ముక్కునుంచి రక్తస్రావం:

 

1. మీకు అప్పుడప్పుడు ముక్కు నుంచి రక్తం కారుతుంటుందా?

రక్తనాళాలు బలహీనపడటం

2. ఏదైనా దెబ్బ తగిలిందా?

ముక్కుకు దెబ్బ తగలడం

3. మీకు ఏ కాస్త దెబ్బ తగిలినా, ఎక్కడ ఒత్తిడి పడినా అక్కడ రక్తం కమిలినట్లవుతుందా?

పుట్టుకతో ప్రాప్తించే వ్యాధులు

4. మీ రక్తపోటును ఈ మధ్య పరీక్ష చేయించుకున్నారా? బిపి ఎక్కువగా ఉందా?

రక్తపోటు పెరగటం (హై - బిపి / హైపర్ టెన్షన్)

5. ముక్కులో ఏదైనా పదార్ధం ఇరుక్కుందా?

ముక్కులో అన్యపదార్ధం (ఫారెస్ బాడీ)

6. మీరు స్మోక్ చేస్తారా?

ధూమపాన దుష్ఫలితం

7. మీరుండే వాతావరణ పరిస్థితిలో మార్పు చోటు చేసుకుందా?

వాతావరణ ప్రతికూల ప్రభావం

శరీరం నుంచి రక్తస్రావమవ్వడాన్ని ఆయుర్వేదం 'రక్తపిత్తం' అని వ్యవహరించింది. శరీరంలో పిత్తదోషం అమితంగా పెరిగిపోయి రక్తంపైన ప్రభావాన్ని చూపించినప్పుడు రక్తపిత్తం ప్రాప్తిస్తుంది. 'అగ్నిలోని వేడిమి వలన పాలు ఎలా అయితే పొంగుతాయో, అలాగే శరీరంలో పిత్తం ప్రోకోపించడం వలన రక్తం దూషితమై, శరీరం నుంచి స్రవిస్తుంది.” అంటుంది శాస్త్రం.

రక్తస్రావం శరీరంలో ఎక్కడైనా జరగవచ్చు. తల, ముఖం మొదలైన వాటినుంచి రక్తస్రావమైతే ఊర్థగత రక్తపిత్తమనీ, శరీరంలో కింది భాగాలనుంచి జరిగితే అధోగత రక్తపిత్తమనీ, ఇతర ప్రదేశాల నుంచి జరిగితే తిర్యక్ గత రక్తపిత్తమనీ సంహితాకారులు విభజించారు.చికిత్సాపరంగా వీటి మధ్య వ్యత్యాసాలు ఉండటం వల్ల ఇలా విభజించాల్సి వచ్చింది. ఇహ ప్రస్తుత సందర్భానికి వస్తే, ముక్కునుంచి రక్తం స్రవిస్తుంది కనుక ఈ స్థితికి నాసాగత రక్తపిత్తమని పేరు.

ముక్కునుంచి జరిగే రక్తస్రావానికి కారణాలు చాలానే ఉంటాయి. సాధారణంగా ముక్కు దూలం (ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఉండే లిటిల్స్ ఏరియా, ఉడ్ రఫ్స్ అనే ప్రదేశాలు) అదిరినప్పుడు అక్కడ ఉండే సున్నితమైన రక్తనాళాలు చిట్లి రక్తం కారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది తెలుసుకోవాలంటే ఈ స్థితికి దారితీసే కారణాలను తెలుసుకోవాలి.

1. రక్తనాళాలు బలహీనపడటం:

పిల్లల్లోనే కాకుండా పెద్దవారిలో సైతం అప్పుడప్పుడు ముక్కునుంచి రక్తం కారుతుంటుంది. ముక్కులోపల ఉండే రక్తనాళాల గోడలు పలుచబడినప్పుడుగాని, చలి వాతావరణం, శారిరక శ్రమ, తుమ్ములు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడుగాని ఈ స్థితి సంభవిస్తుంది.

సూచనలు: 1. విటమిన్ - సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను (ఉసిరికాయ తదితరాలను) యథాతథంగాగాని, చ్యవనప్రాశ వంటి ,మందుల రూపంలోగాని తీసుకుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది. విటమిన్ - సి అనేది కొల్లాజెన్ అనే పదార్థం తయారీకి అవసరమవుతుంది. ఈ పదార్ధం వలన ముక్కులోపలి శ్లేష్మపు పొరలు ఆరోగ్యంగా ఉంటాయి. 2. కొంతమంది అదే పనిగా ముక్కురంద్రాల్లోకి వెళ్లు పోనిస్తుంటాయి. ఈ అలవాటు మంచిది కాదు; ఉదయం స్నానం చేసే సమయంలో మాత్రం దోసిలితో కొంచెం నీళ్లు తీసుకుని ముక్కుతో పీల్చి, లోపల శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ పిల్లలకు ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటు ఉంటే దానిని మానిపించాలి. మీరు వారిని గమనించినప్పుడల్లా వేళ్లను తీసివేస్తుంటే క్రమంగా పిల్లలు ఈ అలవాటు నుంచి బయటపడతారు.

