విక్రమ్ ఎంతో ఎమోషనల్ గా అన్నదానికి ఈసారి ఇంకా చప్పట్లు మోగాయి.
    విక్రమ్ దగ్గరకు వచ్చి భుజం తట్టి షేక్ హేండ్ యిచ్చారు ముఖ్యమంత్రి ఆనందంగా.
    తరువాత ముఖ్యమంత్రి ప్రసంగం ఆరంభించారు.
    "గౌరవనీయులయిన డాక్టర్ కేశవరావుగారు సాధించిన విజయం నా విజయంలా పొంగిపోతున్నాను నేను. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో, రాష్ట్రమే కాదు దేశ చరిత్రలో శుభదినంగా పరిగణించాల్సిన రోజు. ఒక వ్యక్తికి ధృడ సంకల్పం వుంటే సాధించలేనిది ఏదీ వుండదని కేశవరావుగారు నిరూపించి చూపారు.  
    తన జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం అమెరికా వదిలి, అనేక త్యాగాలు చేసి, రేయింబవళ్ళు తమ గ్రామాభివృద్ధికోసం తపించి, అందరి సహాయ సహకారాలు తీసుకుని మంచిమనిషిగా, ఊరి పెద్దగా నిలిచి గ్రామాన్ని తీర్చిదిద్దిన తీరు చూస్తుంటే నేనే యిది సాధించినట్టు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాను.
    ప్రభుత్వం కాదు, ఒక సంస్థ కాదు, కేవలం ఒక వ్యక్తి పట్టుదలతో, కృషితో యింత స్వల్పకాలంలో ఒక గ్రామాన్ని స్వయంగా ప్రగతిపథం వైపు నడిపించడం యిదే మొదటిసారి నేను చూడడం. ఈ రోజు యిక్కడ ఈ సంబరంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అన్నమాటలు విన్న ఆయన్ని ప్రభావితం చేశాయని, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం నాకు గర్వంగా వుంది.
    ఒక ఉన్నత విద్యాధికుడు, సంపన్నులు అయిన కేశవరావుగారు నన్నర్ధం చేసుకొన్నందుకు, రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలన్న నా ఆరాటాన్ని, తపనని ఆయన అర్థంచేసుకున్నందుకు ఆయనకి నేను కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాను.
    ఏడాదిక్రితం ఈ వూరు ఎలావుందో ఈ ఒక్క సంవత్సర కాలంలోనే ఎంత మార్పు వచ్చిందో స్వయంగా చూశాక నాకు ఆశాభావం కలుగుతుంది. డాక్టర్ గారిని చూసి ఏ కొందరైనా ప్రభావితం కాకపోతారా అన్న ఆశ చిగురిస్తుంది. ఆయనలా సంపన్నులు మరికొంతమంది ముందుకువచ్చి తమతమ గ్రామాలను దత్తత తీసుకుని గ్రామాభివృద్ధికి పాటుపడతారన్న ఆశాభావం కలుగుతుంది. దానికి ఉదాహరణగా యిదిగో వీరి మిత్రులు మొన్నవచ్చి వీరు గ్రామంలో చేసిన మంచిపనులు అమెరికాలో తమ మిత్రులకి చెప్పారట.
    అమెరికా నుంచి నలుగురు ఇద్దరు డాక్టర్లు, ఒక ఇంజనీరు, ఒక ఇండస్ట్రియలిస్టు గ్రామ దత్తత ప్రోగ్రాముల వివరణ కోరుతూ ఉత్తరాలు రాశారు. విజయవాడ నుంచి ఒక పెద్ద పారిశ్రామికవేత్త కేశవరావు గురించి విని ఆయనా తన గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న ఆలోచనలో వున్నానని రాశారు. తణుకు నించి ప్రముఖ పారిశ్రామికవేత్త వివరాలు కోరారు. యిదంతా చూస్తే మన రాష్ట్రానికి, మన గ్రామానికి మంచిరోజులు వచ్చేట్లున్నాయి.
