కాలేయం (లివర్):

1. సూదిమందునుకాని, రక్తమార్పిడినికాని సురక్షిత పద్ధతులు పాటించకుండా తీసుకున్నారా?

వైరల్ హెపటైటిస్

2. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారా?

మదాత్యయం (ఆల్కహాలిజం)

3. అల్లోపతి మందులేమయినా వాడుతున్నారా?

మందుల దుష్ఫలితాలు

4. కడుపు నొప్పితో పాటు ఆయాసం కూడా ఉంటుందా? మీ పాదాల్లో, కాళ్లలో వాపు కనపడుతుందా?

గుండె కండరాలు బలహీనపడటం (హార్ట్ ఫెయిల్యూర్)

5. కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయా?

కామెర్లు (జాండిస్ / హైపటైటిస్)

 

ఉదర ప్రాంతంలో కాలేయం చాలా పెద్ద నిర్మాణం, ఇది రక్తంలోని ప్లాస్మాకు అవసరమైన ప్రోటీన్లనూ, వ్యాధి క్షమత్వ శక్తికి దోహదపడే రక్షకాంశాలనూ, రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే మౌలికపదార్థాలనూ, రక్తం ద్వారా ఆక్సిజన్, కొలెస్టరాల్ మొదలైన వాటిని సరఫరా చేయడానికి అవసరమైన కణసముదాయాలనూ తయారు చేస్తుంది. ఇంతే కాకుండా గ్లూకోజ్ ను అవసరమైనప్పుడల్లా రక్తంలోకి విడుదల చేస్తుంది. అలాగే రక్తంలో కలిసే చాలా రకాలైన విషపదార్థాలనూ, మందులనూ వడపోసి గాల్ బ్లాడర్ నుండి పేగుల ద్వారా, లేదా మూత్రం ద్వారా విసర్జితమయ్యేలా చూస్తుంది. నిజానికి ఇది మొండి ప్రత్యంగం అయినా, కొన్ని వ్యాధులు దీనిని బలహీనపరిచి వ్యాధిగ్రస్తం చేస్తాయి. అప్పుడు కాలేయంలో నొప్పి అనేది ఒక ప్రధాన లక్షణంగా ఉంటుంది.

1. వైరల్ హైపటైటిస్:

ఇటీవల కాలంలో హైపటైటిస్ - బి బాగా ప్రబలుతోంది. కలుషిత రక్తం ద్వారా వ్యాపించే ఈ వైరస్ కు వ్యతిరేకంగా విరేచన కర్మ అనే ఆయుర్వేద చికిత్సతోపాటు 'భూమ్యామ్లకి' అనే మూలిక సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గృహచికిత్సలు: 1. బాగా నీళ్ళు తాగాలి. 2. చెరకురసం, కొబ్బరినీళ్ళు, బార్లీ నీళ్ళు బాగా తాగాలి. 3. పూర్తిగా కోలుకునేంతవరకు విశ్రాంతి తీసుకోవాలి. 4. వ్యాధి వ్యాప్తిని తగ్గించడం కోసం శుచి, శుభ్రత ఇతర జాగ్రత్తలు పాటించాలి. 5. కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. 6. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను గింజలు తొలగించి కేవలం పెచ్చులు మాత్రమే తీసుకుని పొడిచేసి రెండు చెంచాలు మోతాదుగా చూర్ణరూపంలోగాని కషాయం రూపంలోని తీసుకోవాలి, 7. వేపాకునుంచి నాలుగు చెంచాలు రసం తీసి అంతే పరిమాణం తేనె కలిపి అరచెంచా మిరియాల పొడి చేర్చి సగం ఔషధాన్ని ఉదయం, మిగిలిన సగభాగాన్ని సాయంత్రం పుచ్చుకోవాలి. 8. నేల ఉసిరిక రసాన్ని (నాలుగు చెంచాలు) తేనెతో (రెండు చెంచాలు) కలిపి తీసుకోవాలి. 9. నవాసాగరం (చిటికెడు), కటుకరోహిణి చూర్ణం (పావు చెంచాడు), కరక్కాయల వలపు చూర్ణం (రెండు చెంచాలు) అన్నీ కలిపి రోజుకు రెండుసార్లు నీతితో తీసుకోవాలి.

ఔషధాలు: పునర్నవాదిమండూరం, నవాయస లోహం, ఆరోగ్యవర్ధినీవటి, అవిపత్తికర చూర్ణం.

2. మదాత్యయం (ఆల్కహాలిజం):

ఆల్కహాల్ అధికంగా తీసుకునేవారిలో - లివర్ సిరోసిన్ వల్ల – కడుపు నొప్పి వచ్చే అవకాశముంది. మద్యాన్నిగాని, ప్యారాసిటమాల్ వంటి హెపటోటాక్సిక్ మందులనుగాని యథేచ్చగా వాడేవారిలో కాలేయం నిర్విషీకరణ ప్రక్రియను (డీటాక్సి ఫికేషన్) చేపట్టి అదనపు ఒత్తిడితో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో చివరకు అదే వ్యాధిగ్రస్తమవుతుంది. ఈ పరిణామాల వల్ల కడుపులోపల కుడివైపు పక్కటెముకల కింద – అసౌకర్యంగాని, అస్పష్టమైన నొప్పిగాని ఉంటుంది. దీనికి మదాత్యయ చికిత్సలతోపాటు యకృత్ వృద్ధికి చెప్పిన ఔషధాలను వాడాల్సి ఉంటుంది.

