కంటినొప్పి

 

1. కన్ను ఎరుపు రంగులో ఉండటమే కాకుండా కనురెప్పలు అతుక్కుంటున్నాయా?

కళ్ళ కలక (కంజెంక్టివైటిస్)

2. కనురెప్పల పైనగాని, లోపలగాని, ప్రత్యేకంగా చీము గడ్డల లాంటివి ఏవైనా కనిపిస్తున్నాయా?

కనురెప్పల్లో తయారయ్యే స్టై

3. కంట్లో ఏదైనా పదార్ధం పడి మెరమెరలాడుతుందా?

కంట్లో నలుసు (ఫారిన్ బాడీ)

4. కళ్లు హఠాత్తుగా ఎరుపు రంగును సంతరించుకోవడంతోపాటు నొప్పిని కూడా కలిగిస్తున్నాయా? కళ్లు మసకబారడం గాని, దీపాల చుట్టూ చీకటి వలయాలు కనిపించడం గాని జరుగుతోందా?

నీటి కాసులు (గ్లాకోమా)

5. ముఖం పైన దద్దుర్లు లేచాయా?

సర్పి (హెర్పిస్ జోస్టర్)

6. ముందుకు వంగినప్పుడు కంటి నొప్పి ఎక్కువవుతుందా?

నిత్యరొంప (సైనసైటిస్)

 

కంటి వ్యాధులు, లక్షణాలు, చికిత్సలూ వీటికి సంబంధించిన వివరణలు ఎక్కువగా ఆయుర్వేద గ్రంథం 'సుశృత ఉత్తర తంత్రం'లో లభిస్తాయి. కంటి నొప్పికి సంబంధించిన సంహితా గ్రంథాలు వివిధ సందర్భాలలో వివిధ రకాలైన పదాలను ప్రయోగించాయి.

 

విస్తోదనం (సూదులతో గ్రుచ్చినట్లుండటం), స్తంభనం (బిగాదీసినట్లుండటం), సంఘర్షం (ఇసుకపోసినట్లుండటం), దాహం (మంటగా అనిపించడం), పాకం (పుండైనట్లు ఉండటం), ధూమాయణం (పొగలు సెగలు వస్తున్నట్లు వేడిగా అనిపించడం) వంటివి వాటిలో కొన్ని, కన్ను అనేది అన్ని ఇంద్రియాలలోకి ప్రధానమైదే కాదు, సున్నితమైనది కూడాను. ధూళి కణాలు ఎగిరివచ్చి కంట్లో పడినా, కనురెప్పలు కంట్లో ఇరుక్కుపోయినా కలిగే అసౌకర్యం ఇంతా అంతా కాదు. అయితే ఈ కారణాలన్నీ స్పష్టమైనవే కాకుండా తేలికగా కనిపెట్టగలిగేవి. వీటితోపాటు దృస్టిలోపం ఏదైనా సంభవించిందో లేదో చూడటం కూడా అత్యంత ఆవశ్యకం. ముఖ్యంగా కంటి లోపల ఏర్పడిన ప్రావేశిక గాయాల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. నొప్పి తగ్గినంత మాత్రాన అంతటితో ఆ సమస్య ముగిసినట్లు కాదు.


1. కళ్ళ కలక (కంజెంక్టివైటిస్):

కళ్ల కలక వలన కన్ను ఎర్రగా తయారవ్వటమే కాకుండా కనురెప్పలు అతుక్కుపోయే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ నుంచి ఎలర్జీల వరకూ ఎన్నో రకాల అంశాలు కళ్ల కలకను కలిగిస్తాయి. ఇన్ఫెక్షన్ వలన ఏర్పడిన కళ్ల కలకలో కన్నీరు విపరీతంగా కారుతుంది. కళ్లు మండుతాయి. అలాగే ఎర్రటి జీరలతో కనిపిస్తాయి. కంటి ఉపరితలం మీద చీము లాంటి పదార్ధం పేరుకుపోయి చూపును మసకబారేట్లు చేస్తుంది (రెప్ప వేసినప్పుడు మాత్రం కొంచెం సేపు చూపు స్పష్టంగా కనిపిస్తుంది) ఈ రకమైన స్థితి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. తోటి పిల్లలనుంచి జలుబు తదితర సాంక్రమిక వ్యాధులతో పాటుగా ఇది కూడా సంక్రమిస్తుంది.

