(ఈరోజు వరల్డ్ స్లీపింగ్ డే)

నిద్ర మనిషికి అవసరమా?అయితే ఏ టైంకి పడుకోవాలి? అసలు మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి? ఇవి చాలా మందిని వేధించే ప్రశ్నలు. నిజానికి సరైన సమయానికి పడుకోక పోవడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా పసిపిల్లలు 12-18 గంటలు పడుకోవాలి. అదే మొదటి సంవత్సరంలో 14-15 గంటలు, మూడు యేళ్ళ వయస్సు దాక 12-14 గంటలు నిద్ర కావాలి, బడికి వెళ్ళే వయసులో 10-11 గంటలు, యుక్త వయస్సులో 8.5 నుంచి 9.5 గంటలు నిద్ర అవసరం. అదే పెద్ద వాళ్ళకి 7-9 గంటలు నిద్ర కావాలి అని నిద్ర శాస్త్రం చెబుతోంది. చాలామంది ఈ నిద్ర లేమి వల్ల బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని క్రమబద్ధమైన అలవాట్లు పాటిస్తే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. అందుకోసం  కొన్ని ఉపాయాలు చూద్దాం.

నిద్రకు ఆహార నియమం ఎంతో అవసరం. కరెక్ట్ టైంకి తినడం, కరెక్ట్ టైంకి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒక నిర్ధిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేళ తప్పవద్దు.

పగటి వేళల్లో అతిగా టీ, కాఫీలు తాగకూడదు. ముఖ్యంగా నిద్రపోవడానికి ఒక గంటముందు అసలు తాగకూడదు. ఎందుకంటే ఇవి నిద్ర చెడగొట్టే పానీయాలు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా, బాదం పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది.

పడక గది ఎలాంటి దుర్వాసన లేకుండా… శుభ్రంగా ఉండేలా... చిందర వందరగా లేకుండా  చూసుకోవాలి.

కొంతమందికి పగటిపూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. దీనివల్ల రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. అందువల్ల పగలు నిద్ర పోవడం మానుకోవాలి.

నిద్ర రానప్పుడు మీకు ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల చిన్నగా నిద్రలోకి జారుకుంటారు. నిద్రకోసం కొంతమంది నిద్రమాత్రలు వేసుకుంటారు. ఈ అలవాటు మానుకోవాలి. ఇవి ఆనారోగ్యానికి దారితీస్తాయి.

రోజూ పడుకునే చోటే పడుకుంటే నిద్ర తొందరగా వస్తుంది. పదే పదే పడుకునే స్థానాలని మార్చుకోవద్దు. కొత్త ప్రదేశం వల్ల నిద్ర సరిగా రాకపోవచ్చు. అదే విధంగా నిద్రపోవడానికి గంట ముందుగా ఎటువంటి వ్యాయామం చేయకూడదు.
తగినంత నిద్ర పోవడం ఎంత అవసరమో... ఎక్కువసేపు నిద్ర పోవడం అంత అనవసరం.

-పావని గాదం