మానవ శరీరంలో ఊపిరితిత్తులు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. ఇవి శరీర శ్వాస వ్యవస్థకు మూలకారణం. మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ ను గ్రహించి, కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు పంపడంలో ఇవి సహాయపడతాయి. ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేకపోతే శరీరానికి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించి  ఎదురయ్యే సమస్యలలో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముఖ్యమైనవి. ఇవి చాలా తీవ్రమైన సమస్యలుగా కూడా పరిగణించబడతాయి. ఒకప్పుడు ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే వస్తుందని అనుకునేవారు. ధూమపానం, మధ్యపానం అలవాట్లు ఉన్నవారికి వస్తుందని అనుకునేవారు. కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రస్తుతం యువతను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం ఆగష్టు 1వ తేదీన ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం, ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణా చర్యలు మొదలైన వాటి గురించి చర్చిస్తారు. ఏ కారణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రభావం పెరుగుతుందో తెలుసుకుంటే..

ఊపిరితిత్తుల క్యాన్సర్ చరిత్ర ఏమిటంటే..

ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ప్రస్తుతకాలంలో ఎంతోమందిని వేధిస్తున్న సమస్య. ఇది మనిషిని కబళించే వరకు బయటపడదు. దీని కారణంగా ఈ సమస్య వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటాయి. మొదట్లో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి సరైన ఆధారాలేవీ లభించలేదు. కానీ 1940- 50 సంవత్సరా మధ్య  చేసిన పరిశోధనలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ధూమపానం వల్ల కలుగుతుందని సాక్ష్యాలను చూపించినప్పుడు   నికోటిన్,  పొగాకు వల్ల  దుష్ప్రభావాలు కలుగుతాయని  ప్రజలు  గ్రహించారు. 21వ శతాబ్దం నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత జబ్బులు సాధారణ మరణాల పట్టిక స్థాయిలో  నమోదయ్యాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్  లక్షణాలు..

 తరచుగా దగ్గు లేదా న్యుమోనియా సమస్య చికిత్స తీసుకున్న తర్వాత కూడా తిరిగి వస్తుంటే అది ఊపిరితిత్తుల క్యాన్సర్  ప్రారంభ లక్షణాలుగా  పరిగణించబడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్  అత్యంత సాధారణ లక్షణాలలో  ఎప్పుడూ దగ్గు వేధిస్తూ ఉంటుంది. ఇంకా  శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, బొంగురుపోవడం, అనూహ్యంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు..

ఊపిరితిత్తుల క్యాన్సర్ కు  జీవనశైలిలో  అనేక  అలవాట్లు  కారణం అవుతాయి. ఈ అలవాట్ల నుండి జాగ్రత్త పడితే తప్ప ఈ సమస్యను దూరం పెట్టలేరు.

ఎక్కువ మందిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమయ్యే అలవాట్లు..

ధూమపానం ..

 smoking kills అని, smoking causes throat cancer అని ఇలా ప్రతీ సిగరెట్ ప్యాకెట్ మీదా బోలెడు  హెచ్చరిక రాసి ఉంటారు. ఇలా రాసినా కూడా ధూమపానం అంటే పడిచచ్చేవాళ్లు ఉన్నారు. సిగరెట్లు లేదా ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్,  క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)కి ప్రధాన కారణం. సిగరెట్ పొగ శ్వాసనాళాలను కుచించుకుపోయేలా  చేస్తుంది.  శ్వాస తీసుకోవడాన్ని  కష్టతరం చేస్తుంది. ఇది ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది. కాలక్రమేణా, సిగరెట్ పొగ ఊపిరితిత్తుల కణజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇండోర్ కాలుష్యం..

పేలవమైన ఇండోర్ ఎయిర్ క్వాలిటీ (IAQ) కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మనందరం రోజులో ఎక్కువ సమయం ఇళ్లు, ఆఫీసుల్లోనే గడుపుతాం కాబట్టి గాలి నాణ్యత సరిగా లేకుంటే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. సాధారణంగా బయటి గాలి చాలా కలుషితమని అనుకుంటాం. కానీ ఇంటి లోపల గాలి బయటి గాలి కంటే ఎక్కువ  కలుషితమవుతుంది.  దీని కోసం గదిలోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూసుకోవడం ఎంతో అవసరం. కిటికీలు, తలుపుల ద్వారా గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. గాలిని ఫిల్టర్ చేసే మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవాలి.  ఇంటి చుట్టు ప్రక్కల గాలి కాలుష్యానికి కారణమయ్యే వాతావరణాన్ని నిషేదించాలి.  కలుషిత నీటిలో , ముఖ్యంగా తాగే నీటిలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . దేశంలోని పలు ప్రాంతాలలో నీటిలో ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువగా ఉండటం ఆరోగ్య నివేదికలను కలవర పెడుతున్నవిషయం.

కొన్ని ఆసక్తికర విషయాలు..

జర్మన్ వైద్యుడు ఫ్రిట్జ్ లిక్కింట్ తన స్వదేశంలో ధూమపానానికి వ్యతిరేకంగా పోరాడాడు. అతను ప్రచురించిన ఒక నివేదిక  ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు,  ధూమపానానికి మధ్య అధిక సంబంధాన్ని రుజువు చేసింది.

అధికారిక సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 1.80 మిలియన్ల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణిస్తున్నారు, అయితే 2.21 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి.

 చాలా చిన్నవిగా కనిపించే ఈ రెండు సమస్యలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని సరిదిద్దుకోవడం ఎంతో అవసరం.

                                                              *నిశ్శబ్ద.