ముక్కునుంచి రక్తం కారుతున్నప్పుడు ఇలా చేయండి:

ముక్కునుంచి రక్తస్రావమవుతున్నప్పుడు ముందుగా స్థానికంగా తయారైన రక్తపు గడ్డలను తొలగించడానికి నెమ్మదిగా చీదండి (ఇలా మాటి మాటికీ కాదు; కేవలం ఒకటి రెండు సార్లే సుమా!) దీనితో రక్తనాళాల చివరి భాగాలను మూసుకొనివ్వకుండా చేసే రక్తపు గడ్డలు బయటకు వెళ్లిపోతాయి. ఇది జరిగిన తరువాత, రక్తంలోని తంతుయుత పదార్థాలు రక్తనాళాల చివర్లలో వల మాదిరిగా అల్లుకుపోయి రక్తనాళాలను మూసివేస్తాయి. ఫలితంగా రక్తస్రావం ఆగిపోతుంది.

ఒకబ్యాండేజీ గడ్డనుగాని, స్వచ్చమైన గుడ్డు పేలికనుగాని తీసుకుని నెయ్యి, వెన్న మొదలైన స్నిగ్ధ పదార్థాలతో తడిపి ముక్కు రంద్రాల్లోకి బిగుతుగా చొప్పించండి. (రక్తం ఆగిపోయిన తరువాత, గుడ్డ పెలికను తొలగించేటప్పుడు, గుడ్డపీలిక ముక్కులోపలి శ్లేష్మపు పొరలను అంటుకుని తిరిగి సమస్యను ప్రేరేపించకుండా ఉండాలంటే దానిని స్నిగ్ధ పదార్థాలతో తడపాలి.)

ఇలా చేసిన తరువాత తలను ముందుకు వంచండి. (తల వెనక్కు ఉంటే, ముక్కులోపల స్రవించే రక్తం గొంతునుంచి క్రిందకు వెళ్లిపోతుంది తప్పితే మీకు తెలిసే అవకాశం ఉండదు).

అవసరం అనుకుంటే బొటనవేలు, చూపుడు వేళ్లతో ముక్కును గట్టిగా పది నిముషాల పాటు అదిమి ఉంచండి. ఇలా చేస్తున్నప్పుడు ఊరిపి పీల్చుకోవటం కోసం తాత్కాలికంగా నోటిని ఉపయోగించవచ్చు.

పావు గంట ఆగి ముక్కులోపలి గుడ్డ పేలికను తీసేయండి. అవసరమనుకుంటే దోసిలితో నీళ్లు తీసుకొని, ముక్కుతో పీల్చితే గుడ్డ పేలిక నాని తేలికగా బయటకు వస్తుంది.

బ్లీడింగ్ ఆగినపోయినా పూర్తిగా మామూలు స్థితి నెలకొనడానికి కనీసం పది రోజులు పడుతుంది. ఈ లోగ గిల్లడంగాని, చీదడం కాని చేయకండి.

నొప్పిని తగ్గించే మందులను (యాస్ప్రిన్ వంటి వాటిని) యథేచ్చగా వాడవద్దు; వాటికి రక్తస్రావాన్ని కలిగించే నైజం ఉంటుంది.

