రూప విచలిత అయింది. హటాత్తుగా ఆమెకి దుఃఖం ముంచుకు వచ్చింది. అన్నాళ్ళు ఒంటరిగా ధైర్యంగా, పోరాడినా రూప ఆ క్షణంలో బేల అయిపోయి ఏడ్చింది.
    చటుక్కున అనుపమ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంది. "నో రూపా! ఏడవద్దు. నీలాంటి స్త్రీ ఏడవకూడదు. ఇన్నాళ్ళు ఒంటరిగా అన్నింటికి ఎదురు నిలిచావు. ఈరోజు నీకు అండగా మేం ఉన్నాం" ఓదార్చింది అనుపమ.
    "నా సుమిత్ తప్ప న కెవరు....ఈ లోకంలో ఎవరూ.....ఈనాడు తండ్రినంటూ సురేష్ వచ్చి వాడి ప్రేమ, అభిమానం పొంది వాడ్ని నాకు దూరం చేస్తారా? నో! వాడి ప్రేమ నాకు తప్ప మరొకరికి దక్కకూడదు" రూప అక్కసుగా అంది.
    "నో రూపా! దిసీజ్ బాడ్. సురేష్ మీద కోపంతో అలా ఆలోచిస్తున్నావు. అది సరికాదు. బిడ్డకి తల్లి తండ్రి ఇద్దరి ప్రేమా కావాలి. సురేష్ నీ భర్త అయితే ఇలా ఆలోచించేదానివా? నో....అలా లిన్ గా ఆలోచించకు. నీ బిడ్డ నీకే ఉంటాడు. వాడి ప్రేమ, అభిమానం ఎలాగూ నీకే ఉంటాయి. సురేష్ ని తండ్రిగా అంగికరింప చెయ్యి అంతేచాలు.
    అప్పుడప్పుడు సురేష్ వచ్చి వాడి మంచి చెడ్డలు చూస్తాడు. ఎప్పుడైనా సెలవుల్లో వాడిని రెండురోజులు తండ్రి దగ్గరికి పంపుతూ వుండు. లోకానికి సురేష్ తండ్రి అని నిర్భయంగా చెప్పు." అనుపమ అనునయిస్తూ అంది.
    "రూపా! సుమిత్ ని పిలువోకసారి. ఒకసారి సరిగా చూడనియ్యి నన్ను ప్లీజ్" అన్నాడు సురేష్ ప్రాధేయపూర్వకంగా.
    పక్కగదిలో సంభాషణంతా వింటున్న సుమిత్ ని అనుపమ లోపలి కెళ్ళి భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా తీసుకొచ్చింది.
    "సుమిత్! ఇన్నాళ్ళు మీ డాడీ ఎవరని అడిగావుట కదా! ఈయనె మీ డాడీ " అంది.
    సుమిత్ సూటిగా తండ్రి వంక చూశాడు. తరువాత రూపవంక చూశాడు.
    సురేష్ రెండడుగులు ముందుకేసి సుమిత్ చెయ్యి పట్టుకుని, "హలో సుమిత్! డోంట్ యు ఫర్ గివ్ యువర్ డాడీ!" అన్నాడు.
    సుమిత్ ఆ మాటకి మెత్తపడిపోయాడు. తల్లి వంక ప్రశ్నార్ధకంగా చూశాడు. రూప తల ఆడించింది.
    "అల్ రైట్ డాడీ! మమ్మీ క్షమించింది కనక ఐ ఆల్సో ఫర్ గివింగ్ యు" అన్నాడు హుందాగా.
    "దెన్ కాల్ మీ డాడీ' అన్నాడు సురేష్ సంతోషంగా.
    "డాడీ!" సిగ్గుపడుతున్నట్లన్నాడు నెమ్మదిగా సుమిత్.
    "సుమిత్ మై బాయ్! ఐ యామ్  వెరి హాపి ఎబౌట్ యు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు" సుమిత్ ని దగ్గరికి తీసుకుని నుదురు ముద్దు పెట్టుకున్నాడు సురేష్. అతని కళ్ళల్లో తడి. అనుపమ కళ్ళు చమర్చాయి. రూప విచలిత అయి చూస్తుంది.
    "సుమిత్! షి ఈజ్ యువర్ సిస్టర్ నిరుపమ. బాడ్ లక్ , షి కెనాట్ వాక్. విల్ యు ప్లే విత్ హర్. విల్ యు హెల్ప్ హర్ వెన్ షి ఈజ్ ఇన్ నిడ్ ఆఫ్ హెల్ప్" అంది అనుపమ, సుమిత్ చెయ్యిపట్టుకుని నిరూ దగ్గరికి తీసుకెళ్ళి.
