగానికి మందు ఇస్తున్నారు, కాని నియమావళితో, క్రమశిక్షణతో జీవితాన్ని గడపలేక పోతున్నాము. శ్రీ రాజుగారు ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్లి నియమంతో భోజనం చేస్తే మనిషికి జబ్బులు రావటానికి అవకాశం లేదు అని తను నమ్మిన దాన్ని మిగిలిన వాళ్లకు నమ్మకం కలుగజేస్తారు, ఈ విధానంలో ఉపవాసం ముఖ్యమైన భాగం. ఉపవాసం వలన మన శరీరంలో ఏర్పడిన చెడ్డ పదార్ధాలు బయటకు పోయి మళ్ళీ శరీరంలో స్వచ్చమైన రక్తం ప్రవహిస్తుంది. దీని వలన అనేక జబ్బులు నయం అవుతాయి. మనిషి ఆరోగ్యంగా జీవించటానికి అవకాశం ఉంటుంది. శ్రీ రాజు గారు ఎన్నో విషయాలపై రీసెర్చి జరిపి తన శరీరం మీదే వాటి పరిశోధన చేశారు. ఆయన ఒక కర్మజీవి. అందరి శ్రేయస్సును మనసులో పెట్టుకుని ప్రకృతి వైద్యాన్ని అందరి దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అందించి, ఈ మంచి పనికి ఇంకా దోహదం చేయాలని నేను మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

                                                                                                           హెచ్.జె.దొర, ఐ.పి. ఎస్

 

వసంత నాగేశ్వరరావు (మాజీ హోంమంత్రి) గారి అభిప్రాయం

ప్రకృతి పరిజనులకు ణా హృదయ పూర్వక నమస్కారములు. నేను 1998 సంవత్సరం, ఆగష్టు 9 వ తేదీ నుండి డా|| మంతెన సత్యనారాయణరాజు గారి వద్ద ప్రకృతి వైద్యం చేస్తూ ణా రుగ్మతలు తొలగించుకొని ఈ మాటలు వ్రాయడానికి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాను, అనేక సంవత్సరమముల నుండి కాళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతూ నా ప్రజా సంబంధ కార్యక్రమములలో పాల్గొనలేక మానసిక వ్యథతో ఉండే వాడిని. సుమారు 1993 నుండి ఈ బాధలతో ణా కార్యక్రమములలో పాల్గోనలేకపోయేవాడిని.. 1972 లోనే అతి చిన్న వయస్సులో అనగా ఇంచుమించు 25 సంవత్సరాల వయస్సులో శాసనసభకు ఎన్నికైన నేను 1994తీవ్ర అనారోగ్యం వలన ఎన్నికలలో పాల్గొనలేకపోయాను.