 

ఎలర్జీ వలన వచ్చే కళ్ల కలకలకు దుమ్మును, ఎండ వేడిని, ధూళిని, పొగను, స్ప్రేలను, మేకప్ను, పుప్పొడి రేణువులను ఇంకా ఇలాంటి అసంఖ్యాక పదార్థాలను కారణంగా భావించవచ్చు. దీనిలో దురద ప్రధానంగా ఉంటుంది. కనురెప్పల మాటున ఏదో పదార్ధం ఇరుక్కునట్లుగా మెరమెరలాడుతుంది. కళ్ల కలకను ఆయుర్వేదంలో 'నేత్రాభిష్యందం' అంటారు. అభిష్యందం అంటే స్రవించడమని అర్థం. కంట్లో చేరిన అన్య పదార్థాలను వదిలించుకోవడానికి కళ్లు విపరీతంగా స్రవిస్తాయి. నిదాన పరివర్జనం (కారణాన్ని కనిపెట్టి తొలగించడం) అనేది దీనిలో ప్రధానమైనది ఆ తరువాత తర్పణం (కంటి చుట్టూ పిండితో ప్రాహారాన్ని నిర్మించి, కనురెప్పలు మునిగేలాగా ఔషధాలతో తయారైన నెయ్యిని కన్నుపైన ఉంచడం), పుటపాకం (నెయ్యిని కాకుండా కఠిన ద్రవ్యాల నుండి స్వరాసాన్ని తీసి తర్పనంలోలాగా కన్నుపైన ప్రయోగించడం), ధూమపానం (ఔషధీకృత దూమాన్ని పీల్చి వదలడం), ఆశ్చ్యోతనం (ఔషధాన్ని కంటిపైన ధారగా పోయడం), నస్యం (రెండు ముక్కురంద్రాలలోను ఔషధాన్ని చుక్కలుగా విడవడం), శిరోవస్తి (తలపైన ప్రహారాన్ని నిర్మించి వెంట్రుకలు మునిగేలాగా ఔషధ తైలాలను ఉంచడం), అంజనం (ఔషధాన్ని నీళ్లతోకాని పేస్టులాగా చేసి, కాటుక మాదిరిగా ప్రయోగించడం), బిడాలకం (కంటిపైన ఔషధాన్ని లేపనంగా ప్రయోగించడం) మొదలైన చికిత్సలను చేయాల్సి ఉంటుంది.


గృహచికిత్సలు: 1. ఆవు నెయ్యికి (రెండు చెంచాలు) పంచదారను (చెంచాడు) చేర్చి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. 2. త్రిఫలా కషాయాన్ని అరకప్పు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెంసు సార్లు తీసుకోవాలి. 3. వెలిగారం (బొరాక్స్) లేదా పటిక (ఆలం)ను వేడి నీటిలో కరిగించి కాంతిని కడగాలి. 4. మునగాకు నుంచి రసం పిండి కంట్లో డ్రాప్స్ గా వేయాలి.

 

ఔషధాలు: త్రిఫలాగుగ్గులు, త్రిఫలాఘృతం, అభ్రకభస్మం, స్వర్ణమాక్షీక భస్మం, బాహ్యప్రయోగం - నేత్రబిందు.

 

2. కనురెప్పల్లో తయారయ్యే స్టై:

కనురెప్పల వెంట్రుకలను మార్దవంగా, స్నిగ్ధంగా ఉంచడం కోసం వెంట్రుకల మొడళ్లలో కొన్ని నూనె గ్రంథులు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా అడ్డుకుపోతే లోపల్లోపలే స్రావాలు పేరుకు పోయి ఎరుపురంగులో బొడిపెల మాదిరిగా తయారవుతాయి. వీటిని ఇంగ్లీషులో 'స్టై' అనీ, ఆయుర్వేదంలో ఉత్సంగినీ పిటికలనీ అంటారు. వీటితోపాటు కనురెప్పలు కూడా వాచిపోయి నొప్పిని కలిగిస్తాయి. కళ్లను ఎక్కువగా నలుముకున్నా, అపరిశుభ్రమైన చేతితో ముట్టుకున్నా ఇన్ఫెక్షన్ పక్కకు ప్రసరించి పరిస్థితిని నిరంతర ప్రవాసనంగా మారుస్తుంది. ఉత్సంగినీ పిటికకు స్వేదన చేధనలను చికిత్సలుగా చేయాల్సి ఉంటుంది.


