నాలుగు పదులు నిండని వయస్సు, తెల్లటి ఖాదీ వస్త్రాలు ధరించి, చిరునవ్వు చిందిస్తూ, చాలా ప్రశాంతమైన మనస్సుతో, ఒక ప్రదేశంలో నిలబడి, అటు ఇటు కదలకుండానే మైకు చేతిలో పట్టుకొని 2-3 గంటల పాటు కొన్ని వందల మందిని ఉద్దేశించి తన ఆరోగ్య ప్రసంగాలను ఇస్తూ వుంటారు.

ఇలా రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిరవధికంగా తన ఆరోగ్య ప్రసంగాలను ప్రజలకు అందిస్తూ వెళ్తుంటారు. తనే స్వయంగా కారు నడుపుకుంటూ నెలలో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ప్రసంగం పూర్తికాగానే అందరు ఆయన చుట్టూ గుమిగూడతారు.

ఎవరికి సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి వారు డాక్టర్ గారిని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ప్రతి ఒక్కరికి ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ఉంటారు రాజుగారు. ఆయనకు అసలు విసుగు అంటే తెలియదు.

ఉదయం 5గం||ల నుండి రాత్రి 11 గంటల వరకు దాదాపుగా రోజు 18 గంటలు అవిశ్రాంతంగా రాష్ట్ర మంతటా తిరుగుతూ "ప్రకృతి జీవన విధానం" అనే మహాయజ్ఞాన్ని ఏక వ్యక్తి సైన్యంగా" ప్రచారం కొనసాగిస్తున్న వ్యక్తి డా|| మంతెన సత్యనారాయణ రాజుగారు.

రాష్ట్రంలో ఆయన ప్రసంగించని కార్పోరేట్ సంస్థలుగాని, ప్రభుత్వ సంస్థలుగాని లేవంటే ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదు. బి,హెచ్.ఇ.ఎల్., విశాఖ ఉక్కు కర్మాగారం, రాయలసీమ పవర్ ప్రాజెక్ట్, విజయవాడ పవర్ ప్రాజెక్ట్, రాయలసీమ పేపర్ మిల్స్, కొత్తగూడెం ధర్మల్ ప్లాంట్, వివిధ సిమెంట్ కర్మాగారాలు విద్యుత్సంస్థలు, తిరుపతి దేవస్థానం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, టూరిజం సిబ్బందికి, టీచర్స్, విద్యాసంస్థలలో, విశాఖ హృదయం ఉన్న అల్లోపతి డాక్టర్స్ కి ప్రత్యేకమైన తరగతులు, ఆర్, టి.సి సంస్థ లాంటి ఎన్నో రకాల సంస్థల సిబ్బంది వారికి తన యొక్క జీవన విధానంపై ప్రసంగించి, ఆరోగ్య సూత్రాల పట్ల అవగాహనను పెంపొందించడంతో పాటు యోగాసనాలు, ప్రాణాయామాలలో శిక్షణ కూడా ఇస్తుంటారు.

డా||రాజుగారు 1994 నుండి అనగా గత 12 సంవత్సరాల నుంచి నెలకు 20 జిల్లాలలో, ఈ ఆరోగ్య మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు లక్షల మందిని ఉత్తేజ పరుస్తున్నారు. డా|| రాజుగారి ప్రసంగాల ప్రభావం వలన ఎందరో ఆరోగ్యాలు బాగు పడ్డాయి. ఎందరెందరో జీవితాలు మెరుగుపగ్గాయి. మరెందరో వారికున్న త్రాగుడు, డ్రగ్స్ లాంటి దురలవాట్ల నుండి విముక్తులయ్యారు.

రాజుగారు అతి సులభంగా ప్రజల మనసులలో ఆరోగ్య రహస్యాలను చక్కటి బీజాలుగా నాటుతారు. అవి వటవృక్షంలా శాఖోపశాఖలుగా పెరిగి మంచి ఆరోగ్య ఫలాలను అందిస్తాయి. నేడు ఎంతో వైజ్ఞానికంగా అభివృద్ధిని చవిచూసినా అత్యంత చిన్న చిన్న ఆరోగ్య విషయాలు తెలియకపోవడం శోచనీయంగా భావించి, డా|| రాజుగారు చాలా సులభ శైలిలో నిత్యజీవితంలో మన చుట్టూ జరుగుతున్నా విషయాలను జోడించి పండితులకు, పామరులకు, చిన్న పిల్లలు సహితం అర్థం చేసుకునే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. అందరిని ఒప్పించి, మెప్పించి, ఆచరించేటట్లుగా చేసి ఆరోగ్యానందాలను పొందేటట్లుగా ఆరోగ్య సూత్రాలను, వైద్యశాస్త్ర విషయాలను సునిశిత విశ్లేషణలతో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా వివరిస్తున్నారు.

