ఆకలి తగ్గటం
1. జ్వరంగా ఉందా?
శరీర ఉష్ణోగ్రత పెరగడం
2. ఆకలి తగ్గటంతో పాటు ఛాతిలో మంట, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, వాంతులు ఆలాంటి లక్షణాలు ఉన్నాయా?
జీర్ణాశయ సమస్యలు
3. ఏమన్నా అల్లోపతి మందులు వాడుతున్నారా?
మందుల దుష్పలితాలు
4. ఏ కారణం చేతనైనా ఆందోళనకు, ఉద్రిక్తతకు లోనయ్యారా?
మానసిక ఆందోళన
5. ఆకలి తగ్గటంతో పాటు నీరసంగా నిస్సత్తువుగా అనిపిస్తుందా?
కామెర్లు (జాండిస్ / హెపటైటిస్)
6. మీ బరువు హఠాత్తుగా తగ్గిందా?
ప్రమాదకర వ్యాధులు
7. ఛాతిలో నొప్పి వస్తుందా?
ఛాతి సంబంధ వ్యాధులు
నిద్ర సగం రోగాలను పోగొడితే ఆకలి అన్ని రోగాలను పోగొడుతుందని ఒక నానుడి. ఇది అక్షరాలా నిజం. ఆకలి తగ్గటం వల్ల కొన్ని రకాలైన వ్యాధులు వస్తే, కొన్ని రకాల వ్యాధుల వల్ల ఆకలి తగ్గుతుంది. అందుకే భైషజ్వ రత్నావళి అనే ఆయుర్వేద గ్రంథం, “వందల దోషాలు ప్రకోపించినప్పటికి, వందల వ్యాధులు వచ్చినప్పటికీ ఆకలిని కనుక రక్షించినట్లయితే ఆ రోగి జీవితం కాపాడబడుతుంది" అని పేర్కొంది.
జలుబు నుంచి ఎయిడ్స్ దాకా - చాలా చిన్న కారణం నుంచి పెద్ద కారణం వరకు - ఆకలిని తగ్గిస్తాయి. మీకు ఆకలి తగ్గినట్లయితే దాని వెనుక గల రుగ్మతను లేదా వ్యాధిని తెలుసుకొని సరిచేసుకోవడం ఎంతైనా అవసరం.
1. శరీర ఉష్ణోగ్రత పెరగటం: శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆకలి తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరగడానికి కారణాలు అనేకం. ఇన్ఫెక్షన్, రుమాటిజం, దెబ్బలు తగలడం, గాయాలవ్వడం, థైరాయిడ్ గ్రంథి పని తీరులో అసాధారణత చోటుచేసుకోవడం, వడ దెబ్బ, మితిమీరిన వ్యాయామం, బహిష్టు క్రమంలో భాగంగా అందం విడుదలయ్యేటప్పుడు ఇలా ఎప్పుడైనా, ఏ కారణం చేతనయినా ఉష్ణోగ్రత పెరగవచ్చు.
మన మెదడులో హైపోథాలమస్ అనేది శరీరపు ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. వివిధ కారణాల వలన దీనిలోని ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే వ్యవస్థ తాలూకు గరిష్టస్థాయి పెరుగుతుంది. ఫలితంగా శరీరం వేడెక్కిపోతుంది.
“జ్వరం వలన ఆహారాన్ని దహింపచేయాల్సిన జఠరాగ్ని జీర్ణావయవాల నుంచి బైటకు మళ్ళించబడుతుంది. ఫలితంగా ఆకలి మందగిస్తుంది" అని ఆయుర్వేదం చెబుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఆకలి తగ్గడం మనలో చాలా మందికి అనుభవమయ్యే ఉంటుంది.
సూచనలు: ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి కారణాన్ని కనుక్కుని తదనుగుణంగా చికిత్స చేస్తే జ్వరం తగ్గటంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. నవీన జ్వరాల్లో వేడి నీళ్లను తాగమని ఆయుర్వేదం సలహా ఇస్తుంది. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు అదుపులో ఉండటమే కాకుండా, ఆకలి కూడా పెరుగుతుంది. అలాగే, షడంగపానీయం అనే ఆయుర్వేద ఔషధం కూడా జ్వరాన్ని తగ్గించి ఆకలిని పెంపొందిస్తుంది. దీనిని కషాయం రూపంలో తీసుకోవాలి.