    నేను ఈ గ్రామంలో జరిగిన పనులు గురించి ఫోటోలు తీయించి, చిన్న డాక్యుమెంటరీ తయారుచేయించి సినిమాహాళ్ళల్లో ప్రదర్శించాలని, పేపర్లో, మేగజైన్స్ లో ఫోటోలు, వ్యాసాలు ప్రచురించి "గ్రామ దత్తత" జన్మభూమి పథకం గురించి విస్తృత ప్రచారం అందించి ప్రజలలో చైతన్యం కల్పించి ప్రజలు ముందుకు వచ్చేట్లు చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాను. ఈ స్ఫూర్తి, ఈ ప్రోత్సాహం అందించిన కేశవరావుగారికి ప్రభుత్వం, నేనూ ఎప్పుడూ రుణపడి వుంటానని మనవి చేస్తున్నాను. ఆయనలాంటి విద్యాధికుడు నన్ను, నా కార్యక్రమాలని అర్ధం చేసుకుని ప్రోత్సహిస్తూ మాట్లాడడం నా అదృష్టం.
    ఈ రాష్ట్ర ప్రజలకోసం నేను ఎంత శ్రమకోర్చి అయినా సేవ చేయడానికి సిద్ధంగా వున్నానని చెపుతున్నాను. నన్ను, మా ప్రభుత్వాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రజలది. నా కార్యక్రమాలు అర్ధం చేసుకుని చేయూతనివ్వాలని ప్రజలను అర్థిస్తున్నాను. నా శ్రమదానం కార్యక్రమం కాంట్రాక్టు పద్ధతులకి స్వస్తిచెప్పి ప్రజలని భాగస్వాములని చేసి డిగ్నిటి ఆఫ్ లేబర్ లోని ఆత్మతృప్తి అందరికి అర్ధంకావాలని చేపట్టిన కార్యక్రమం.
    'జన్మభూమి' కార్యక్రమం ఎవరో వస్తారని, ప్రభుత్వమే అన్నీ చెయ్యాలని ఎదురుచూస్తూ కూర్చోకుండా ప్రభుత్వం అందిస్తున్న సహాయం అందిపుచ్చుకుని గ్రామస్థులు కానీండి, కాలనీవాసులు కానీండి వారివారి పరిసర ప్రాంతాలలో సమస్యలని తీర్చుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు పుచ్చుకుని చిన్న చిన్న పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
    ప్రభుత్వ ఉద్యోగులు వారివారి పనులు సక్రమంగా నిర్వర్తిస్తున్నది, లేనిది మధ్యమధ్య తనిఖీలు చేస్తుంటే ఉద్యోగులలో నిర్లిప్తత దూరం అయి పనులు త్వరితగతిన జరుగుతాయన్న ఆశాభావంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టాను. ప్రజలకు సేవచేయడానికే ప్రభుత్వం వుంది. ఆ ప్రభుత్వోద్యోగులు తమ విధులు సక్రమంగా చేయకపోతే ప్రజలు నిలదీయాలు. మనకెందుకొచ్చిన గొడవ, వీళ్ళతో తగువులు ఎందుకు పడడం అన్న నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి ప్రజలలో పోనంతవరకు ప్రజలలో చైతన్యం రానంతవరకు ఏ ఆఫీసు, ఏ వూరు, ఏ దేశం బాగుపడదు. తమ నియోజకవర్గ ప్రతినిథిని నిలబెట్టి అడిగి పనులు చేయించుకోవాలి. కేశవరావుగారు చెప్పినట్టు ఇకమీదట మూడునెలలకి ఓసారి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరుని పరిశీలిస్తాం.
    అసలు ప్రతి నియోజకవర్గానికి గవర్నమెంటు ఎంత నిధులు యిచ్చింది. ఏ ఏ పనుల నిమిత్తం యిచ్చింది అన్న వివరాలు ప్రతి గ్రామ పంచాయితీకి పంపిస్తాం. ఆ ప్రకారం పనులు చేయించుకోవాల్సిన బాధ్యత ఆ వూరి పంచాయితీ ప్రెసిడెంటుది. నిజాయితీ వున్నవారు ఎవరికీ భయపడనక్కరలేదు. ప్రభుత్వం ప్రజలకోసం ఎన్నెన్నో ప్రయోజనకర పథకాలు ప్రవేశపెట్టినా అవి సరిగా ప్రజలకు చేరకపోవడానికి కారణం ప్రజలలో అవిద్య, నిర్లక్ష్య ధోరణి. ఏదీ తనంతటతాను మీ దగ్గిరకి రాదు. అడిగి అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజలది అని మరోసారి మనవి చేస్తున్నాను.