ఔషధాలు: జవహర మొహరా పిష్టి, వసంతకుసుమాకర రసం, శతావర్యాదిఘృతం, స్వర్ణమాక్షీకభస్మం, ముక్తాపిష్టి, యకృత్ ప్లీహారి లోహం.

3. మందుల దుష్ఫలితాలు: చాలా రకాలైన మందులు రసాయనికంగా విభజితమయ్యేది కాలేయంలోనే కాబట్టి వీటి వలన ఏర్పడే దుష్పరిణామాలకు ముందుగా లోనయ్యేది కాలేయమే. ఎంత చిన్న మోతాదులో తీసుకున్నప్పటికీ కొన్ని రకాల మందులు, కొందరు వ్యక్తులలో తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి. కొన్నిరకాల యాంటీబయాటిక్స్. రక్తపోటు మందులు, మత్తును కలిగించే మందులు మొదలైనవి కాలేయం మీద విషప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అల్లోపతి మందులు వాడుతున్నప్పుడు కడుపులో నొప్పి వస్తే వాటి వాడకాన్ని నిలిపి వేసే వైద్యసలహా తీసుకోవాలి.

4. గుండె కండరాలు బలహీనపడటం (హార్ట్ ఫెయిల్యూర్):

కడుపునొప్పితోపాటు ఆయాసం రావటం, కాళ్ళు చేతులు వాయటం వంటివి జరుగుతుంటే, గుండెకు సంబంధించిన సమస్య ఏదన్నా ఉందేమో చూడాలి. అన్ని కండరాల మాదిరిగా గుండె కండరాలు కూడా వ్యాయామ రాహిత్యం వలన, వయస్సు వలన బలహీనపడే అవకాశం ఉంది. అలాంటప్పుడు పంపింగ్ సక్రమంగా జరగదు. ఫలితంగా రక్తంలో కొంత భాగం సిరలలోని మిగిలిపోతుంది. ఇలా కాలేయంలో కూడా జరిగి 'నీటిని పీల్చుకున్న స్పాంజి' మాదిరిగా తయారవుతుంది. దీనితో కాలేయం ప్రాంతంలో ఒక మోస్తారు నొప్పి వస్తుంది.

ఔషధాలు: (మూత్ర ఔషధాలు / మూత్ర విరేచనీయ ఔషధాలు/ డైయూరిటిక్స్)- చంద్రప్రభావటి, దుగ్ధవటి, గోక్షురాది గుగ్గులు, గోక్షురాది చూర్ణం, గుడ పిప్పలి, కర్పూర శిలాజతు భస్మం, పునర్నవాది మండూరం, ప్రాణదా గుటిక, శతావరి ఘృతం, శతావరి లేహ్యం, శోథారి మండూరం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం.

5. కామెర్లు (జాండిస్/హైపటైటిస్):

కళ్ళు పచ్చగా కనిపించడమనే లక్షణంతో పాటు మూత్రం కూడా గాఢమైన రంగులో కనిపిస్తుంటే కాలేయం వ్యాధి గ్రస్తమై జాండిస్ ను ప్రదర్శిస్తున్నదని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు గాల్ బ్లాడర్ లో రాళ్లు, క్యాన్సర్ ద్వితీయావస్థలు వంటివి కూడా ఈ లక్షణాలను ప్రదర్శిస్తుంటాయి.

సూచనలు: కామెర్ల వల్ల ఆకలి కోల్పోయినట్లయితే దాని నుంచి బైటపడేంతవరకూ పూర్తి విశ్రాంతినీమ నిర్దేశిత ఔషధాలనూ తీసుకోవలసి ఉంటుంది. అలాగే, శోధన చికిత్సగా 'విరేచన కర్మ' ను చేయవలసి ఉంటుంది.

గృహచికిత్సలు: 1. నేల ఉసిరిక రాసాన్నిపావు కప్పు మోతాదుగా చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి. 2. నవసాగరం (200మి.గ్రా.) కటుకరోహిణి చూర్ణం (1 గ్రా.), కరక్కాయ పెచ్చుల చూర్ణం (12 గ్రా.), అన్నీ కలిపి రోజుకు రెండు సార్లు నీళ్లతో తీసుకోవాలి. 3. త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డరసం ఆకులు, కటుకరోహిణి, నేలవేము, పట్టలను సమభాగాలు తీసుకొని కషాయం కాచి అర కప్పు చొప్పునం చెంచాడు తేనె చేర్చి రెండు పూటలా తాగాలి.

ఔషధాలు: ఆరోగ్యవర్ధినీ వటి, అవిపత్తికరచూర్ణం, మండూర భస్మం, సూతశేఖర రసం, పిల్లల్యాసవం.