2. జీర్ణాశయ సమస్యలు: సహజమైన జీర్ణక్రియను దెబ్బతీసి ప్రతి కారణమూ ఆకలిని తగ్గించేస్తుంది. అన్ననాళిక లోపల పూత పూయడం (ఈసోఫెగైటిస్), అమాశయం లోపల పొరలు పుండవడం (గ్యాస్ ట్రైటిస్, అల్సర్లు) ఇలాంటివన్నీ ఆకలిమీద ప్రభావాన్ని చూపిస్తాయి. మలబద్దకం, పెద్ద పేగులోపల పుండ్లవడం (అల్సరేటివ్ కొలైటివ్) తదితర కారణాలు కూడా ఆకలిని, తినాలనే కోరికను తగ్గించి వేస్తాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు కారణానుసారం చికిత్స చేస్తే ఆకలి తిరిగి పెంపొందుతుంది.
గృహ చికిత్సలు: 1. కరక్కాయ పెచ్చులను, పటిక బెల్లాన్ని సమాన భాగాలుగా గ్రహించి, చూర్ణం చేసి, అరచెంచాడు మోతాదులో ఆహారానికి ముందు తీసుకోవాలి.
2.శొంఠి, ధనియాలను కషాయం కాచి, అర కప్పు మోతదుగా ఆహారానికి ముందు రెండు పూటలా తీసుకోవాలి.
3. కరక్కాయలు, పిప్పళ్లు, సౌవర్చలవణాలను సమాన భాగాలు తీసుకొని, చూర్ణం చేసి పావు చెంచాడు మోతాదుగా వేడి నీళ్లతోగాని, పెరుగు మీద తేటలోగాని సేవించాలి.
4. మంచి గంధాన్ని సాన రాయి మీద అరగదీసి, కాషాయం కాచి తీసుకోవాలి.
5. ఉసిరి పండ్ల పెచ్చుల చూర్ణాన్ని అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకోవాలి.
ఔషధాలు: అజీర్ణానికి చిత్రకాది వటి, భాస్కర లవణం, హింగ్వాష్టక చూర్ణాలనూ, కడుపులో మంటకు శంఖ భస్మం, సూతశేఖర రసం, అవిపత్తికర చూర్ణం, ధాత్రీ లోహాలనూ వాడాలి.
3. మందుల దుష్పలితాలు కొన్ని రకాల మందులకు ఆకలి తగ్గించే గుణం సైడ్ ఎఫెక్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా నొప్పి, జలుబులను తగ్గించేందుకు వేసుకునే చాలా రకాలైన మందులకు ఈ లక్షణం ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఈమందులన్నీ చాలామంది తమకు తామే యథేచ్చగా మెడికల్ షాపు నుంచి కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఆకలి మందగించడంతో పాటు, దద్దుర్లు రావడం, తలనొప్పి, కడుపులో మంట ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తునట్లయితే అవి మీరు వాడుతున్న మందు బిళ్ళల తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ గా గ్రహించాలి.
ఒకవేళ మీరు వాడే మందుల వలన ఆకలి మందగించిందని మీకనిపిస్తే మీకు చికిత్స చేస్తున్న డాక్టర్ కు ఆ విషయం చెప్పండి; మందులను మార్చాల్సిన అవసరం గాని, మోతాదును మార్చాల్సిన అవసరంగాని ఉండచ్చు.
4. మానసిక ఆందోళన: 'ఆనందంతో కడుపు నిండిపోవడ'మనే భావన ఎలా వ్యాప్తిలోకి వచ్చిందో తెలియదు గాని, ఆనందం వలన ఆకలి ఎక్కువవుతుంది తప్పితే తగ్గదు. అసలు ఆకలి తగ్గడానికి ప్రధాన కారణం మానసిక అలజడే. కొంతమంది తమకు తామే లావుగా ఉన్నామని భావించుకుని తెగ బాధపడిపోతుంటారు. వోరేచనానికి మందులు తీసుకుంటారు. బలవంతంగా వాంతిని చేసుకుంటారు. తమకు ఏది తోస్తే అది చేస్తారు. వేరే వాళ్ళు ఏం చెబితే అది చేస్తారు. ఈ తరహా ప్రవర్తన స్త్రీలలో - అది యుక్తవయస్కులలో ఎక్కువగా కనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీనిని 'అనరెక్సియా నెర్వోసా' అంటారు. దీనిలో ప్రధానమైన లక్షణం ఆకలి లేకపోవడమే. మానసిక కారణాల వలన ఆకలి మందగించినప్పుడు ఔషధాలతో పాటు 'అద్రవ్యభూత చికిత్స'లను చేయాల్సి ఉంటుంది. అద్రవ్య భూత చికిత్సలంటే మందులు లేకుండా చేసే చికిత్సలన్న మాట. సత్వావజయ చికిత్సలనేవి ఈ కోవకు చెందుతాయి.