గృహచికిత్సలు: 1. ఒక చిన్న రుమాలును తీసుకుని, మడతలు పెట్టి, త్రిఫలాకషాయంలో ముంచి నీరంతా కారిపోయేలా గట్టిగా పిండండి. ఇలా రోజు మొత్తం మీద రెండుమూడుసార్లు చేయండి, దీనితో చీమంతా ఒక దగ్గరకు చేరి చీముగడ్డ దానంతట అదే పగిలిపోతుంది.

 

ఔషధాలు: త్రిఫలా గుగ్గులు, గంధకరసాయనం, బాహ్యప్రయోగం - చంద్రోదయవర్తి.

 

3. కంట్లో నలుసు:

కంట్లో నలుసు పడితే నీళ్లు కారడంతోపాటు అసౌకర్యంగా ఉంటుంది కూడా. వాహన చోదకులలో - ముఖ్యంగా ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వారిలో ఇలాంటి సందర్భాలెక్కువ. ఒక్కొక్కసారి కనురెప్పల వెంట్రుకలు కూడా కళ్లలో ఇరుక్కుని అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో పసిపాపాయిల చేతి గోళ్లు తల్లుల కళ్లలో గుచ్చుకుని మెరమెరలాడటం జరుగుతుంది. తాపీ పనివారు, లేత్ మిషన్లు మీద పనిచేసే వారు, వడ్రంగులు - వీరందరికీ ఇతరులకంటే ఎక్కువగా కంట్లో నలుసులు పడే అవకాశాలున్నాయి.


సూచనలు: కంట్లో ఏదన్నా అన్య పదార్ధం పడి మెరమెరలాడుతున్నప్పుడు తొందరపడి నలపకూడదు. ఒకవేళ నలిపితే ఆ పదార్థం మరింత లోపలి భాగాలలోకి చొచ్చుకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఒక క్రమపద్ధతి ప్రకారం చేస్తే కంట్లో నలుసులు తేలికగా బయటకు వచ్చేస్తాయి.

 

కంట్లో పడిన నలుసును తీయబోయే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కింద కనురెప్పను కింది వైపుకులాగి దానిలోపలి ప్రదేశాన్ని పరీక్షించాలి. ఒకవేళ అన్య పదార్థమేదైనా ఉంటే ఒక రుమాలును తడిపి దాని కొసతో సున్నితంగా నలకను బైటకి తీసివేయాలి. ఈ పనికి పొడి దూదిని ఎప్పుడూ ఉపయోగించకూడదు. కింది కనురెప్పలో నలక ఏదీ లేకపోతే పై కనురెప్పను పరీక్షించాలి. భాదితుడిని కిందికి చూడమని చెప్పి పై కనురెప్ప వెంట్రుకలను సున్నితంగా పట్టుకుని కింది కనురెప్పల మీదనుంచి కిందివైపు లాగాలి. ఈ చర్యతో కన్నీరు జనించి, కంటి నలుసు బైటికి వస్తుంది. 

 

ఈ పద్ధతి పనిచేయకపోతే మరొక పద్ధతి ఉంది. ఒక పెన్సిల్ ను గాని లేదా గాజు కడ్డీని (చివరలు పదునుగా ఉండకూడదు)తీసుకుని పై కనురెప్ప మీద అడ్డంగా ఉంచి వెంట్రుకలను లాగుతూ కనురెప్పను తిరగతిప్పాలి. ఇప్పుడు పై కనురెప్ప లోపలి భాగంలో ఇరుకున్న నలుసును చేతి రుమాలు కొనతో తేలికగా తొలగించవచ్చు. నలుసు బయటకు వచ్చిన తరువాత కనురెప్పను యథాస్థానంలోకి తీసుకురావాలి.

 

కొన్ని సార్లు ధూళి కణాలూ, లోహపు ముక్కలూ కనురెప్పల్లో కాకుండా, కంటి పారదర్శకపు పొరపైన ఇరుక్కుంటాయి. ఇటువంటి సందర్భాలలో ఓకే శుభ్రమైన పాత్రలో స్వచ్చమైన నీళ్లను తీసుకుని ముఖాన్ని అందులో ఉంచి, కళ్లను శుభ్రం చేసుకోవాలి. లేదా నీటి కుళాయికి అభిముఖంగా కళ్లను తెరిచి ఉంచాలి. నీటి ప్రవాహంతో పాటు నలక బైటకు వస్తుంది. ఈ పద్ధతులలో కృతార్థులు కాలేకపోతే వైద్య సహాయం తీసుకోవాలి.