    "ఆఫ్ కోర్స్ ఆంటీ! ఐ విల్ ప్లే విత్ హర్. నా అట సామాన్లు అన్ని యిచ్చి అడిస్తాను ఆంటీ" అన్నాడు సంతోషంగా నీరూ దగ్గర కుర్చుంటు.
    "నీరూ! సుమిత్ ని "అన్నా' అని పిలు" అన్నాడు సురేష్.
    నీరూ సిగ్గుగా తల ఆడించింది.
    "రూపా! ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో నేను చెప్పలేను. మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? గుండెల్లోంచి ఏదో బరువు దించినట్లు, గిల్టి ఫీలింగ్ పోయి ఏదో గర్వంగా వుంది. అనూ.....ఐ మస్ట్ సే థాంక్స్ టు యు, నన్ను మనిషిని చేశావు" హృదయపూర్వకంగా అన్నాడు సురేష్.
    "ఇందులో నా స్వార్ధం వుంది" అనుపమ నిర్మలంగా నవ్వుతూ అంది.
    "నీ స్వర్ధమా! హౌ?" ఆశ్చర్యంగా అడిగాడు సురేష్.
    "నీరుకి అన్న దొరికాడు. అది పెద్దయ్యాక దాన్ని చూడడానికి మనం లేనప్పుడు సుమిత్ అన్నగా ఆ భాద్యత తీసుకుంటాడు" ఆమె కంఠంలో దుఃఖం పొంగింది.
    తల్లిగా ఆమె హృదయం గురి అవుతున్న రంపపు కోత గుర్తించింది రూప.
    "మీరు అలా అధైర్యపడకండి. నీరుకి ఆమెలో ఏదో లోటుందన్న భావం రానీయకుండా పెంచాలి. మీరిలా అధైర్యపడితే ఏం చెయ్యలేరు" అంది రూప.
    "రూపా! నీ ధైర్యం నాకు లేదు. నీరూకి ఆత్మ విశ్వాసం కలిగించి పెంచాలని ఎంత తాపత్రయ పడుతున్నాను. కాని నా ధైర్యం చాలడం లేదు. ఈ ఉద్యోగ నిర్వహణలో నీరూకి కావాల్సిన ప్రేమ, ఆదరణ పూర్తిగా ఇవ్వలేకపోతున్నానేమో అనిపిస్తుంది.
    "అలా అయితే నీరుని నా దగ్గర వదలండి. సుమిత్ తో కల్సి చదువుతూ, ఆడుతూ...ఇద్దరు కల్సితే ఒంటరితనం కూడా వుండదు" అంది రూప.
    "నిజంగానా! రూపా! నిజంగా నీరూ నీ దగ్గర కొన్నాళ్ళయినా పెరిగితే నాకు నిశ్చింతే. కానీ విడిచి వుండగలనా" అంది బేలగా.
    "ఆంటీ! నీరుని ఉంచండి. నేను చదువు చెపుతా, అడిస్తాను," అన్నాడు సుమిత్.
    రక్త సంబంధం ఎంత గట్టిదో ఆ కొద్ది క్షణాల్లో అర్ధమైంది రూపకి. శత్రువులా ద్వేషించిన సురేష్ బిడ్డమీద తనకేంతటి జాలి, సానుభూతి, తండ్రిని ద్వేషించిన సుమిత్ లో చెల్లెలు పట్ల అప్పుడే ఎంత అభిమానం! ఆ అనుభూతినించి తప్పించుకోలేక పోవడంలోనే వుందేమో ఈ మానవాళి మనుగడ! ఎన్ననుకున్నా భార్య, భర్త, అన్నా, చెల్లి, తల్లి, తండ్రి....వీరిమధ్య అభిమానాలు, ఆప్యాయతలు చెరిగి పోవేమో...!
    కొన్నాళ్లుంచి చూడండి. అంతగా ఉండలేకపోతే తిసుకెడుదురుగాని" అంది రూప.
    "సుమిత్! చెల్లెలిని జాగ్రత్తగా చూడు" అంటూ అనుపమ ఇద్దరికీ ముద్దు పెట్టింది. సురేష్ రూప దగ్గర కళ్ళతోనే వీడ్కోలు తీసుకున్నాడు.
    కారు కనుమరుగు అయ్యాక లోపలికి వచ్చి ఇద్దరి పిల్లల మధ్య కూర్చుని ప్రేమగా నీరూ తల నిమిరింది

                                   ......సమాప్తం.......