బహిష్టులు కనపడకపోవటం

 

1. ఇంతకూ ముందు మీకు బహిష్టులు నెలనెలా సక్రమంగా కనిపిస్తూ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో హఠాత్తుగా ఆగిపోయాయా?

గర్భధారణ (పెగ్నేన్సీ)

2. గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?

గర్భనిరోధక మాత్రల దుష్ఫలితం

3. మీరు బిడ్డకు పాలిస్తున్నారా?

స్తన్యాన్నివ్వటం వలన కలిగే మార్పు (బ్రెస్ట్ ఫీడింగ్)

4. మీకు అసలింతవరకు బహిష్టులే మొదలుకాలేదా?

రజస్వల కాకపోవటం (ప్రైమరీ ఎమనోరియా)

5. మీరు ప్రతిదానికి ఆందోళన పడుతుంటారా?

భావోద్వేగాలు / మానసిక ఆందోళన

6. మీరు ఎత్తుకి తగిన లావు లేరా? లేదా, శక్తికి మించి శ్రమ పడటం, ఎక్కువగా వ్యాయామాలు గట్రా చేస్తున్నారా? లేదా, సత్వరమే బరువు తగ్గే కార్యక్రమాలు మొదలు పెట్టి 'క్రాష్ డైటింగ్' చేస్తున్నారా?

పౌష్టికాహార లోపం (మాల్ న్యూట్రిషన్)

7. మీరు నలభయ్యేపడిలో పడ్డారా? లేదా, ఏదైనా కారణం చేత మీ అండాశయాలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించారా?

రజోని వృత్తి (మొనోపాజ్)

8. ఇవీవల కాలంలో మీ బరువులో మార్పు వచ్చిందా? అలాగే, అవాంచిత రోమాలు కనిపిస్తున్నాయా?

అండాశయాల్లో కణితులు / ఎడ్రినల్ గ్రంథిలో పెరుగుదలలు (ఓవరియన్ ట్యూమర్స్/ ఎడ్రినల్ ట్యూమర్

 

మాసానుమాసం సక్రమంగా జరిగిపోవాల్సిన రుతుక్రమంలో తేడాలు చోటుచేసుకుంటే మహిళలు బాగా ఆందోళన చెందుతారు. అధిక రుతుస్రావం ఎంతటి ఆందోళన కలిగిస్తుందో బహిష్టు కనపడకపోవటమూ అంతే కంగారు పుట్టిస్తుంది. రుతురక్తం కనపడకపోవడానికి ఆయుర్వేదంలో నష్టార్తవం అంటారు. అర్ధాంతరంగా నష్టార్తవం సంభవించినప్పుడు ఏదైనా కొత్త వ్యాధి వచ్చిందేమోనని మహిళలు కంగారుపడతారు. నిజానికి ఈ స్థితి అంత పెద్ద సమస్యాత్మక వ్యాధేమీ కాదు. సరైన చికిత్సలతో తేలికగానే తగ్గిపోతుంది. యవ్వనంలో ఉన్న మహిళలు నష్టార్తవం ప్రాప్తిస్తే భవిష్యత్తులో తమకు పిల్లలు పుట్టరేమోనని భావించుకొని భయపడుతుంటారు. అయితే బహిష్టులు కనపడకపోయినప్పటికీ అండం విడుదలయ్యే అవకాశం ఉండనే విషయం గమనించాలి. అంటే, నెలనెలా రుతురక్తం కనిపించకపోయినప్పటికి గర్భధారణకు అవకాశం ఉంటుందన్న మాట. నష్టార్తవం అనేది అసౌకర్యాన్నీ, ఆందోళననూ కలిగిస్తుంది కనుక దీని గురించి సమగ్రంగా తెలుసుకోవటం అవసరం.

1. గర్భధారణ (ప్రెగ్నెన్సీ):

శరీరంతర్గంతంగా హార్మోన్లలో తేడాలు సంభవించినప్పుడు బహిష్టులు ఆగిపోతాయి అందరకీ తెలిసిన హార్మోన్ల తేడా గర్భధారణ. మీరు వివాహిత అయ్యుండి. దాంపత్య జీవితాన్ని నిలకడగా కొనసాగిస్తున్నట్లయితే నష్టార్తవం సంభవించినప్పుడు ముందుగా మీరు ఆలోచించాల్సింది గర్భధారణ గురించే. అనుకున్న రోజుకు బహిష్టు రాకపోతే ప్రెగ్నెన్సీ టెస్టు చేయిస్తే సరి.

