చివరికి అతను తన పంతం చెల్లించుకున్నాడు. ఆ పిల్లవాణ్ణి బలవంతంగా తీసికెళ్ళాడు, చూడాలని వున్నప్పుడు రావచ్చని అంతే!.... ఆమె అప్పుడు స్పృహ తప్పి మరి రెండు రోజుల వరకు తెలివి రాలేదు. ఆతర్వాత తెలివచ్చాక.....ఆ పిల్లవాడి ధ్యాస తప్పించి మన తెలివి లేదు. కొడుకుని వెతుక్కుంటూ తిరగడం , పిలవడం , అన్నం కలిపి కంచం ముందు లేని రాజాకి తినిపించడం , బట్టలు పౌడరు అన్ని సిద్దం చేసుకుని లేని రాజాకి ముస్తాబు చేయడం కోసం కూర్చోడం, రాత్రి ప్రక్కన ఖాళీ జాగాని , ఏ దుప్పటినో జోకోడ్తూ కబుర్లు చెప్పడం యివన్నీ చేస్తుంది.
    ఆమె రాజాకోసం వెతికినప్పుడల్లా , తల్లి తండ్రీ ...." ఆ గదిలో వున్నాడమ్మా అన్నం తిన్నాడమ్మా , బట్టలు నేను తొడిగానమ్మా, నువ్వు అన్నం తిని పడుకో తల్లీ" అంటూ నచ్చ జేపుతారు ఆమెకి తన అవసరాలు తీర్చుకునే తెలివి పోయింది. పాపం , అన్నీ ఆతల్లే చెయ్యడం ఆమె అన్నం పెట్టి తలదువ్వి బట్టలు కట్టబెడ్తుంది.
    శేఖర్ వాళ్ళదీ మరీ ఆధునిక కుటుంబం! "ఆ యింట్లో అందరూ మరీ నవనాగరికులు. వీళ్ళు తర్వాత తెలిసికొన్న దాన్ని బట్టి ....ఆ యింట్లో అడ, మగ అందరి మీద పాశ్చాత్య ప్రభావం చాలా వుంది. ఒక అక్క ఎవరో విదేశీయుడిని పెళ్లి చేసుకుని అక్కడే వుండిపోయింది. యింకో అన్నయ్య అంతే. ఒక చెల్లెలు భర్తకి విడాకులిచ్చి ఉద్యోగం చేసుకుంటుంది. యిహ యీ శేఖర్ ఒక్కడినైనా సవ్యంగా మన పద్దతుల్లో సవ్యంగా తీసుకురావాలని తల్లి తండ్రి పెళ్ళి చేసుకోమంటే వాళ్ళ బలవంతం వల్ల పెళ్లి చేసుకుని యిలా వెలగబెట్టాడు అతను. ఆ తల్లి దండ్రుల కోసం వాళ్ళ ముచ్చట కోసం , వంశాకురం కోసం వాళ్ళ కోరిక ప్రకారం ఈ పసివాణ్ణి తల్లి నించి వేరుచేసి వాళ్ళ కప్పగించాడు. అంతస్తు పాటించక , సంప్రాదాయం, వంశం , గౌరవం ఏ మంచి చెడు విచారించక, పై మెరుగులకి మోసపోయి గోతిలోకి దిగామని తల్లీ దండ్రీ వాపోతారిప్పుడు కాని ఏం లాభం! చేతులు కాలక ఆకులూ పట్టుకుని?
    యీలోగా ఆమెకి పూర్తిగా మతి చెడింది. ఎన్ని వైద్యాలు చేయించినా లాభం లేకపోయింది. పిల్లవాణ్ణి పంపిస్తే బాగు పడుతుందని వీళ్ళీంక ప్రాధేయపడుతూ రాసినా అతను జవాబైనా రాయలేదు. ఏళ్ళు జరిగిపోయాయి. వీళ్ళు ఆత్మాభిమానం చంపుకుని ఆమెని తీసుకుని డిల్లీ వెళ్ళి పిల్లవాడిని చూపించారు . తండ్రిని మించి ఆధునికంగా తయారయిన పన్నెండేళ్ళ రాజా "తల్లి' అంటే నమ్మలేదు. నిర్మల కూడా అతన్ని చూసి "కొడుకు" అంటే నమ్మలేదు. "వీడు నా రాజాకాదు ! నా రాజా ఇంత వాడెక్కడ? నా బాబు నాకు తెలియదా?" అంటూ ఎవరినో చూపించి తనని మోసగిస్తున్నారన్నట్టు మాట్లాడిందిట. ఆమె స్మ్ర్తుతి పధంలో నాలుగేళ్ళ రాజాయే నిలిచాడు.
    ఇంక వీళ్ళు పూర్తిగా ఆశ వదులుకున్నారు. ఏదో వాళ్ళున్నన్నాళ్ళు వాళ్ళు చూస్తారు! తర్వాత ఆమె గతి ఏమిటి? ప్రతిరోజూ ఎక్కడికో అక్కడికీ "రాజా! రాజా" అంటూ వెళ్ళిపోతుంది. చూశావుగా మా యింట్లోకి ఎలా వచ్చిందో!..... వీళ్ళు వెతుక్కు తెచ్చుకుంటారు . పాపం..... ఆమెని చూస్తుంటే ఎలాంటి మనిషి ఎలా అయిపొయిందని ఏంతో బాధగా వుంటుంది.
    "ఆమెని చూడగానే నాకేమనిపించిందో తెలుసా! ఎవరో నీకోసం వచ్చారు గాబోలు ..... యీ అడస్నేహితులేప్పటి నించా అని ఆశ్చర్యపోయాను. చూడ్డానికి మాములుగానే వుంది గదూ?" నవ్వాడు మూర్తి తనలో పెల్లుబికే విచార ఉద్రేకాల్ని పైపైన కప్పిపుచ్చుకోచూస్తూ.
    'అంతా మామూలేనండీ! పాపం ఈయనకే ఎక్కడలేని జాలి, సానుభూతి" అప్పుడే వచ్చిన లలిత అంది కొంచెం కొంటెగా నవ్వుతూ. ఆమె గ్లాసులు తీసుకుని వెళ్ళాక. "ఏం కధ? ఏం లేకుండా అలా అంటుందేమిటి? ఆవిడ?" మూర్తి కొంటెగా వేళాకోళం చేశాడు.
    "ఎడిశావులే! అదేం కాదు. లలిత వచ్చిన క్రొత్తలో నీకు చెప్పినట్టే ఆవిడకీ యీ కధ అంతా చెప్పాను. అందులో కొంటెతనానికి పోయి కాలేజీ రోజుల్లో ఆవిడ్ని నేనెంతగా ఆరాధించి వర్ణించాను. ఆమెకి పెళ్లవుతూంటే నేపాడిన విరహగీతాలు వినిపించాను. అది విని యిప్పటికీ నిర్మలంటే నాకేదో వుందని ఆవిడ అనుమానం. అందుకే అప్పుడప్పుడు హాస్యంగా యిలా దేప్పుతూంటుంది. నిర్మల గురించి అలా అనుకోవడమే పాపం!"
    'అవునులే.....ఏదో సరదాగా అన్నాను....అంతే!" మూర్తి గాడంగా నిట్టూర్చి లేచాడు.
    "ఏనాడో ఆమె చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తుంది. ఆ శిక్ష ముగిసే దేప్పటికో!' రామం బరువుగా అన్నాడు.

