కళ్లు మూతలు పడిపోయేలా నిద్ర వస్తుంటేనో, ఏమీ తోచకుండా నిస్సారంగా ఉంటేనో ఆవలింతలు రావడం సహజం. కానీ అవతలివారు ఆవలించినప్పుడు మనకి కూడా ఆవలింత రావడంలో ఆంతర్యం ఏమిటి! ఒకోసారైతే ఆవలిస్తున్న ఫొటోని చూసినా, ఆవలింత అన్న మాట విన్నా కూడా మనలో ఆవలింత వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి చర్య వెనుక కారణం ఏమిటి!

శరీరం నిద్రాణంగా ఉన్నప్పుడు మనలోని శ్వాస కూడా నిదానిస్తుంది. ఇలాంటి సమయంలో ఒంటికి తగినంత ప్రాణవాయువు లభించదు. దాంతో అవసరమైనంత ఆక్సిజన్‌ని గ్రహించేలా ఎక్కువ గాలిని పీల్చుకునే ప్రయత్నం చేస్తాము. అదే ఆవలింత! ఇంతవరకూ బాగానే ఉంది. మరి ఒకరి ఆవలింత మరొకరికి ఎలా వ్యాపిస్తుంది? అనే ప్రశ్నకు అవతలివారితో మనకి ఉన్న అనుబంధమో, వారి పట్ల సహానుభూతి చూపడమో కారణం అనుకునేవారు. కానీ ఈ చర్య వెనుక భావోద్వేగాలు ఏమాత్రం కారణం కాదని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి.

 

-ఒకరిని చూసి వేరొకరు ఆవలించడం వెనుక మన జన్యువులే కారణం అని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. ఆ కారణంగానే కొంతమంది ఎదుటివారు ఆవలించిన వెంటనే నోరుతెరిస్తే, మరికొందరు మాత్రం తమకేమీ పట్టనట్లు ఉండగలుగుతారు. అంతేకాదు! ఈ ఆవలింతను నియంత్రించే జన్యువు మామూలు వ్యక్తులలో ఒకలా ఉంటే... ఆటిజం, స్కిజోఫ్రీనియా వంటి మానసిక వ్యాధులు ఉన్నవారిలో మరోలా ఉంది. కాబట్టి ఇదేదో అల్లాటప్పా జన్యువు కాదనీ, దీన్ని ఛేదిస్తే కనుక చాలా మానసిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందనీ భావిస్తున్నారు.

 

-ఆవలించడం వల్ల శరీరానికి ఎక్కువ ప్రాణవాయువు లభిస్తుంది కాబట్టి హాయిగా ఉంటుంది. మొహంలోని కండరాలన్నింటికీ ఓసారి పని చెప్పినట్లు ఉంటుంది. అందుకనే ఆవలింత అన్న విషయం గుర్తుకురాగానే మనిషి అందుకు సిద్ధపడిపోతాడన్నది కొందరు శాస్త్రవేత్తల మాట. ఇంత విచక్షణ పిల్లలలో ఉండదు కాబట్టే వారిలో ఒకరిని చూసి మరొకరు ఆవలించడం తక్కువని కూడా తేల్చేశారు.

 

- ఆవలించడం వల్ల శరీరం నిస్సత్తువని వదిలి అప్రమత్తమవుతుంది. కాబట్టి ఇది మనం అడవులలో బతికిన రోజుల నుంచి వచ్చిన అలవాటన్నది మరి కొందరి విశ్లేషణ. గుంపులో ఉన్నవారిలో ఒకరు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టడం వల్ల, వారిలో అప్రమత్తని పెంచేందుకు శరీరం ఆవలిస్తుంది. ఈ విషయాన్ని అతని చుట్టుపక్కల వారు కూడా అనుకరించడం వల్ల, వారు కూడా ప్రమాదం వస్తే ఎదుర్కొనేందుకో, పారిపోయేందుకో (fight or flight) సిద్ధపడిపోతారు.

 

-ఎదుటివారి మనసుని మెప్పించేందుకు తమకి తెలియకుండా వారిని అనుకరించే ప్రయత్నంలో కూడా ఆవలించవచ్చని అంటున్నారు. దీని వలన ఇద్దరు మనుషులూ ఒకే తరహాలో ప్రవర్తిస్తున్న భావన కలుగుతుంది కదా!

 

ఇన్ని కారణాలు చెప్పుకొన్నా కూడా ఆవలింతకు సంబంధించి ఇంతవరకూ స్పష్టమైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఆవలించేందుకు ఖచ్చితమైన కారణాన్ని కనుక్కొనేందుకు తీవ్రమైన పరిశోధనలు జరగాల్సి ఉందట!!!

 

    - నిర్జర.