గృహచికిత్సలు: 1. నాసాగత రక్తపిత్తం ఉన్నప్పుడు, ప్రథమ చికిత్సగా ఐస్ ముక్కలను నలగ గొట్టి పొడిలాగా చేసి పలుచని గుడ్డలో చుట్టి ముక్కు రంధ్రాలలో ప్యాక్ చేయవచ్చు. లేదా తలపైనుంచి, ముక్కుపైనుంచి, చల్లటి నీళ్లను ధారగా పోయవచ్చు. 2. దూర్వ అనే గడ్డి జాతికి చెందిన మొక్క ఈ స్థితిలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని కచ్చా పచ్చగా దంచి మెత్తటి ముద్దలాగా చేసి గట్టిగా పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని ముక్కు రంధ్రాలలో పది బిందువుల చొప్పున వేసుకుని పీల్చాలి. 3. దానిమ్మ పూవులనుంచి స్వరసం పిండి, ముక్కు రంధ్రాల్లో డ్రాప్స్ గా వేస్తె ముక్కునుంచి రక్తం కారడం ఆగుతుంది. దీనిని 'అవపీడన నస్యం' అంటారు. 4. ముక్కు నుంచి రకరస్రావం మాటిమాటికి అవుతూ ఇబ్బంది పెడుతుంటే 'అణుతైలం' అనే మందును, నేసల్ డ్రాప్స్ గా వాడటం మంచిది. ఐతే, దీనిని రక్తస్రావమవుతున్నప్పుడు కాకుండా, మామూలు సందర్భాల్లో వాడుకోవాల్సి ఉంటుంది. అష్టాంగ హృదయం అనే ఆయుర్వేద వైద్యగ్రంథంలో ఈ మందు గురించి, దీని గుణ ధర్మాలను గురించి చాలా ఉన్నతంగా వివరించారు. దీనిని ప్రతిరోజు అలవాటుగా వాడుకునే వారికి తల, మెడలకు సంబంధించిన సమస్యలూ, జుట్టు రాలడం, సైనసైటిస్, మైగ్రేన్ వంటివీ బాధించవనేది ఈ వివరణల సారాంశం. 5. భావ ప్రకాష అనే ద్రవ్యగుణ ప్రధాన గ్రంథం వాసా (అడ్డ రసం) అనే మొక్క గురించి చాలా ప్రముఖంగా చెప్పింది. ఈ మొక్క దొరుకుతున్నంత కాలం రక్తస్రావంతో భీతిల్లే రోగి మరణం గురించి దిగులు చెందాల్సిన పనిలేదని ఈ గ్రంథం పేర్కొంది, దీనిని వివిధ రూపాల్లో వాడుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, ఆకులను దంచి, రసాన్ని పిండి, తేనె పంచాదారలు కలిపి తీసుకోవటం అన్నింటికంటే తేలికైన పద్దతి. 6. చందనం, అతిమధురం, లొద్దుగ, చెరకు గడలు ఇవన్నీ రక్తపిత్తాన్ని సమర్ధవంతంగా తగ్గిస్తాయి. వీటిని రాత్రంతా ఒక కొత్తకుండలో నీళ్లుపోసి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని (ఆయుర్వేదంలో ఇలాంటి నీటిని హిమం అంటారు) తాగితే సరిపోతుంది.

ఔషధాలు: బోలపర్పటి, బోలబద్ధరసం, దాడిమావలేహ్యం, వాసావలేహ్యం.

బాహ్యప్రయోగం - పునర్నవాది తైలం.

2. ముక్కుకు దెబ్బ తగలటం:

ఇది నాసాగత రక్తస్రావానికి స్పష్టమైన కారణం. దెబ్బ తగిలితగలడంతోనే ముక్కునుంచి రక్తం కారుతుంది. ఒకవేళ అప్పటికి సమస్య తగ్గినట్లు అనిపించినా, దీనికి సరైన చికిత్స తీసుకోకుండా వదిలేస్తే, ముక్కులోపలి శ్లేష్మపు పొరలు దెబ్బతినడం వలన, ప్రతికూల పరిస్థితులు ప్రాప్తించినప్పుడల్లా సమస్య తిరగబెడుతూ ఉంటుంది.

సూచనలు: ఆయుర్వేద శాస్త్ర చికిత్సా పితామహుడు సుశృతుడు రక్తస్రావాన్ని ఆపడానికి నాలుగు ప్రక్రియలను పేర్కొన్నాడు. సంధానం (రక్త నాళాలను ఒక దానితో మరొకటి అతకడం), స్కందనం (లైగేషన్), పాంచనం (రసాయనాలతో కాటరైజ్ చేయడం), దహనం (థర్మల్ కాటరైజేషన్) అనేవి రక్తస్రావాన్ని ఆపే చికిత్సా ప్రక్రియలు. రక్తస్రావం ఆగకుండా జరుగుంటే ఈ ప్రక్రియలను ప్రయోగించాల్సిన అవసరం ఉంటుంది కనుక వైద్య సహాయం తీసుకోవడం మంచిది. పది నిముషాలకు మించిన రక్తస్రావానికి ప్రమాదకరమని గుర్తించండి.