                                                                                           *    *    *    *
    
    ఆ శిక్ష మరికొన్ని రోజులకే ముగిసింది.
    "పాపం నిర్మల చనిపోయింది తెలుసా!" ఆరోజు ఆఫీసులో మూర్తితో అన్నాడు రామం.
    "ఏ నిర్మల?"
    "అదే! మా ఎదురింటి అమ్మాయి. ఆరోజు చూశావు గదా!"
    "ఆ....ఆ,.... నిజమే? ఎలా చనిపోయింది? ఆత్రుతగా అడిగాడు మూర్తి.
    "నిన్న సాయంత్రం వీధిలో మాములుగా రాజాని వెతుకుతూ పిలుస్తుంది. రోడ్డు మీద ఎవడో నాలుగేళ్ళ అబ్బాయి బంతి ఆడుతున్నాడు. అటు నించి ఓ లారీ వేగంగా వస్తుంది.....ఆ అబ్బాయిని రాజా అనుకుని, లారీ క్రింద పడతాడనుకుంది కాబోలు 'రాజా .....రాజా.....లారీ.....లారీ" అంటూ పరిగెత్తింది. ఆ అబ్బాయి తప్పుకున్నాడు గానీ, ఆమె లారీ క్రింద పడింది."
    "సుఖపడింది " అన్నాడు మూర్తి బరువుగా.
    'అవును , యింక ఏ రాజా ఏమైనా ఆమె కక్కరలేదు ......యింక ఏ రాజాని వెతుక్కోనక్కరలేదు ఆమె!" నిట్టురుస్తూ అన్నాడు రామం.

                                                          ***