2. గర్భనిరోధక మాత్రల దుష్ఫలితం:

గర్భనిరోధక మాత్రలు వాడే వారిలో కొంతమందికి బహిష్టు స్రావం తగ్గిపోయే వీలుంది. మరికొంతమందిలో బహిష్టులు పూర్తిగా ఆగిపోయే అవకాశం కూడా ఉంది. గర్భనిరోధక మాత్రల వాడకం తప్పదనుకుంటే వాటి వల్ల ఇలా బహిష్టుస్రావాలు తగ్గిపోయే అవకాశం ఉందనిగుర్తుపెట్టుకుంటే చాలు. ఈ లక్షణం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.

3. స్తన్యాన్నివ్వటం వలన కలిగే మార్పు (బ్రెస్ట్ ఫీడింగ్):

శిశువుకు పాలిచ్చే తల్లుల్లో హార్మోన్ల విడుదల కారణంగా నెలసరి కనిపించదు. ఈ కారణం చేతనే చాలా మంది తల్లులకు తమ పిల్లలకు పాలిస్తున్నంత కాలమూ బహిష్టులు కనిపించకుండా ఉంటాయి. శిశువుకు కనీసం ఆరునెలల వయసు వచ్చే వరకు తల్లికి తదుపరి గర్భధారణ జరగకుండా నిరోధించడానికి శరీరం ఎంచుకున్న సహజ గర్భనిరోధక విధానమిది, అలాగని, బిడ్డకు పాలిస్తున్నంత మాత్రాన నిశ్చయంగా గర్భం రాదని భావించకూడదు; ఇదొక అవకాశం మాత్రమేనని గుర్తించుకోవాలి.

4. రజస్వల కాకపోవటం (ప్రైమరీ ఎమనోరియా):

ఆడపిల్లల్లో మొదటిసారి రజోదర్శనం జరగాల్సిన సాధారణం వయసు పదకొండు లేదా పన్నెండు సంవత్సరాలు. ఇలా కాకుండా 15-16 సంవత్సరాలు వచ్చిన తరువాత కూడా బహిష్టులు మొదలవ్వకపోతే ఏదన్నా అంతర్గత సమస్య ఉందేమో చూడాలి. అప్పటికి, మీ వంశంలో ఎవరికైనా ఆలస్యంగా బహిష్టులు మొదలై ఉంటే (బహిష్టుపైన అనువంశికత ప్రభావం ఉంటుంది కాబట్టి) మీరు మరికొంత కాలం వేచి చూడవచ్చు. విపరీతమైన భావోద్వేగ తీవ్రతల వల్ల కూడా నష్టార్తవం కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులను కోల్పోవటం, కొత్త స్కూల్లో చేరటం, కొత్తగా ఏర్పడిన 'ప్రేమ' వంటి సంబంధ బాంధవ్యాలను సరైన పంథాలో స్వీకరించలేక పోవడం, పరీక్ష తప్పడం వంటివి బహిష్టుక్రమాన్ని అడ్డుకుంటాయి. అలాగే రక్తాల్పత, క్రుంగుబాటు వంటి రుగ్మతలు నష్టార్తవాన్ని కలిగించగలవనే విషయాన్ని విస్మరించకూడదు. మన దేశంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న అనేక లక్షల మంది ఆడపిల్లల్లో బహిష్టులు మొదలుకాకపోవడానికి ఒక ప్రధాన కారణం పౌష్టికాహార లోపమేనని చెప్పక తప్పదు, అధికాదాయపు వర్గాలు, వారిని అనుకరించే మధ్య తరగతి వర్గాలకు చెందినా నష్టార్తవంతో సతమతమవటం ఇటీవల ఎక్కువగా కనపడుతుంది. నష్టార్తవం ఉన్నప్పుడు ఈ కారణాలన్నిటిని అన్ని కోణాలనుంచి విశ్లేషించి, అవసరమైతే రక్తపరీక్షలు. ఇతర పరీక్షలూ నిర్వహించి తదనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఔషధాలు: నష్టపుష్పాంతకరసం, రజఃప్రవర్తనీవటి, టంకణభస్మం, కుమార్యాసవం.