నా హితై షులు, నా బావమరిది శ్రీ పి.వి.వి.ప్రసాదరావుగారు మరియు శ్రీ కొల్లి రామమోహనరావుగారు ప్రభృతులు రోజూ నా బాధలు చూసి, డాక్టర్ నారాయణరాజు గారిని సంప్రదించమని మరియు డాక్టరు గారి వద్దకు తీసుకొని వెళ్ళుటకు నన్ను చాలా ఒత్తిడి చేసినారు. మా బావమరిది గార్కి నా మీద ఉన్న ప్రేమను కాదనలేక వారితో ఇలా అన్నాను. అమెరికాలోని ఉన్నతమైన డాక్టర్లను, లండన్ లోని డాక్టర్లను, జర్మనీలోని డాక్టర్లను కలిసి వారితో చర్చించాను. భారతదేశంలోని అతి ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్స్ లోను, ఢిల్లీలోనిఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్ లోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ, కోయంబత్తూరులోను మరియు రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన వైద్య ప్రముఖులందరినీ సంప్రదించాను. వారు చెప్పినట్లుగా అల్లోపతి వైద్య విధానం అవలంభించాను, అయినప్పటికీ నీకు తెలుసు కదా "ఏ మాత్రం ప్రయోజనం చేకూరలేదు" అనడంతో వారు సత్యనారాయణ రాజు గారి ప్రకృతి విధానం గూర్చి వివరించి చెప్పారు. దానికి కూడా నేను గతంలో ప్రకృతి చేసిన ఉదాహరణలు మరియు వాటి వలన ఫలితం పొందలేని విషయం చెప్పినాను. అయిన వారు వినలేదు. నేను అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి మొదలగు అన్ని వైద్య విధానాల్లోను చికిత్సలు చేయించుకున్నాను.ఫలితం రాలేదు, కాని నా రుగ్మతలకు పలు రకాల పేర్లు పెట్టారు, నలుగురు గ్రుడ్డి వాళ్ళు ఏనుగును తాకి చూసి నాలుగు రకాలుగా వర్ణించినట్లు కొందరు అర్థరైటిస్ అంటే, మరి కొందరు థైరాయిడ్ లోపం అనీ, కొంత మంది రుమాటిజం అనీ, ఇంకొందరు యూరిక్ ఏసిడ్ ఎక్కువగా ఉండడం అనీ, మరి కొందరు ప్రముఖులు గౌట్ వ్యాధి అన్ని రకరకాల పేర్లు నిర్ణయించారు. అందమయిన పేర్లయితే పెట్టారు గానీ ఆరోగ్యం మాత్రం ఎవరూ అందించలేకపోయారు.

ఎట్టకేలకు 1.8.98వ తేదీన డా|| సత్యనారాయణ రాజుగారిని కలవటం జరిగింది. వైద్యాన్ని వెంటనే ప్రారంభించడానికి వారు అంగీకరించలేదు. మొదట వారు సూచించిన ఉప్పు, కారం, నూనె, చింతపండు లేని సుఖజీవన ఆహారం రోజు భుజించిన తరువాత మాత్రమే వైద్యం ప్రారంభిద్దాం అని చెప్పినారు. ఆ విధంగా ఆహార నియమం పాటించిన తరువాత ఆగష్టు 9వ తేదీ నుండి ఉపవాసం చేయడం మొదలు పెట్టాను. తరువాత ప్రతి రోజు డాక్టరు గారు ఉదయం, సాయంత్రం టెలిఫోన్ ద్వారా నా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వారు, ఉపవాసం మొదలు పెట్టిన మొదటి 24 గంటలు మాత్రమే నాకు ఆకలి అనిపించింది తరువాత రోజు నుండి ఆకలి అనేది లేదు. రోజూ 8 సార్లు, తేనె, నిమ్మకాయ రసంతో కలిపినా నీళ్ళు, 8 సార్లు మంచినీళ్ళు (5,6 లీటర్లు) త్రాగి రోజూ ఉదయం ఎనిమా చేసుకునే వాడిని నీరసం రాలేదు సరికదా నూతన ఉత్సాహం కలిగింది, కారణం ఏమిటంటే నా ఉపవాసం మొదలు పెట్టిన మొదటి 20 రోజులలోనే నా ఇంటిమెట్లు అతి సునాయాసంగా దిగగలిగాను. అలుపు లేకుండా నేలపైన కూర్చోగలుగుతున్నాను. కుంటకుండా నడవగలుగుతున్నాను. సుమారు 58 రోజుల ఉపవాసం వరకు ప్రతి రోజూ మిత్రులను కలుస్తూ ఉండే వాడిని. వారిలో కొందరు ప్రముఖులు నా శరీరాన్ని నాశనం చేసుకుంటున్నానని, మరి కొందరు 'వైద్యశాస్త్రానికి విరుద్ధంగా' డా|| సత్యనారాయణ రాజుగారు నా శరీరాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించేవారు. అయితే నేను గత 5,6 సంవత్సరముల నుండి పడుతున్న బాధల నుండి విముక్తి పొందాలని, ఈ వైద్య విధానం వలెనే నాకు పూర్తిగా ఆరోగ్యం చేకూరుతుందని వారికి తెలిపి, నేను మనస్పూర్తిగా విశ్వసించి ఉపవాసాలు కొనసాగించాను.