    జవహర్ రోజ్ గర్, మహిళా అభ్యుదయ పథకాలు, శిశిసంక్షేమ పథకాలు అమలు సరిగా జరగాకపోవడానికి కారణం ప్రభుత్వోద్యోల అవినీతి ధోరణా, అలసత్వమా, ప్రజాప్రతినిధుల స్వార్ధచింతనా ఎవరిని తప్పుపట్టాలి అన్నది పెద్ద ప్రశ్న.
    కేశవరావుగారన్నట్టు అపోజిషన్ పార్టీ అంటే పాలక ప్రభుత్వం ఏ పనిచేసినా తప్పులు ఎంచడం అడ్డు తగలడం, విమర్శించడమే అనే మనస్తత్వం పోవాలి. ప్రభుత్వంలో తాముంటే ఏంచేసేవారం అన్నది ఆలోచించాలి ఒక్కసారి అనేముందు. వరదవచ్చినా, పంటలు పండకపోయినా, బాంబులు పేలినా అన్నింటికి ముఖ్యమంత్రే కారణం అనడం హాస్యాస్పదం. ప్రభుత్వం చేసే మంచిపనులలో అపోజిషన్ పార్టీ పాలుపంచుకోవాలి. అంతేగాని అడుగడుగునా చేసేవారిని విమర్శిస్తుంటే చేసేవారికి ఉత్సాహం ఉండదు.
    డాక్టర్ గారన్నట్టు ఒక లిమిట్ తరువాత డబ్బుకి విలువ వుండదు. నేను ఎన్ని కోట్లు తింటాను. నాలుగొందల కోట్లు పనిలో ముఖ్యమంత్రి రెండువందల కోట్లు తిన్నాడన్న ఆరోపణలు ఎంత సత్యదూరంగా, హాస్యాస్పదంగా వుంటాయి. నేను, నా ఫ్యామిలీ కాఫీ, టీ, టిఫిను, భోజనం అందరూ తలో వందరూపాయల నోటు ప్రతిసారీ మింగినా మా జన్మలకి ఆ కోటి నోటు తినలేం.
    ఒక లిమిట్ వరకు మనిషి కక్కుర్తి పడచ్చు. తను, తన భార్యాబిడ్డలు సుఖ భవిష్యత్తు కోసం ఆరాటపడచ్చు. ఆ తర్వాత యింక డబ్బుకి విలువ ఏముంది. మీ అందరి సాక్షిగా, భగవంతుని సాక్షిగా ముఖ్యమంత్రిగా నేనొక్క రూపాయి నా స్వంతానికి వినియోగించుకోలేదని నేనంటే మీరు నమ్మకపోతే నమ్మించే సాధనం నా దగ్గిర లేదు.
    రాష్ట్ర ప్రగతే నా ధ్యేయం! అధ్యాయాన్ని సాధించడానికి మీరు నాకు అండగా నిలిస్తే చేసి చూపిస్తాను అని మరోసారి చెప్తున్నాను. నాకు కొంత టైమివ్వండి. కొన్ని పథకాలు రెండేళ్ళు, మూడేళ్ళు, కొన్ని ఐదేళ్ళు పదేళ్ళు పడతాయి. ఏ ఫలితం వెంటనే అందదు. బిడ్డ పుట్టగానే పరుగెత్తలేడు...ఒక ప్రాజెక్టు పూర్తిచెయ్యాలంటే ఒక ప్రభుత్వం కొన్నాళ్ళు నిలబడాలి. పదవిలోకి వచ్చాక అర్ధం చేసుకుని నిలబడడానికి కొంత టైము పడ్తుంది. తరుచు ప్రభుత్వాలు మారుస్తుంటే ఏ పని పూర్తవ్వదు. ఏం చేపట్టిన పథకాలు కొత్త ప్రభుత్వం రద్దు చేయవచ్చు, మార్చవచ్చు, కొన్ని అటకెక్కొచ్చు. అంచేత ప్రభుత్వ పనితీరు అర్థం కావాలంటే కొన్నేళ్ళు వేచిచూడాల్సి వుంటుంది. ఇది ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వానికి చేయూతనిచ్చి సహకరించాలి.