5. భావోద్వేగాలు / మానసిక ఆందోళన:

ఆందోళన వల్ల మానసిక అస్థిరత ప్రాప్తిస్తుంది. దీని ఫలితంగా మెదడులోని బహిష్టులను నియంత్రించే ప్రదేశం ప్రభావితమై బహిష్టులు ఆగిపోయేలా చేస్తుంది.

ఔషధాలు: నారసింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబలా తైలం, అశ్వగంధారిష్టం, సర్పగంధా చూర్ణం, స్వర్ణముక్తాది గుటిక.

బాహ్యప్రయోగం - బ్రాహ్మీ తైలం.

6. పౌష్టికాహార లోపం (మాల్ న్యూట్రిషన్):

ఎత్తుకుతగ్గ లావు లేకపోవటం, శక్తికి మించి శ్రమపడటం, లేదా అధికంగా వ్యాయామం చేయటం, సత్వరమే బరువుతగ్గే ప్రయత్నాలు చేయటం వంటి చర్యల వల్ల శరీరం తనకేదో 'కరువు' రాబోవుతున్నదని భావిస్తుంది.శక్తిని కాపాడుకునే నిమిత్తం అన్ని శారీరక విధులనూ తగ్గించేసుకుంటుంది. దీని ఫలితంగా, మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంథి అప్రమత్తమై బహిష్టులను తాత్కాలికంగా నిలిచిపోయేలా చేస్తుంది. ఎనరెక్సియా, బులీమియా వంటి ఆహారసేవనకు సంబంధించిన రుగ్మతల్లో బహిష్టు స్రావం ఈ కారణం చేతనే కుంటుపడటాన్ని గమనించవచ్చు, శరీరం తాను ఉండాల్సినంత బరువుకు తాను చేరుకోగానే బహిష్టుక్రమాన్ని పునఃస్థాపించుకుంటుంది.

గృహచికిత్సలు: 1. పెన్నేరు చూర్ణాన్ని అరచెంచా) గ్లాసు పాలతో కలిపి రెండు పూటలా దీర్ఘకాలంపాటు తీసుకోవాలి. 2. శతావరి (పిల్లిపీచర గడ్డలు) చూర్ణాన్ని పూటకు అరచెంచాడు చొప్పున రెండు పూటలా పంచదార కలిపినా పాలతో పుచ్చుకోవాలి.

ఔషధాలు: అశ్వగంధాదిలేహ్యం, అశ్వగంధా ఘృతం, షడ్గుణసింధూరం, స్వర్ణమాలినీ వసంతరసం.

బాహ్యప్రయోగం - అశ్వగంధ తైలం.

7. రజోనివృత్తి (మొనోపాజ్):

కొంతమంది మహిళలకు రజోనివృత్తి (ముట్లుడగటం) అనేది నలభయ్యో ఏట నుంచే మొదలవుతుంది. వీరిలో ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల గణనీయంగా తగ్గిపోవటం వలన క్రమంగా బహిష్టులు ఆగిపోతాయి. అండాశయాలను తొలగించిన వారిలో కూడా ఇలాగే జరుగుతుంది.

సూచనలు: ఈ సమస్యకు అశోక, సోయాచిక్కుడు, సోపుగింజలు, జీలకర్ర వంటి ఫైటోఈస్ట్రోజన్స్ కలిగిన మూలికలను వాడాలి. వీటిని పుష్యానుగ చూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతక రసం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం.

8. అండాశయాల్లో కణితులు/ ఎడ్రినల్ గ్రంథి పెరుగుదలలు (ఓవరియన్ ట్యూమర్స్/ ఎడ్రినల్ ట్యూమర్స్):

అండాశయాలు, ఎడ్రినల్ గ్రంథులకు సంబంధించిన సమస్యలు మొదలైతే బహిష్టు క్రమం ఆగిపోతుంది. అలాగే, ఈ సమస్యల వలన మొటిమలు, చర్మం జిడ్డుగా తయారవ్వటం, అవాంఛిత రోమాల వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఔషధాలు: పుష్యానుగ చూర్ణం, రజఃప్రవర్తనీవటి, కుమార్యాసవం.