4. నీటి కాసులు (గ్లాకోమా):

 

అధిమంధం (గ్లాకోమా) అనే స్థితిలో కంటినొప్పితోపాటు నేత్రాంతర్గతంగా ఒత్తిడి పెరిగిపోయి అంధత్వం ప్రాప్తిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందాలి.

 

గ్లాకోమా వ్యాధి రండు రకాలుగా ఉంటుంది. దీర్ఘకాలికమైనది ఒకటైతే స్వల్ప కాలికమైనది రెండవది.

 

మొదటి రకం క్రమక్రమంగా ప్రాప్తిస్తుంటుంది. కంటినొప్పి పెద్దగా ఉండదు కాని లోలోపల ఒత్తిడి పెరగిపోవడంతో చూపు మందగించిపోతుంది. దృష్టి క్షేత్రంలో నల్లటి వర్తులాకారాలు చోటు చేసుకుంటాయి. కొంతకాలం ఇలాగే కొనసాగితే చుట్టూ అంధకారమై మధ్యలో మాత్రమే చూపు కనిపించే దశ వస్తుంది. స్వల్ప కాలికమైన గ్లాకోమా కంట్లో హఠాత్తుగా ఒత్తిడి పెరిగిపోవడం వలన ప్రాప్తిస్తుంది. దీనిలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంది. 40 సంవత్సరాలు దాటినప్రతివారూ కనీసం రెండు మూడు సంవత్సరాలకొకసారి నేత్ర పరీక్ష చేయించుకోడం అవసరం. ఈ వ్యాధి ఉన్నవారు వైద్యుణ్ని కలవాలి.


5. సర్పి (హెర్పిస్ జోస్టర్): హెర్పిస్ వ్యాధి - ముఖ్యంగా షింగిల్స్ లో నుదురు, ముఖం, కళ్లు మొదలైన ప్రదేశాలలో దద్దుర్లు వస్తాయి. ఇన్ఫెక్షన్ కళ్లకు చేరి కంటినొప్పిని, అంధత్వాన్ని కలిగించేందుకు అవకాశముంది.

ఔషధాలు: స్వర్ణ భస్మం, రససింధూరం, త్రిఫలాఘృతం.

 

6. నిత్యరొంప (సైనసైటిస్): ముందుకు వంగినప్పుడు కంటినొప్పి ఎక్కువకావడమనేది సైనసైటిస్ లక్షణం. సైనస్ లనేవి ముఖంలోపల ఉండే గాలి గదులు, ఇవి కళ్ల చుట్టూ ఆవరించి ఉంటాయి. ఇవి వ్యాధిగ్రస్తమైతే కంటిలోపల కూడా నొప్పి జనించే అవకాశం ఉంది. సైనసైటిస్ వ్యాధికి లక్షణాత్మకంగా కాకుండా, శాశ్వత ప్రాతిపదికన చికిత్సలను చేయాల్సి ఉంటుంది. దీనికి మహాలక్ష్మీ విలాస రస, కాంచనార గుగ్గులు తదితర మందులను వాడాల్సి ఉంటుంది.

 

గృహచికిత్సలు: 1. తులసి, అల్లం, ఎలాక్కాయలు, మిరియాలు, మునగాకులను కషాయం కాచుకుని తాగాలి. 2. వావిలి రసం (పావులీటరు), నువ్వుల నూనె (పావులీటరు), ఉల్లిముద్ద (పావుకిలో) వీటినన్నిటిని కలిపి సన్నని సెగమీద ఉడికించాలి. నూనె మాత్రం మిగులుతుంది. దీనిని రోజువారిగా తలకు రాసుకోవాలి. 3. తుమ్మి ఆకులను (గుప్పెడు), వెల్లుల్లి గర్భాలను (మూడు), ఉప్పును (చిటికెడు కలిపి ముద్దచేసి రసం పిండాలి. దీనిని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్ గా నాలుగైదు రోజులు వేసుకోవాలి.

 

ఔషధాలు: ఆరోగ్య వర్ధీనీ వటి, చిత్రక హరీతకి, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజు గుగ్గులు, నవక గుగ్గులు, నవాయన చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజు గుగ్గులు, పైకి వాడాల్సినవి- అసన బిల్వాది తైలం, బలా గుడూచ్యాది తైలం, బలాశ్వగంధాది తైలం, రాస్నాది చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫలాది తైలం.