ఉపవాస కాలంలో నా శరీరంలో జరిగిన మార్పులు గమనించాను. నాకు 58 రోజుల వరకు బాగానే జరిగింది. ఆ పై వికారాలు మొదలయ్యాయి. ఎనిమా చేసుకుంటే భరించలేని చెడు వాసనలతో మలము వచ్చేది. వాసన భరించలేక పోయే వాడిని. తరువాత నోటిలోని లాలాజలం పరం ఆసహ్యంగా ఉండి మింగలేక వికారంతో వాంతులు అవుతుండేది. వాంతులు చేసుకున్నప్పుడు పసరు వస్తూ ఉండేది. పోసే మూత్రం కూడా ఎక్కువ వాసనగా ఉండేది, అందరిలాగానే నేను భయపడ్డాను కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ ఉపవాసాలను విరమించాలని సలహా ఇచ్చారు, కాని ఈ వాంతుల వలన, మల మూత్రాల వాసనల వలన శరీరములోని కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు మరియు కీళ్ళలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలు తొలగిపోయి అన్ని అవయవాలు బాగు పడతాయని డాక్టరు గారి అనుభవ పూర్వకమైన హక్కుల ద్వారా తెలుసుకున్నాను, కనుక వాసనలు, వాంతులు భరించాను. వ్యర్థ పదార్ధాలన్నీ విసర్జించుకొన్నాను, శరీరాన్ని దాని సహజమైన స్థితిలోనికి తెచ్చుకోగలిగాను. అయినా నాలుక ఎర్రబడేవరకు, ఎనిమా చేసుకుంటే ఏమీ మలం రాని రోజు వరకు, ఆకలి తీవ్రత వచ్చే వరకు ఉపవాసం చెయ్యాలని డాక్టరు గారు చెప్పినారు, రోగ విముక్తుడయినప్పటికి వారు సూచించినట్లుగా ఉపవాసం కొనసాగించాను.

ఇన్నిరోజుల ఉపవాసం మంచిది కాదని అల్లోపతి వైద్యనిపుణులు ఆందోళన చెందుతూ ఉండేవారు, డాక్టర్లయిన నా కూతురు, అల్లుడూ నా శరీరం దెబ్బ తింటుందని ఆందోళన చెండుతుండేవారు. నా శరీరం యొక్క స్థితి నాకు తెలుసు కాబట్టి వారి ఆందోళనకు అర్థం లేదని అనిపించేది కాని వారి తృప్తి కొరకు ఉపవాసంలో 83 వ రోజున అంటే 30.10.98న రక్తపరీక్ష చేయించాను. (పట్టిక చూడండి) నా ఆరోగ్యపరిస్థితి చాలా మెరుగైనది. కాని ఉపవాసం మానలేదు కారణం నా నాలుక ఎర్రబడలేదు. ఆకలి కరకరామని పుట్టలేదు, ఎనిమా చేసుకొంటే ఇంకా మలం వస్తున్నది, తిరిగి మరల 104 వ రోజు, 20.11.98న అంటే నా ఉపవాసం ముగించే రోజున నా ఆరోగ్యం యొక్క తాజా పరిస్థితి తెలిసికొనుటకు మరలా పరీక్ష చేయించాను (పట్టిక చూడండి). అందరికి ఆశ్చర్యం కనిపించేలా ఉపవాసం ప్రారంభించిన రోజున రక్తంలో హిమోగ్లోబిన్ ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే విధంగా ఉంది. లివర్, కిడ్నీల పని తీరు, యూరిక్ ఏసిడ్, కొలెస్ట్రాల్ స్థితి చాలా సంతృప్తికరంగా ఉన్నది. చివరకు ఏళ్ళ నుంచి ఉన్న థైరాయిడ్ ప్రాబ్లం కూడా అద్భుతంగా నివారింపబడింది. 104 వ రోజు నుండి పళ్ళ రసాలు త్రాగడం ప్రారంభించాను, తరువాత ఇక ఆకలికి ఆగలేక పచ్చకూరల ఆహారం తీసుకోవడం ప్రారంభించాను. 1985లో డాక్టర్ల సలహా మేరకు బలవంతంగా మానివేసిన ఆహారం ఇప్పుడు మళ్ళీ 20 రోజుల నుండి తీసుకొంటున్నాను. నాకు కొబ్బరి, అరటిపండు, ఖర్జూరం, వేరు శెనగవిత్తులు మొదలగునవి బహు ఇష్టం, పద మూడు సంవత్సరాలు వాటిని తినడానికి నోచుకోలేదు, ఇప్పుడు రోజూ ఒక కొబ్బరికాయ, నాలుగు చక్కెర కళీలు, ఖర్జూరాలు, బాదం, పిస్తా, వేరు శనగవిత్తులు, వివిధ రకాల పండ్లు మరియు ఉదికించని కూరలు, పెరుగు తింటున్నాను, చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాను, ఏ సహజాహారమయితే మిగతా డాక్టర్లు తినవద్దని, కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని సహజంగా శలవిస్తారో ఆ ఆహారాన్నే నేను సంతృప్తిగా తిన్నందుకు నాలో కూడా కొలెస్ట్రాల్ పెరిగిందేమోనని తిరిగి 125 వ రోజు 11.12.98న విశాఖపట్నం రక్తపరీక్ష చేయించాను. ఎంతో సంతృప్తికరంగా ఉంది. ఉపవాసాలు చేయక ముందు, చేస్తుండగా, పూర్తి చేసిన తరువాత ఖచ్చితమైన ప్రమాణాలతో చేయించిన లాబ్ టెస్ట్ల ఫలితాలను క్రింది పట్టికలో గమనించండి.

ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని, గతంలో నన్ను చూసిన వారెవ్వరూ నమ్మలేని విషయాన్ని ప్రస్తావించదలిచాను. ఇది చాలా ముఖ్య విషయము, బంజారాహిల్స్ లోని నా ఇంటికి అతి సమీపంలో నున్న శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కులో గతంలో నడవడానికి 1గంట 30 నిముషాలు పట్టేది, నడవలేక బాధపడుతూ నడిచేవాడిని. ఇటీవలనే ఇంత కాలం తర్వాత మరలా పార్కుకు వెళ్ళి 30 నిముషాలలో నడకకాకుండా, ఎక్కడ ఆగకుండా, విశ్రాంతి ఇవ్వకుండా జాగింగు చేసినాను. చూసిన వారికి మహదాశ్చర్యం. నడకలేక కుంటినడక నడిచే నేను జాగింగు చేయడం, ఎంత ఆనందం, ఎంత అదృష్టం. అంతేకాక తెల్లారుజామున రోజూ శీర్షాసనంతో సహా అన్ని రకాల ఆసనాలు వేస్తున్నాను. ఇన్నాళ్ళు వద్దని నిషేధించిన ప్రకృతి ఆహారం, ఇష్టమైన పండ్లు కడుపారా తింటున్నాను.

ఉప్పు, కారం, నూనె, చింతపండు, పంచదార లేకుండా ప్రత్యామ్నాయ పదార్ధాలతో చేసిన రుచికరమైన ఆహారం తింటూ భగవంతుడు ప్రసాదించిన నూరు సంవత్సరాల జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా గడపవచ్చని తెలుసుకున్నాను, దేవుడు సృష్టించిన జీవ కోటి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ వాటి ధర్మాలు అవి నెరవేరుస్తున్నవి, ఆరోగ్యంగా జీవిస్తున్నవి, కాల క్రమేణా నాగరికత పెరిగిన తరువాత మానవుడు మాత్రం ధర్మాలు మరచి అసహజాహారం స్వీకరిస్తూ, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ శరీరం నాశనం చేసుకొని రోగగ్రస్థుడవుతున్నాడు మానవుడికిచ్చిన స్వేఛ్చ, స్వయం నిర్ధయాధికారం దుర్వినియోగం చేసుకొని తాను బాధపడుతూ, సమాజాన్ని బాధపెడుతున్నాడు. ఇకనైనా ప్రకృతి ధర్మాలను పాటిస్తూ, ప్రకృతి ఆహారం స్వీకరిస్తూ, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ, ప్రకృతిమాతను పూజిస్తూ రోగాలన్ని నిర్ములించుకొని శరీర శుద్ధి, ఆరోగ్య సిద్ధి పొంది దైవం ప్రసాదించిన శత వసంతాలు శాంతిగా, సౌక్యంగా గడుపుదాం. ఆ అదృష్టాన్ని రాజుగారు అందరికీ ఆనందంతో అందిస్తున్నారు, అలసించక అందుకుందాం.