వైద్యులు చేయి వేస్తే వేలకు వేలు గుంజే రోజుల్లో ఎవరి దగ్గరి నుండి ఒక పైసా కూడా ఆశించరు. లాభాపేక్ష లేని డా|| రాజుగారు ఇన్ని కార్యక్రమాలు కేవలం తాను రాసిన పుస్తకాలు, నిత్యావసర సరుకులు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతోనే దాదాపు 50 మంది సిబ్బందిని పోషిస్తున్నారు.

మన పూర్వీకులు అందించిన ఈ ఆరోగ్య సూత్రాలను పది మందికి అందించడం ఈ ఆరోగ్య సూత్రాలు ఓ గొప్ప దైవకార్యమని, వీటిని అలా ఉచితంగా ప్రజలకు అందించడంలోనే ఆనందం ఉందంటారు. ప్రజల దగ్గరి నుండి వారు ఆశించే ప్రతిఫలం ఏమిటంటే, తాను చెప్పిన ఆరోగ్య సూత్రాలను తు. చ తప్పకుండా ఆచరించాలని, అలా ఆచరించడం ద్వారా పొందిన ఫలితాలను మీ ఒక్కరికే కాక మీతో పాటు మీకు తెలిసిన 10 మందికి పంచాలి అని కొరుకుంటున్నారు.

ఈ సేవాభావంతోనే అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి కూర్చుకున్న తన ప్రసంగాల సి.డి.లను పుస్తకాలను విశ్వమానవాళికి అందించాలనే ఉద్దేశ్యంతో తెలుగువన్ ద్వారా ఉచితంగా అందించడం నిజంగా వారి గొప్పతనానికి నిదర్శనం.

డా|| రాజు గారిలో అణువణువున నిరాడంబరత, నిశ్చలతత్వం. మాటలతో స్పష్టత, అచంచలమైన ఆత్మవిశ్వాసం, అవలీలగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధానం అడుగడుగునా కనబడుతాయి. తెల్లటి ఖాదీ బట్టలు, కుర్తా, పైజామా ధరించి, గాంధేయ భావాలతో తన పనులు తానే స్వయంగా చేసుకోవాలనే మనస్తత్వం కలవారు. ఈ విశ్వంలో అందరు మంచి వారుగానే విశ్వశిస్తారు. మంచి ఆహారం తిని, మంచి అలవాట్లను, మంచి మనస్సును వృద్ధి చేసుకొని, మంచినే పోషించి, మంచినే పది మందికి పంచాలనే సదుద్దేశ్యంతో నేను సహితం ప్రపంచాగ్నికి ప్రమిదనై వెలగాలని" తన వంతుగా కృషి సల్పుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన భారతావని ప్రకృతి గడ్డపై సాధారణ కుటుంబంలో జన్మించి ప్రకృతి మాత ఋణం తీర్చుకోవడమే కాదు "ప్రకృతి జీవన విధానాన్ని" భారతదేశం సరిహద్దులను దాటింపజేస్తున్నారు. డా|| రాజుగారు వ్యక్తి మాత్రమే కాదు అతను ప్రకృతి వైద్యానికి ఒక శక్తి. అతను కదులుతున్న ఆరోగ్య భాండాగారం. “పరుల కోసం పాటు పడే వ్యక్తి మాత్రమే జీవించినట్లు", అన్న స్వామి వివేకానందుడు చెప్పిన విషయాన్ని అక్షర సత్యం చేస్తూ డా|| రాజుగారు ప్రజల హృదయాంతారాల్లో వెలుగుతున్నారు.

ఎందరో జీవితాలకు ఆరోగ్యపు వెలుతురును ప్రసరింపజేస్తున్నారు. అతను గురించి ఎంత చెప్పిన తక్కువే మరీ, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో ప్రకృతి వైద్యాన్ని ఒక రాష్ట్రంలో, ఇంత విస్తృత స్థాయిలో ప్రతి జిల్లాలోని పౌరులందరికి మాస్ గా, అదియునూ ఏక వ్యక్తి సైన్యంగా తీసుకొని వెళ్ళ గలుగుతున్న మొట్టమొదటి వ్యక్తి డా|| రాజుగారు.