3. పుట్టుకతో ప్రాప్తించే వ్యాధులు:

జన్మతః ప్రాప్తించే టెలాంజెక్టేసియా వంటి వ్యాధుల్లో రక్తనాళాలు బలహీనపడి రక్తస్రావమవడానికి అవకాశముంటుంది. శరీరంలో ఎక్కడన్నా ఒత్తిడి చోట కమిలితే లోపల సూక్ష్మమైన రక్తనాళాలు విచ్చిన్నమైనాయనీ లేదా, రక్తం గడ్డ కట్టే విధానంలో లోపం ఏర్పడిందనీ అర్థం. వైరస్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి బ్లడ్ క్యాన్సర్ వరకూ అనేక రకాల అంశాలు ఈ పరిస్థితిని కలుగచేస్తాయి. వీటికి సందర్భోచిత చికిత్సలు అవసరమవుతాయి.

4. రక్తపోటు పెరగటం (హై -బిపి/హైపర్ టెన్షన్):

నలభై అయిదు సంవత్సరాలు దాటిన వారిలో ముక్కునుంచి రక్తం కారుతుంటే ముందుగా అధిక రక్తపోటును అనుమానించాలి. ఒకవేళ మీకు బిపి ఎక్కువగా ఉంటే, ముందుగా దానికి సరైన చికిత్స తీసుకోవాలి. కొవ్వు పదార్థాలనూ, నూనెలనూ తగ్గించుకోవాలి. లాగే ఉప్పు కూడా తగ్గించుకోవాలి.

గృహచికిత్సలు: 1. సర్పగంధ (పాతాళగరుడి) వేరు, జఠామాంసి, కరక్కాయ పెచ్చులు అన్నీ కలిపి పొడిచేయాలి. దీనిని పూటకు అరచెంచాడు చొప్పున నీళ్లతో రెండుపూటలా తీసుకోవాలి. 2. మందార పువ్వులు ఎండించి, పొడిచేసి పూటకు అరచెంచాడు చొప్పున మూడుపూటలు తీసుకోవాలి. 3. అశ్వగంధ వేరు, తెల్లమద్దిచెట్టు పట్ట, పల్లేరుకాయలు వీటిని సమతూకంగా తీసుకొని, మెత్తగా దంచాలి. దీనిని గుప్పెడు తీసుకుని గ్లాసులు నీళ్ళు కలిపి, పావుగ్లాసు మిగిలెంత వరకు మరిగించి వడపోసుకుని రోజుకు రెండుసార్లు తాగాలి. 4. వెల్లుల్లి ఆరు భాగాలు, తులసి ఆకులు రెండు భాగాలు, జాపత్రి చూర్ణం ఆరు భాగాలు వీటన్నిటినీ రిక్తిఫైడ్ స్పిరిట్ లో (200 భాగాలు) రెండు రోజుల పాటు వుంచి వడపోసి, పూటకు పది చుక్కలు చొప్పున కప్పు నీళ్ళలో కలుపుకుని మూడుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: సర్పగంధాఘనవటి, బృహత్ వాతచింతామణి రసం, త్రిఫలా గుగ్గులు, గోమూత్ర శిలాజిత్తు.

5. ముక్కులో అన్యపదార్థం (ఫారెస్ బాడీ):

బఠాణీ గింజలు, గుండీలు, బలపం ముక్కలు, గులకరాళ్ల వంటివి ముక్కులో ఇరుక్కుంటే శ్లేష్మపు పొరలు రేగి రక్తాన్ని స్రవిస్తాయి. దీనికి వైద్య సహాయం తప్పనిసరి. మీరు తీయడానికి ప్రయత్నిస్తే సమస్య మరీ జటిలమయ్యే ప్రమాదముంటుంది.

 

6. ధూమపాన దుష్పలితం:

ముక్కునుంచి రక్తస్రావం కాకుండా ఉండాలంటే శ్లేష్మపు పొరలు తడిగా, ఆరోగ్యంగా ఉండాలి. ధూమపానం ఈ శ్లేష్మపు పొరలను తడారిపోయేలా చేస్తుంది కనుక మీకు స్మోకింగ్ అలవాటుంటే దానిని మానేయండి.

7. వాతావరణ ప్రతికూల ప్రభావం:

చలిగా ఉండే వాతావరణం, వడ గాల్పులు, ఎండగా ఉండే వాతావరణం, బాగా ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లడం మొదలైనవి రక్తస్రావాన్ని కలిగించేందుకు అవకాశం ఉంది. గాలిలో తేమ తగ్గిపోయినప్పుడు కూడా శ్లేష్మపు పొరలు తడారిపోయి రక్తస్రావమవుతుంది. ముక్కునుంచి రక్తం కారుతున్నప్పుడు ఈ కారణాలన్నీటి మీదా దృష్టి పెట్టి తగిన చికిత్సలు, చర్యలు తీసుకోవాలి.