మరి ప్రకృతి వైద్యంలోనే (ఈ డాక్టరు గారి విధానంలోనే) అన్ని రోగాలకి విముక్తి ఉన్నది అంటున్నారు, ఉంటే ఇంతకు ముందు కూడా దేశంలో చాలా వైద్యశాలలు ఉన్నాయి కదా మరి ప్రకృతి వైద్యం ఎందుకు ప్రాచుర్యం పొందలేదని మీరు ప్రశ్నించవచ్చు. అయితే వినండి, అసలు మొట్టమొదట ఇది వైద్యం కాదు, జీవన విధానం అని దీనిని కొనసాగించి శాశ్వతంగా రోగాలు రాకుండా, వాటికి దూరంగా ఉండే విధంగా మనకు మానసికంగా సంసిద్ధులను చేయడానికి డాక్టరు గారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇది యుగ యుగాలుగా మానవ ధర్మమని చివరకు మన జాతి పిత గాంధీజీ జీవన విధానం ఇదేనని, గాంధీజీ ఈ విధానం ద్వారానే తాను ఆరోగ్యంగా ఉండి, తన అనుచరగణాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచి, స్వాతంత్ర్య సంగ్రామానికి సర్వసన్నద్దులుగా చేయగలిగారని చెబుతూ అదే విధానాన్ని డా|| సత్యనారాయణరాజు గారు అవలంభిస్తున్నారు. ఈ విధానం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందుటయే కాక ఆనందమయమైన జీవితాన్ని గడుపుతూ, ఆత్మ సంతృప్తి నిరంతరం పొందుతూ ఆధ్యాత్మిక రంగంలో కూడా అభ్యున్నతిని సాధించగలము. ప్రకృతి వైద్యం మన ఇష్టం వచ్చినట్లు, ఇష్టమొచ్చిన వాళ్ళు చేయడానికి సాధ్యమయిన వైద్య విధానం కూడా కాదు. ఈ ప్రకృతి పురుషుడు సత్యనారాయణ రాజు గారి వల్లే ధృడమయినటువంటి విశ్వాసంతో, ఖచ్చితమయినటు వంటి నియమాలతో రోగులకు ఉపదేశించి ముందుగా వాళ్లని పరీక్షించి, మానసికంగా సంసిద్దులను చేసిన తరువాతనే ఈ వైద్యాన్ని ప్రారంభించాలి. ఈ ప్రకృతి విధానం సరిగా చేస్తే ఏ వయసు వారైనా, ఎటువంటి రోగాలయినా తగ్గించుకోవచ్చు అనడానికి 53 సంవత్సరాల నేను పూర్తిగా రోగ విముక్తిడిని కావడమే అందరికి ఉదాహరణ. వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఇక మనకెందుకులే, మన ఖర్మ అని నిరుత్సాహంతో, నిస్ప్రహతో, బాధలతో, వ్యధలతో కాలం గడపవలసిన పని లేదు, పట్టుదలతో, దృఢ నిశ్చయంతో సత్యనారాయణ రాజు గారిని ఆశ్రయించి, విశ్వసించి ప్రకృతి విధానం అనుసరిస్తే మొదట కొంతకఠినం అనిపించినా చివరికి మధురమైన అనుభూతిని, ఆనందాన్ని పొందవచ్చును.