    కొన్ని పథకాలు చేపట్టినప్పుడు ముందు ప్రజలనుంచి విమర్శలు వస్తాయి. పెరుగుతున్న వాహనాల రద్దీకి రోడ్లు వెడల్పు చేయాలంటే కొన్ని అడ్డంకులు తొలగించాలి. కొన్ని ఇళ్ళు, షాపులు కొట్టేయాలి. అది ప్రభుత్వం దూరదృష్టితో చేస్తున్నపని అని అర్థంచేసుకోవాలి. ప్రభుత్వం పడగొట్టాలని ఆశించదు. తప్పని పరిస్థితిలో- అలాగే విద్యుత్ సంస్కరణలు లాంటివి విదేశాలలో అన్నీ ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తాయి. అప్పుడు కాంపిటీషనుంటుంది. ఉద్యోగులు చురుకుదనం లేకపోతే ఉద్యోగాలు పోతాయన్న భయంతో పనిచేస్తారు. ప్రైవేటీకరణ వల్ల లాభాలుంటాయి అన్నది ప్రజలు అర్ధంచేసుకోవాలని నా మనవి. విదేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అక్కడ టెలిఫోన్సు, పోస్టల్ డిపార్ట్ మెంటు, ఎలక్ట్రిసిటి, వాటర్ అంతా ప్రైవేటు సంస్థలు ద్వారానే నడుస్తాయి- పనితీరు మెరుగవుతుంది. ఇది అర్ధంచేసుకుని ప్రజలు సహకరించాలి. వాక్సిన్ కనిపెట్టినవాడిని తిట్టారు. ప్రజలు భయంతో దాక్కునేవారు ముందు. తర్వాత అది వారికి మంచి చేస్తుందన్నది అర్ధం చేసుకున్నారు. ఏ పని అయినా ఫలితం కావాలంటే కొంత నియంత ధోరణి అవలంబిస్తేనే పనులు జరుగుతాయి. దానికి ఈ రోజు నన్ను విమర్శించి తిట్టినావారే రేపు అర్ధం చేసుకుంటారన్న ఆశాభావం నాకుంది.
    కేశవరావుగారు కోరినట్టు ఈ వూరికి లిటర్నరీ ఆస్పత్రి శాంక్షన్ చేస్తాం. పౌల్ట్రీఫారం, డైరీ ఫారం లాంటివి వాటికి CMCY కింద యువత ముందుకువస్తే అప్పులు యిస్తాం. ఆయనకి, ఆయనకేకాదు ఓ మంచి పనికి ముందుకువచ్చేవారందరికీ మా సహాయం ఎప్పుడూ వుంటుంది.
    ఇది మీ వూరు,ఇది మీ రాష్ట్రం. దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. మీ "జన్మభూమి" రుణం మీ చేతనయినంతవరకు తీర్చుకునే ప్రయత్నం చేయండి. జన్మభూమి పిలుస్తుంది కదిలిరా...కదిలిరా...కదిలిరా అని... మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తూ- గ్రామాన్ని ఒక "మోడల్ విలేజ్"గా మార్చిన మీ అందరినీ అభినందిస్తున్నాను. "జై జన్మభూమి" - జై తెలుగుతల్లి ముఖ్యమంత్రి చాలా ఆవేశంగా ప్రసంగించి, ఉత్తేజంగా జై జన్మభూమి అనగానే ఊరంతా ముక్తకంఠంతో "జై జన్మభూమి" అని నినాదించారు.
                                      * సమాప్తం *