ఔషధాలు: నారసింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబాలా తైలం, అశ్వగాంధారిష్టం, సర్పగంధా చూర్ణం, స్వర్ణ ముక్తాది గుటిక, యాకూతీ రసాయనం. బాహ్యప్రయోగం - బ్రాహ్మీ తైలం.
5. కామెర్లు (జాండిస్ / హెపటైటిస్) ఆకలి మందగించడమనే ప్రధాన లక్షణంతో పాటు బలహీనంగా, బడలికగా అనిపిస్తుంటే కామెర్లను గురించి ఆలోచించాల్సి ఉంటుంది, ఇలాంటి సందర్భాలలో కుడిప్రక్క ప్రక్కటెముకల క్రింద, కాలేయం ఉండే చోట, చేతి వేళ్లతో నొక్కితే కొద్దిగా నొప్పి అనిపించవచ్చు, కళ్ళు పచ్చదనాన్ని సంతరించుకోవచ్చు. అలాగే మూత్రం కూడా గాఢమైన రంగులో కనపడవచ్చు.
సూచనలు: కామెర్ల వల్ల ఆకలి కోల్పోయినట్లయితే దాని నుంచి బైటపడేంతవరకు పూర్తి విశ్రాంతిని, నిర్దేశిత ఔషధాలనూ తీసుకోవలసి ఉంటుంది. అలాగే, శోధన చికిత్సగా 'విరేచన కర్మ'ను చేయవలసి ఉంటుంది.
గృహచికిత్సలు: 1. నేల ఉసిరిక రసాన్ని పావు కప్పు మోతాదుగా చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి.
2. నవసాగరం (200మి.గ్రా) కటుక రోహిణి చూర్ణం (1 గ్రా.), కరక్కాయ పెచ్చుల చూర్ణం (12గ్రా.) అన్నీ కలిపి రోజుకు రెండు సార్లు నీళ్లతో తీసుకోవాలి.
3. త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసరం, ఆకులు, కటుకరోహిణి, నేలవేము, వేపపట్టలను సమభాగాలు తీసుకొని కషాయం కాచి అర కప్పు చొప్పున, చెంచాడు తేనె చేర్చి రెండు పూటలా తాగాలి.
ఔషధాలు: ఆరోగ్యవర్ధినీ వటి, అవిపత్తికర చూర్ణం, మండూర భస్మం, సూతశేఖర రసం, పిప్పల్యాసవం.
6. ప్రమాదకర వ్యాధులు ఎప్పుడైనా సరే ఆకలి మందగించడం తో పాటు హఠాత్తుగా బరువు తగ్గడం మొదలైతే ప్రమాదకరమైన వ్యాధుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన న్యోమోనియాలోనూ, ఇంకా గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ వ్యాధులు వీటన్నిటిలోనూ బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగే కడుపులో అల్సర్లూ, పిట్యూటరీ ;లేదా ఎడ్రినల్ గ్రంథి పనితీరు మందగించడం, రక్తాల్పత ఇవన్నీ బరువు తగ్గడానికి కారణాలే కనుక వీటన్నిటి గురించి ఆలోచించాలి. వీటికి తదనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.
7.ఛాతి సంబంధ వ్యాధులు: ఊపిరితిత్తులలో చీము గడ్డలు తయారైనప్పుడు, క్షయ వ్యాధికి లోనయినప్పుడు, రుమాటిజం వలన గుండె జబ్బు వచ్చినప్పుడు, అన్నవాహిక లోపల పూత పూసినప్పుడు ఈ సందర్భాలన్నింటిలోనూ ఛాతిలో నొప్పితో పాటు ఆకలి కూడా మందగిస్తుంది.
గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. వైద్య సహాయం తీసుకోవడం తప్పని సరి.