డా|| సత్యనారాయణ రాజు గారు మోస్తున్న ప్రకృతి కాగడా వెలుగును దశదిశలా వ్యాప్తి చెందించడానికి మనందరం ఈ విధానాన్ని మనఃస్షుద్ధిగా మనస్ఫూర్తిగా ఆచరించి 21 వ శతాబ్దంలోనికి అడుగు పెడుతున్న మానవాళికి ప్రసాదంగా రోగ రహిత సమాజాన్ని తయారు చేసి పెట్టడం కంటే మరొక సేవమనకు లేదు. అదే మన లక్ష్యం కావాలి. దీనికి కావాలసింది ధృడమైన నిర్ణయం, ఆచరణాత్మకమయిన పట్టుదల కాబట్టే "లెండి! మేల్కొనండి! ఆగమ్యము చేరువరకు ఆగకండి.”

“పరుల కోసం పాటుపడే వారి జీవించియున్నట్లు" అన్న వివేకానందుని ఆదర్శానికి అనుగుణంగా, నిజమైన కర్మయోగిగా జీవిస్తూ "వైద్యాన్ని వృత్తిగా కాక ధర్మంగా ఆచరిస్తూ" మనందరి ఆరోగ్యం కోసం, ఆనందం కోసం అహర్నిశలూ, నిస్వార్ధంగా, నిరంతరమూ, మహతరమయిన సేవ చేస్తున్న డా|| సత్యనారాయణరాజు గారి యొక్క ఉపదేశాలను మనందరం ఆచరించినప్పుడు మాత్రమే ఆయన కృషికి తగిన ఫలితాన్ని సమాజానికి మనం అందివ్వగలిగిన వాళ్ళం అవుతాము. అదే మనం ఆయనకు చూపించగలిగే కృతజ్ఞత. ఆ ఆశయసిద్ధికి అందరికి ప్రకృతి మాత ఆశీస్సులు అందచేయాలని మనసారా ఆశిస్తూ వినమ్రంగా శెలవు తీసుకుంటున్నారు.

                                                     ఓం తత్ సత్ వసంత నాగేశ్వరరావు (మాజీ హోం మంత్రి)

 

డా.బి.వి.రాజు గారి అభిప్రాయం

నా పేరు డా.బి,వి,రాజు, నా వయస్సు 80 సం||రాలు. నాకు గత కొన్ని సంవత్సరముల నుండి బి.పి. షుగరు ఉంటున్నవి, వాటికి రోజు మందులు వాదేవాడిని, ఆనారోగ్య కారణంగా నిద్ర కూడా సరిగా పట్టేది కాదు, దాని వల్ల రోజు నిద్రకు మందులు వాడవలసి వచ్చింది, వయస్సు పెరుగుతున్న కొలదీ కాళ్ళకు స్పర్శజ్ఞానం కొద్దిగా తగ్గుతూ వచ్చి చివరకు కాళ్ళకు చెప్పులున్నది లేనిది కూడా తెలిసేది కాదు, కాళ్ళు మొద్దు బారినట్లు ఉండేవి. వయస్సుతో వచ్చే వణుకు చేతులకు రావడం జరిగింది, నాకున్న బాధ్యతల కారణంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పనిలో పడితే నాకు ఏమీ ఇబ్బందులు తెలిసేవి కాదు, నాకు రోజు 10 – 12 గంటలు పని చేయడం అలవాటు, వయస్సు పెరిగిన కారణంగా ఆరోగ్యాన్ని బాగుచేసుకోకపోతే పని చేయడం కష్టమనిపించి ఆలోచనలో పడ్డాను, అనుకున్నదే తడవుగా, డా|| సత్యనారాయణరాజు గారు జూబ్లీహిల్స్ లో ప్రకృతి వైద్యం చేయించుచున్నారని తెలిసి వారిని సంప్రదించాను.

ప్రకృతి వైద్యానికి, వయస్సుకు ఏమీ సంబంధం లేదు, ఉపవాసం చేసి మంచి ఆహార నియమాలు పాటిస్తే ఈ వయస్సులో కూడా హుషారుగా పని చేయవచ్చని చెప్పారు. వారి సలహా మీదట ఉపవాసాలు ప్రారంభించాను. రోజు ఆఫీసుకు వెళ్ళి 10 – 12 గంటలు పని చేసుకోవడం మానలేదు, బి.పి. బిళ్ళలు తప్ప అన్ని రకాల మందులు వాడను. నిద్ర రెండు రోజుల తరువాత బాగానే పట్టింది, నాలుగవ రోజు ఉపవాసం నుండి కాళ్ళకు స్పర్శ రావడం మొదలయ్యింది, ఆరవరోజుకి షుగరు పూర్తిగా తగ్గింది. 7,8 రోజులలో కాళ్లు మామూలుగా రక్తప్రసరణతో తేలిగ్గా ఉండేవి, నా చేతుల వణుకు, ఊగడం పూర్తిగా ఆగిపోవడం గమనించాను, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, వయస్సుతో వచ్చే ఇబ్బంది అయిన వణుకు పూర్తిగా తగ్గిపోయింది, పడవ రోజు ఉపవాసంలో బాగా ఆకలి మొదలయ్యింది, ఉపవాసంలో ఉన్న పది రోజులు ఏమీ ఇబ్బందులు గాని, నీరసంగానీ లేకుండా చాలా హుషారుగా ఉంది. ఈ వయస్సులో ఉపవాసాలు ఎలా చేయగలుగుతాము? అనుకున్నాను గానీ ఉపవాసం చేయడం ఇంత తేలిక అన్నట్లుగా నా ఉపవాసాలు పూర్తి అయినవి, తరువాత క్రమేపీ డాక్టరు గారు చెప్పినట్లు ఆహారంలోనికి రావడం జరిగింది. ఉప్పు లేని వంటలను తీసుకోవడం, కూరగాయల రసం త్రాగడం చేస్తున్నాను. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా, శక్తిగా ఉన్నాను, ఇంకా 10 సంవత్సరాలు గట్టిగా పని చేసుకోగలనన్న విశ్వాసం నాకు కలుగుతుంది.

డా|| సత్యనారాయణ రాజు గారు చేయించే ఉపవాసపు విధానం వయస్సుతో నిమిత్తం లేకుండా పాటించి ఆరోగ్యాన్ని పొందవచ్చని నాకు తెలిసింది, నేను ఉపవాసాలు చేస్తుంటే, ఈ వయస్సులో ఆయనకు ఉపవాసాలేంటి అని కొంత మంది అనే వారు, కానీ అది పొరపాటు,. పూర్తి ఆరోగ్యాన్ని పొందడానికి ప్రకృతి వైద్యం అన్ని విధాలా సహకరించగలదని నాకు నమ్మకం కలిగింది, అన్ని వయసుల వారు ఉపవాసపు విధానాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యవంతులు కాగలరని ఆశిస్తున్నాను. 80 సంవత్సరాల వయస్సులో కూడా పని చేసుకుంటూ ఉపవాసాలు చేయవచ్చని సత్యనారాయణ రాజుగారు నిరూపించారు. డా|| సత్యనారాయణ రాజు గారి దయ వలన నా ఆరోగ్యము చాలా బాగున్నది. వారు చేసిన మేలు జన్మలో మరువరానిది. ఎంతో మంది పెద్ద వయస్సులో ఉన్న వారికి ఆరోగ్యాన్ని కబాగు చేయడానికి డాక్టర్ గారికి ఆ దైవం మరింత బలాన్ని చేకూర్చాలని ప్రార్థిస్తూ శెలవు తీసుకుంటున్నాను.

భవదీయుడు

డా|| బి.వి. రాజు చైర్మన్,

విష్ణు సిమెంట్స్ లిమిటెడ్,

పంజగుట్ట, హైదరాబాద్

ఫోన్: 040 – 23313557.